ఒకరు సాధించిన ఘనతను తమ ఖాతాలో వేసుకోవడం కొందరికి అలవాటే. రాజకీయ నాయకులు అయితే ఆ విషయంలో మిగిలిన వారి కన్నా ముందుగానే ఉంటారు. ప్రస్తుతం కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వాన్ని చూస్తే సరిగ్గా అలాగే అనిపిస్తుందని నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు. కోవిడ్ ను అరికట్టామని కేంద్రం జబ్బలు చరుచుకుంటుందని, కానీ నిజానికి రాష్ట్రాలు లాక్ డౌన్ విధించడం వల్లే కోవిడ్ సెకండ్ వేవ్ తీవ్రత తగ్గిందని, కనుక రాష్ట్రాలకే ఆ క్రెడిట్ దక్కుతుందని అంటున్నారు.
దేశంలో కోవిడ్ కేసులు పెరుగుతున్నాయి, సెకండ్ వేవ్ దారుణంగా ఉంది, దేశవ్యాప్త లాక్‌డౌన్ విధించండి.. అని నిపుణులతోపాటు రాష్ట్ర ప్రభుత్వాలు నెత్తీ నోరు మొత్తుకున్నాయి. కానీ కేంద్రం వినలేదు. కోవిడ్‌ను అరికట్టే బాధ్యతను రాష్ట్రాలకే వదిలేసింది. వీలుంటే లాక్‌డౌన్‌లు పెట్టుకోండి. అంటూ చేతులు దులుపుకుంది. కానీ ఇప్పుడు కోవిడ్ సెకండ్ వేవ్ తగ్గుముఖం పట్టే సరికి తామే అంతా చేశామని, తమ చర్యల వల్లే కోవిడ్ సెకండ్ వేవ్ తగ్గిందని, కోవిడ్ కేసుల సంఖ్య తగ్గుతుందని.. కేంద్రంలోని పెద్దలు తమ డబ్బాను తామే కొట్టుకుంటున్నారు. నిజానికి ఆదాయం పడిపోతుందని తెలిసినా ప్రజల ఆరోగ్యం దృష్ట్యా లాక్‌డౌన్‌లు విధించి అమలు చేసింది రాష్ట్రాలు. కనుక కచ్చితంగా కోవిడ్ సెకండ్ వేవ్ తగ్గినందుకు క్రెడిట్‌ను రాష్ట్ర ప్రభుత్వాలకు ఇవ్వాల్సిందే.
ప్రముఖ ఆర్థిక శాస్త్రవేత్త, నోబెల్ బహుమతి గ్రహీత అమర్త్యసేన్ కూడా తాజాగా ఇదే విషయాన్ని చెప్పారు. కోవిడ్ సెకండ్ వేవ్ తగ్గిందని పొంగి పోవడం కాదు, మొదటి వేవ్ తరువాత చాలా సమయం దొరికినా, సెకండ్ వేవ్ ను అడ్డుకునేంత సమయం, వనరులు ఉన్నా.. కేంద్రం ఎందుకు పట్టించుకోలేదని అన్నారు. కేంద్రం చూపిన నిర్లక్ష్యం వల్ల ఎంతో మంది బలయ్యారని అన్నారు. అవును.. ఒకరి క్రెడిట్‌ను తమ ఖాతాలో వేసుకోవడం అంటే నిజంగా నేతలకు భలే ఇష్టం. ప్రస్తుతం కేంద్రం ఇందుకు మినహాయింపు ఏమీ కాదనిపిస్తోంది.