మహాభారతంలోని శకుని గురించి పెద్దగా పరిచయం అక్కర్లేదు. మహాభారతం లో యుద్ధానికి కారణమైన మెయిన్ సూత్రధారి శకునిగా భావిస్తారు. గాంధార రాజు సుభలుని కుమారుడు శకుని. కౌరవుల మామగా ప్రసిద్ధి చెందాడు. అతని కుటిల బుద్ధి పగతో నడిచే వ్యూహాలు మహాభారత కురుక్షేత్ర యుద్ధానికి దారి తీసాయి. చరిత్రలోనే చిరస్థాయిగా నిలిచిపోయిన అద్భుతమైన పాత్ర శకునిది. శకుని జీవితంలో కొన్ని ఆసక్తికరమైన ఆశ్చర్యకరమైన విషయాలను తెలుసుకుందాం..
మంచి ఉన్న ప్రతి చోటా చెడు ఉన్నట్టే ఏ పురాణంలో చూసిన రెండు రకాల పాత్రలు కనిపిస్తాయి. కొందరు ధర్మం కోసం నిలబడి పోరాడడం, మరికొందరు అధర్మం వైపు నిలబడడం. నిజానికి ఆధర్మం ముందు గెలిచినట్టు అనిపించిన చివరికి ధర్మం ముందు ఓడిపోక తప్పదు. యుగాలు మారినా తరాలు మారిన చివరికి గెలిచేది ధర్మమే ప్రతి ఇతిహాసంలో మనం చూసేది ఇదే.
శకుని పగ: శకుని తన సోదరి గాంధారి వివాహాన్ని ధృతరాష్ట్రుడితో జరిపించినందుకు హస్తినాపురం పై పగ పెంచుకుంటాడు. దానికి ఒక కారణం ఉంది. మొదట హస్తినాపురం నుంచి భీష్ముడు గాంధార రాజ్యానికి వచ్చి గాంధారిని తమ రాజుకి ఇచ్చి పెళ్లి చేయాలని కోరుతాడు అందరూ పాండురాజుకి గాంధారిని అడుగుతున్నట్లు భావిస్తారు. కానీ చివరికి భీష్ముడు అంధుడైన ధృతరాష్ట్రుడితో గాంధారి వివాహానికి ఆహ్వానం తీసుకువచ్చినట్లు తెలుపుతాడు. చేసేది ఏం లేక గాంధారి వివాహాన్ని తన తల్లిదండ్రులు ఒప్పుకుంటారు. గాంధారి ఒక అంధరాజుని వివాహం చేసుకోవాల్సి రావడం ఆమె కళ్ళకు గంతలు కట్టుకోవడం శకునిలో కోపాన్ని రగిలించాయి. ఈ పగే అతన్ని కౌరవుల వైపు నడిపించింది.

దానవీయ పాచికలు : శకుని పాచికల ఆటలు అసాధారణ నైపుణ్యం కలిగిన వాడు పురాణాల ప్రకారం అతని పాచిగలు తన తండ్రి సుబలుడు కాలి ఎముకలతో తయారు చేయబడ్డాయి. ఈ పాచికలు అతని ఇష్టానుసారం పడేవని అతని మనసులో ఏది అనుకుంటే పాచికలు అదే విధంగా పడతాయని దీనివల్లే యుధిష్ఠిరుడితో జరిగిన పాచికల ఆటలో అతను గెలిచాడని చెప్పబడుతుంది.
కుటిల వ్యూహకర్త : శకుని కేవలం విలన్ కాదు అతను అత్యంత తెలివైన వ్యూహకర్త కౌరవులను పాండవులకు వ్యతిరేకంగా రెచ్చగొట్టడం, పాండవుల లాక్షగృహం తగలబెట్టడం, దూత్యం వంటి ఎన్నో కుట్రలకు అతనే మాస్టర్ మైండ్ గా మహాభారతంలో కనిపిస్తాడు. ఎలాగైనా తన మేనల్లుడికి రాజ్యాన్ని కట్టబెట్టడం అతని లక్ష్యం. రాజ్యం తన మేనల్లుడు చేతిలోకి రాగానే, అక్కడ గాంధార రాజ్య పరిపాలన చేయాలనేది శకుని ఆలోచన. ఈ విషయాన్ని స్వయంగా శకుని మహాభారతంలో గాంధారితో చెప్పడం మనం చూస్తాం..
అనుకోని ముగింపు: ఎన్నో కుట్రలు ఎన్నో కుతంత్రాల తర్వాత కురుక్షేత్ర యుద్ధంలో శకుని సహదేవుడి చేతిలో మరణించాడు ఆసక్తికరంగా సహదేవుడు జ్యోతిష్య శాస్త్రంలో నిష్ఠాతుడు శకుని కూడా తన తెలివితేటలతో అందరినీ మభ్య పెట్టేటటువంటి వాడు ఈ ఇద్దరు ఢీ అంటే ఢీ అని కురుక్షేత్ర యుద్ధంలో తలపడడం చివరికి శకుని మరణించడం జరుగుతుంది.
శకునిది మహాభారతంలో ఒక సంక్లిష్ట పాత్ర పగ, తెలివి, వ్యూహం, విధేయతల మిశ్రమం. అతని చర్యలు మహాభారత యుద్ధాన్ని నడిపించాయి. శకుని కి ఉన్న తెలివి ధర్మం వైపు నిలబడి ఉంటే మరోలా ఉండేది కానీ అతడు అధర్మం వైపు నిలబడి అంతమొందాడు. అతని గురించి తెలుసుకోవడం ఎప్పటికీ ఆసక్తికరంగానే ఉంటుంది.