కేసీఆర్ వడ్ల రాజకీయం.. ఆ నాలుగంశాలు హుష్‌కాకి!!

-

రాజకీయ ఎత్తుగడలు వేయడంలో సీఎం కేసీఆర్‌కు ఎవరు సాటిరారు. ఆలోచనలు, నిర్ణయాలు ఎవరికీ అంతు చిక్కవు. కనీసం ఊహాకు కూడా అందవు. అందుకే, తన నిర్ణయాలతో రాజకీయ ప్రత్యర్థులను ఆశ్చర్యంలో ముంచెత్తుతుంటారు. ప్రస్తుతం కూడా అదే చేస్తున్నారు. హుజూరాబాద్ ఉప ఎన్నికల ఫలితాలు వెలువడిన మరుసటి రోజే సీఎం కేసీఆర్ ప్రెస్‌మీట్‌తో ప్రజల ముందుకు వచ్చారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌పై తీవ్ర పదజాలంతో విరుచుకుపడ్డారు. ఆ తర్వాతి రోజూ ప్రెస్‌మీట్ పెట్టారు. వడ్ల కొనుగోలు చేస్తారా? లేదా? అంటూ కేంద్రం దుమ్మెత్తిపోశారు. మూడో ప్రెస్‌మీట్ పెట్టి బీజేపీపై ఆరోపణలు గుప్పించారు. మహాధర్నా కూడా చేశారు.

ఇప్పుడు రాష్ట్రమంతా వడ్ల కొనుగోలుపై చర్చ సాగుతోంది. ఇక్కడే కేసీఆర్ ఎత్తుగడ ఫలించిందంటున్నారు రాజకీయ విశ్లేషకులు. తెలివిగా కీలకమై నాలుగంశాలు పక్కదారి పట్టించారని అభిప్రాయపడుతున్నారు.

హుజూరాబాద్ ఉపఎన్నికల్లో టీఆ‌ర్‌ఎస్ సర్వశక్తులు ఒడ్డింది. కానీ, ఓటమి తప్పలేదు. అదీ 23,855 ఓట్ల భారీ తేడాతో. దుబ్బాకలో కూడా టీఆర్‌ఎస్ ఓటమిపాలైంది. స్వల్ప మెజార్టీతోనే చేజారింది. కానీ, హుజూరాబాద్ ఓటమి అలాంటి కాదు. ఒక రకంగా చెప్పాలంటే టీఆర్‌‌ఎస్ జీర్ణించుకోలేని పరిస్థితి. మరోవైపు కేసీఆర్‌ను ఎదురించి పోటీ చేసి మరీ ఈటల రాజేందర్ విజయం సాధించారు. ఇది అంత ఆషామాషీ విషయం కాదు. ఒకవేళ కేసీఆర్ వడ్ల కొనుగోలు అంశం తెర మీదికి తీసుకురాకపోయి ఉంటే ఇదే దావనంలా రాష్ట్రమంతా వ్యాప్తించేదే. పెద్ద చర్చకు దారి తీసేదే. కానీ, ఇప్పుడు హుజూరాబాద్‌లో ఓటమి అంశం చర్చలో లేకుండా పోయింది.

హుజూరాబాద్ ఉప ఎన్నికతో ముడిపడి ఉన్న మరో అంశం దళిత బంధు. ఆగమేఘాలపైన అమల్లోకి తీసుకువచ్చిన పథకం. ఎన్నికల కమిషన్ జోక్యంతో అర్ధాంరంగా నిలిచిపోయింది. ఎట్టి పరిస్థితుల్లోనూ దళిత బంధు ఆగదని, హుజూరాబాద్ ఉప ఎన్నికల ఫలితాలు వెలువడిన వెంటనే అంటే నవంబర్ 4 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించారు. హుజూరాబాద్ ఉప ఎన్నికల ఫలితాలు వచ్చాయి. నవంబర్ 4వ తేదీ గడువు గడిచిపోయి 15 రోజులైంది. అయినా ఎక్కడా ఆ చర్చలేదు. అమలు ప్రస్తావన కూడా లేదు.

మరో కీలకాంశం పెట్రోల్ ధరలపై వ్యాట్ తగ్గింపు. డీజిల్‌పై రూ.10, పెట్రోల్‌పై రూ.5ల సెంట్రల్ ఎక్సైజ్ సుంఖం తగ్గించిన కేంద్రం మీరు కూడా తగ్గించండని రాష్ట్రాలకు సూచించింది. మేం ఎందుకు తగ్గించాలి. తెలంగాణ రాష్ట్ర ఏర్పడిన తర్వాత ఒక్కసారి వ్యాట్ పెంచలేదని, తగ్గించే ప్రసక్తే లేదని సీఎం కేసీఆర్ ఖరాఖండిగా చెప్పేశారు. అయితే, 2015లో వ్యాట్ పెంచిన విషయం బయటికి వచ్చింది. రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి కూడా పెరిగింది. కానీ, వడ్ల కొనుగోలు పంచాయితీ ఈ అంశాన్ని పక్కదారి పట్టించింది. పెట్రోల్, డీజిల్ ధరలను ఒక్క రూపాయి తగ్గించకపోయినా ఆ ఊసెత్తే నాథుడు లేడు.

హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో టీఆర్‌ఎస్ ఓటమికి మరో బలమైన కారణం. ఉద్యోగ నోటిఫికేషన్లు. దుబ్బాక ఎలెక్షన్లు మొదలు హుజూరాబాద్ ఉప ఎన్నికల వరకు 50వేలకు పైగా పోస్టులకు నోటిఫికేషన్లు ఇస్తామని రాష్ట్ర ప్రభుత్వం చెబుతూ వస్తున్నది. కానీ, ప్రకటనలు మాత్రం వెలువడటం లేదు. నిరుద్యోగ సమస్యపై కాంగ్రెస్ జంగ్ సైరన్, బీజేపీ మిలియన్ మార్చ్, వైఎస్సీఆర్‌టీపీ మంగళవారం దీక్షలతో రాష్ట్ర ప్రభుత్వాన్ని ఉక్కిరిబిక్కిరి చేసే ప్రయత్నం చేశాయి. వడ్ల కొనుగోలు విషయం రావడంతో జంగ్ సైరన్ మోగడం ఆగిపోయింది. మిలియన్ మార్చ్ జరగనేలేదు. మంగళవారం దీక్ష వాయిదా పడింది.

ఏది ఏమైనా సీఎం కేసీఆర్ రాజకీయం ఎత్తుగడలకు ప్రత్యర్థి పార్టీలు చిత్తయనే చెప్పాలి. ఇప్పుడప్పుడే వడ్ల కొనుగోలు పూర్తి కాదు. కేంద్ర ప్రభుత్వం సైతం స్టీమ్ రైస్ కొనమని స్పష్టం చేసింది. మరో రెండు నెలలపాటు వడ్ల కొనుగోలు విషయంపైనే రాష్ట్రంలో రాజకీయాలు కొనసాగుతాయి. అప్పటికి జనాలు హుజూరాబాద్ ఉప ఎన్నికలను మర్చిపోతారు. మిగతా అంశాలు గాలికి పోతాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version