ఎడిట్ నోట్ : కాంగ్రెస్ కు కావాలొక ఉద‌యం

-

కొత్త బంగారు లోకం మాకు కావాలి సొంతం.. గాలి పాడాలి గీతం పుడ‌మి కావాలి స్వ‌ర్గం అని పాట విన్న‌ప్పుడు ఏదో తెలియ‌ని ఆత్మీయానుభూతి ఉంటుంది. అదేవిధంగా కాంగ్రెస్ నాయ‌కుల‌కు కూడా ఉండాలి. ఉండే ఉండాలి. ఆ విధంగా ఆ పార్టీ మరో ఉదయం కోసం ఉద్దేశం ఏమ‌యినా  కూడా వెతికి వెతికి  విసిగిపోతోంది. ఆశించిన విధంగా ఫ‌లితాలు రాని రోజున డీలా ప‌డిపోతూ, ప‌డుతూ లేస్తూ మేథోమ‌థ‌నం జ‌రుపుతూ త‌నదైన బాణీలో ప‌నిచేసేందుకు పున‌రుత్థానం చెందేందుకు నిత్యం ఏదో ఒక ప్ర‌య‌త్నం చేస్తూనే ఉంది. ఈ క్ర‌మంలో పార్టీలో అంత‌ర్గ‌త పోరును సైతం భ‌రిస్తుంది. పాత శ‌త్రువులతో కొత్త స్నేహాలు వ‌ద్ద‌ని హిత‌వు కూడా చెబుతోంది. అయినా కూడా పార్టీ కోలుకోలేపోతోంది. ఎప్ప‌టిక‌ప్పుడు పంథా మార్చి  రాజ‌కీయం చేయాల‌నుకుంటున్నా అందుకు త‌గ్గ వ్యూహం స‌రిగా లేక, వ్యూహం స‌రిగా ఉన్నా  దానిని అమ‌లు చేసే నాయ‌కులు స‌రిగా లేక అవ‌స్థ ప‌డుతోంది. దీంతో రాష్ట్రాలలో కాంగ్రెస్ ఒక అనాథ గానే ఉంది. ఢిల్లీ లో కాంగ్రెస్  తానేం చెప్పినా విన‌ని నాయ‌కుల‌ను చూస్తూ,స‌హిస్తూ ఓ దీన గాధ‌ను భ‌రిస్తూనే ఉంది.

వాస్త‌వానికి ఓ పొలిటిక‌ల్ స్ట్రాట‌జిస్ట్ కోసం కాంగ్రెస్ ఇంతగా పాకులాడుతుందంటే ఆ రోజు వీళ్లంతా ఎలా నెగ్గుకు వ‌చ్చార‌ని? టెన్ జ‌న్ ప‌థ్ కేంద్రంగా యూపీఏ 1 మ‌రియు యూపీఏ 2 ఎలా దేశ రాజ‌కీయాల‌ను ప్ర‌భావితం చేశాయ‌ని ? అంటే ఆ రోజు గాంధీ కుటుంబాల ప్రాబల్యాన్ని లేదా ప్రాభ‌వాన్ని జ‌నం ఒప్పుకున్నారా  లేదా కాంగ్రెస్ లో ఆ కుటుంబం త‌ప్ప మిగ‌తా కుటుంబాల‌కు రోజుల్లేవు అని తేలిపోయిందా? ఏ మాట‌కు ఆ మాట కాంగ్రెస్ అధికారంలో ఉన్నంత కాలం అహంకారంతోనే  కొట్టుమిట్టాడింది అన్న ఓ విమ‌ర్శ ఇప్ప‌టికీ ఉంది. అంతేకాదు అవినీతి ఆరోప‌ణ‌లు ఎన్ని ఉన్నా నాయ‌కుల‌ను భ‌రించింది. కానీ వారిపై ఎటువంటి చ‌ర్య‌లూ లేవు. కొన్ని రాష్ట్రాల‌లో అదే ప‌నిగా ఏళ్ల త‌ర‌బ‌డి కుటుంబ పాల‌న‌ను ప్రోత్స‌హిస్తూ త‌న వర్గం మ‌నుషులుగా వారు చెలామణీ అయ్యే విధంగా సోనియా త‌ర‌ఫు బృందం జాగ్ర‌త్త వ‌హించింది. ఇప్పుడు మాట్లాడుతున్న క‌పిల్ సిబ‌ల్ లాంటి నేత‌లు ఆ రోజు  కూడా మాట్లాడారు కానీ అవేవీ నాలుగు గోడ‌లు దాటి బ‌య‌ట‌కు రాలేదు. లేదా ఆ రోజు ఇంత‌టి డిజిట‌ల్ విప్ల‌వం అయితే లేదు.

