వేల సంవత్సరాల చరిత్ర కలిగిన కంచి కామాక్షి అమ్మవారి ఆలయం గురించి మనందరికీ తెలుసు. అయితే అదే ఆలయ ప్రాంగణం వెనుక భాగంలో, నిశ్శబ్దంగా భక్తుల కోరికలు తీర్చే “కొట్టమ్ కామాక్షి” దేవి గురించి మీకు తెలుసా? ఈ తల్లిని దర్శించుకుంటే ముఖ్యంగా వివాహం ఆలస్యం అవుతున్న వారికి జీవితంలో సరైన తోడు కోసం ఎదురుచూసే వారికి తక్షణమే కళ్యాణ యోగం కలుగుతుందని ప్రగాఢంగా నమ్ముతారు. ఆ అమ్మవారి విశేషాలు, పూజా విధి గురించి తెలుసుకుందాం.
కంచిలోని ప్రధాన కామాక్షి ఆలయం వెనుక భాగంలో ఉన్న చిన్న గుడిని “కొట్టమ్” అని పిలుస్తారు. ఈ కొట్టమ్ కామాక్షి దేవిని ప్రత్యేకంగా శీఘ్ర వివాహం కోసం పూజిస్తారు. ఇక్కడ అమ్మవారు భక్తుల వైపు చూస్తూ చిరునవ్వుతో అనుగ్రహిస్తున్నట్లుగా ఉంటుంది. సాధారణంగా పెళ్లి కాని అమ్మాయిలు, అబ్బాయిలు ఈ ఆలయాన్ని సందర్శించి అమ్మవారికి పసుపు, కుంకుమ, మాలలు సమర్పించి ప్రత్యేక పూజలు చేస్తారు.

ఈ ఆలయంలో అమ్మవారికి కల్యాణ ఉత్సవం పేరుతో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఈ పూజలో పాల్గొంటే అమ్మవారు త్వరగా మంచి సంబంధాన్ని, ఆనందకరమైన వైవాహిక జీవితాన్ని ప్రసాదిస్తారని భక్తులు విశ్వసిస్తారు. పూజ తర్వాత అమ్మవారి ప్రసాదాన్ని, ముఖ్యంగా కుంకుమను నుదుట ధరించడం వల్ల వారి కళ్యాణ యోగం వెంటనే ఫలిస్తుందని ఇక్కడ భక్తుల నమ్మకం. వివాహం అయిన తర్వాత కూడా దంపతులు కృతజ్ఞతా భావంతో ఈ అమ్మవారిని మళ్లీ వచ్చి దర్శించుకోవడం ఆనవాయితీ.
మీరు జీవిత భాగస్వామి కోసం ఎదురు చూస్తున్నట్లయితే, కంచిలోని కొట్టమ్ కామాక్షి దేవిని ఒక్కసారి దర్శించండి. ఆ దివ్యరూపం దర్శనం అమ్మవారి ఆశీస్సులతో మీ జీవితంలో త్వరలోనే శుభ ఘడియలు వస్తాయి.