వక్ఫ్ భూమి కబ్జా చేశారంటూ బీజేపీ ఎంపీ అనురాగ్ ఠాకూర్ రాజ్యసభలో కాంగ్రెస్ పార్టీపై ఆరోపణలు చేశారు. ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఈ ఆరోపణలు ఖండిస్తూ.. అసత్య ఆరోపణలు చేసినందుకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. రాజకీయ దాడులకు తాను బెదిరిపోనని పేర్కొంటూ పుష్ప సినిమాలోని తగ్గేదే..లే డైలాగ్ చెప్పారు.
అసలేం జరిగిందంటే..
వక్ఫ్ బిల్లుపై లోక్ సభలో బుధవారం జరిగిన చర్చ సందర్భంగా బీజేపీ నేత అనురాగ్ ఠాకూర్ .. వక్ఫ్ బోర్డు ఆస్తులను కాంగ్రెస్, ఇతర ప్రతిపక్ష పార్టీలు బాధ్యతారహితంగా వినియోగిస్తున్నాయని.. ఎలాంటి అనుమతి లేకుండా ఆ భూములను కబ్జా చేశారంటూ ఆరోపించారు. ఈ నేపథ్యంలో గురువారం రోజున రాజ్యసభలో జీరో అవర్‌లో మాట్లాడుతూ ఖర్గే ఈ ప్రస్తావన తీసుకువచ్చి.. ఎంపీ అనురాగ్ ఠాకూర్ తనపై అసత్య, నిరాధార ఆరోపణలు చేశారని.. ఆయన తన వ్యాఖ్యలను ఉపసంహరించుకున్నా అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయిందని తెలిపారు. ఆయన వ్యాఖ్యలకు గానూ సభాపక్ష నేత క్షమాపణలు చెప్పాలని ఖర్గే డిమాండ్ చేశారు.