భారతదేశ ఆధ్యాత్మిక పటంలో కొల్హాపూర్ ఆలయానికి ప్రత్యేక స్థానం ఉంది. మహారాష్ట్ర రాష్ట్రంలోని ఈ పుణ్యక్షేత్రం సాక్షాత్తూ మహాలక్ష్మి దేవి కొలువై ఉన్న శక్తిమంతమైన ప్రదేశం. ఈ దివ్యమైన ఆలయం కేవలం ఒక నిర్మాణమే కాదు అద్భుత చరిత్రకు తరగని ఆధ్యాత్మిక కాంతికి నిదర్శనం. ప్రతి భక్తుని మనసుకూ శాంతిని, ఐశ్వర్యాన్ని, కోరిన కోరికలను తీర్చే శక్తి ఈ క్షేత్రానికి ఉంది. చరిత్ర పుటల్లో పురాణ కథలు ఈ వైభవానికి సంబంధించిన అద్భుతాలను ఇప్పుడు తెలుసుకుందాం.
కొల్హాపూర్ వైభవం: కొల్హాపూర్ మహాలక్ష్మిని అంబాబాయి అని కూడా భక్తితో పిలుస్తారు. ఇది 108 శక్తి పీఠాలలో ఒకటిగా మరియు ఆరు ముఖ్యమైన శక్తి పీఠాలలో ముఖ్యమైనదిగా భావించబడుతుంది.పురాణాల ప్రకారం ఈ ప్రాంతాన్ని పూర్వం కోల్హాసురుడు అనే రాక్షసుడు పాలిస్తుండేవాడు. ఆ రాక్షసుడి దౌర్జన్యాలతో హింసలతో విసిగిపోయిన దేవతలు ఋషులు తమను రక్షించమని దేవిని వేడుకున్నారు. అప్పుడు లోకకల్యాణం కోసం భక్తులను రక్షించడానికి మహాలక్ష్మి దేవి భయంకరమైన రూపంలో అవతరించింది. ఆమె కోల్హాసురుడితో తొమ్మిది రోజుల పాటు భయంకరంగా పోరాడి చివరికి అతన్ని సంహరించింది. మరణించే ముందు కోల్హాసురుడు తాను సంహరించబడిన ఈ స్థలానికి తన పేరును పెట్టమని దేవిని కోరాడు. అందుకే ఈ ప్రాంతానికి కొల్హాపూర్ అనే పేరు వచ్చిందని ప్రతీతి.

కోల్హాసురుణ్ణి సంహరించిన తర్వాత దేవి స్వయంగా ఇక్కడ కొలువుదీరి భక్తులకు కరుణామయి రూపంలో దర్శనమిస్తోంది. ఇక్కడి అమ్మవారి విగ్రహం దాదాపు 7 అడుగుల ఎత్తులో, నల్లటి శిలతో చెక్కబడి అత్యంత శక్తివంతమైన తేజస్సుతో ఉంటుంది. ఆలయం వాస్తుశిల్పం కూడా హేమాడ్ పంతి శైలిలో అద్భుతంగా ఉంటుంది ఇది శతాబ్దాల చరిత్రకు సాక్ష్యం. అమ్మవారి తలపై ఉన్న నాగ కిరీటం ప్రత్యేక ఆకర్షణ.
ఈ ఆలయంలో ప్రతి సంవత్సరం కిరణోత్సవం (సూర్య కిరణాల పండుగ) జరగడం ఒక అద్భుతం. సూర్యాస్తమయం సమయంలో సూర్యకిరణాలు అమ్మవారి పాదాల నుంచి మొదలై, క్రమంగా ముఖంపై పడి తేజోమయంగా మారుతాయి. ఈ దివ్యమైన దృశ్యం ప్రకృతికీ అమ్మవారి శక్తికి ఉన్న అద్భుత అనుబంధాన్ని చాటిచెబుతుంది.
కొల్హాపూర్ మహాలక్ష్మి ఆలయం భక్తులకు భరోసా శక్తిని ఇచ్చే నిలయం. ఈ పవిత్ర స్థలాన్ని దర్శించడం అంటే కేవలం అమ్మవారిని చూడడమే కాదు, వేల సంవత్సరాల చరిత్రను, మహాలక్ష్మి పరాక్రమాన్ని కళ్లారా చూడటమే. ఈ శక్తి పీఠంలో అమ్మవారిని ధ్యానించడం వలన మనకు అపారమైన ధైర్యం, సంపద, సకల శుభాలు కలుగుతాయని పండితులు తెలుపుతున్నారు.