ముఖ్యంగా మిత్ర ప‌క్షాలేవీ ఆ రోజు ఉన్న విధంగా ఈ రోజు కాంగ్రెస్ తో లేవు. ఉన్నా కూడా అవ‌న్నీ అవ‌స‌రార్థం మాత్ర‌మే ఉన్నాయి. పొత్తుల కార‌ణంగా కాంగ్రెస్ బాగుపడుతుంది అన్న మాట ప్ర‌శాంత్ కిశోర్ చెప్ప‌న‌క్క‌ర్లేదు ఎవ్వ‌రైనా చెప్పొచ్చు. కానీవైఎస్ కుటుంబం కానీ, క‌ల్వ‌కుంట్ల కుటుంబం కానీ ప్రాంతీయంగా బ‌లంగా ఉన్నాయి. అవి త‌మ అధికారాల‌ను మ‌ళ్లీ సోనియా గాంధీకి బ‌ద‌లాయించి చేష్ట‌లుడిగి ఉండ‌లేవు. త‌మిళ నాట స్టాలిన్ కూడా త‌ప్ప‌క కాంగ్రెస్ తో ఉన్నారు. కొన్ని ఆర్థిక బంధాలే స్టాలిన్ ను ఈ విధంగా ప్ర‌భావితం చేస్తున్నాయి అన్న‌ది కూడా కాద‌న‌లేని వాస్త‌వం. ఆ రోజు ఎదురు తిరిగితే చాలు సీబీఐ దర్యాప్తు పేరిట రాజ‌కీయం న‌డిపిన కాంగ్రెస్ క్ర‌మేణ త‌న విశ్వ‌స‌నీయ‌త‌ను ప్ర‌జ‌ల ద‌గ్గ‌ర కోల్పోతూ వ‌చ్చింది.

ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షంగా ఈ ఎనిమిదేళ్లూ సాధించింది ఏమీ లేదు. చ‌ట్ట సభ‌ల్లో కూడా ఆశించిన బ‌లం లేదు కనుక కాంగ్రెస్ పెద్ద‌గా మాట్లాడింది లేదు. పోట్లాడిందీ లేదు. ఇక యువ రాజు రాహుల్ ను భావి నేత‌గా ఫోక‌స్ చేయాల‌నుకున్నా అది కూడా కుద‌ర‌ని ప‌ని అని తేలిపోయింది. ఇందిరా గాంధీ పోలిక‌ల‌తో ఉన్న ప్రియాంక‌ను కూడా ఇదే విధంగా ఫోక‌స్ చేయాల‌నుకున్న మొన్న‌టి యూపీలోఎలాంటి చేదు అనుభ‌వం ఎదురైందో తెలిసిందే ! ఈ నేప‌థ్యంలో ఒక‌ప్పుడు  కాంగ్రెస్ ఎంత బలమైన పార్టీగా ఉందో ఇప్పుడు అంత‌కుమించిన  ప్ర‌జాబ‌లంతో, ప్ర‌బ‌ల చిత్తంతో ప‌నిచేస్తోంది బీజేపీ. అందుకు ఆ పార్టీ అగ్ర నాయ‌క‌త్వ‌మే కార‌ణం. కుటుంబ పాల‌న లేక‌పోవ‌డం మ‌రో కార‌ణం కావొచ్చు. క‌నుక కాంగ్రెస్ కావాలొక ఉద‌యం.. హ‌స్తిన పురి వీధుల‌లో మ‌రియు టెన్ జ‌న్ ప‌థ్ దారుల‌లో.. ఆ ఉద‌యం కోసం సోనియా మ‌రో ద‌శాబ్ద కాలం అయినా నిరీక్షించ‌క త‌ప్ప‌దు.

Read more RELATED
Recommended to you

Exit mobile version