మన శరీరానికి ఆక్సిజన్ తరువాత కావల్సిన అత్యంత ఆవశ్యకమైన పదార్థాల్లో నీరు కూడా ఒకటి. ఆహారం లేకుండా మనం కొన్ని వారాల వరకు జీవించవచ్చు. కానీ నీరు లేకుండా 2 రోజులు కూడా జీవించలేం. అందువల్ల ప్రతి మనిషి కచ్చితంగా నిత్యం తగినంత నీటిని తాగాల్సిందే. అయితే మన శరీర రోగ నిరోధక శక్తిని పెంచడంలోనూ నీరు ఎంతగానో ఉపయోగపడుతుంది. అవును.. నిజమే.. దీనిపై వైద్య నిపుణులు ఏమంటున్నారంటే…
నిత్యం తగినంత నీటిని తాగడం వల్ల పలు అనారోగ్య సమస్యలు రాకుండా ఉంటాయి.
* కాల్షియం లవణాలు ఉండే నీటిని తాగడం వల్ల ఆర్థరైటిస్, ఆస్టియోపోరోసిస్, ఇతర కీళ్ల సమస్యలు రాకుండా ఉంటాయి. ఆయా సమస్యలు ఉన్నవారికి తగినంత నీటిని తాగితే ఉపశమనం లభిస్తుంది.
* నిత్యం తగినంత నీటిని తాగకపోతే మెదడు సెరటోనిన్, మెలటోనిన్ అనే సమ్మేళనాలను ఉత్పత్తి చేయదు. దీని వల్ల మానసిక సమస్యలు వస్తాయి. డిప్రెషన్ బారిన పడతారు. నిద్రలేమి సమస్య వస్తుంది.
* మన శరీర రోగ నిరోధక వ్యవస్థ మనం తాగే నీటి ద్వారా మన శరీరంలోని అన్ని భాగాలకు తెల్ల రక్త కణాలు, పోషకాలను సరఫరా చేస్తుంది. దీంతో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. ఇందుకు లింఫ్ గ్రంథులు సహాయం చేస్తాయి. అదే నీటిని తగినంతగా తాగకపోతే రోగ నిరోధక శక్తి తగ్గుతుంది.
* నిత్యం తగినంత నీటిని తాగడం వల్ల జీర్ణ ప్రక్రియ సాఫీగా జరుగుతుంది. దీంతో శరీరంలో అన్నిభాగాలకు పోషకాలు అందుతాయి. ఫలితంగా రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. అదే మలబద్దకంతో బాధపడేవారు అయితే ఆ సమస్య నుంచి బయట పడాలి. లేదంటే రోగ నిరోధక శక్తిపై అది ప్రభావం చూపిస్తుంది.
* మన శరీరంలో ఎప్పటికప్పుడు విష, వ్యర్థ పదార్థాలు ఉత్పన్న అవుతుంటాయి. వాటిని శరీరం బయటకు పంపించాలంటే మనం తగినంత నీటిని తాగాల్సి ఉంటుంది. లేదంటే అవి శరీరంలో పేరుకుపోయి అన్ని రకాల అనారోగ్య సమస్యలకు కారణమవుతాయి.
అందువల్ల నీటిని నిత్యం తగినంత తాగితే అటు శరీర రోగ నిరోధక శక్తి పెరగడమే కాదు.. ఇటు ఇతర అనారోగ్య సమస్యలు కూడా రాకుండా ఉంటాయి.