హాజీపూర్‌ శ్రీనివాసరెడ్డికి ఉరి ఖాయం..?

-

హాజీపూర్‌ సీరియల్‌ కిల్లర్‌ మర్రి శ్రీనివాసరెడ్డి కిరాతకాలపై ఉన్నత న్యాయస్థానంలో వాదనలు మొదలయ్యాయి. పోలీసులు చార్జిషీటును పకడ్బందీగా తయారుచేసారు. మొత్తం వందమంది సాక్షులను విచారించనున్నారు.

తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్ఠించిన హాజీపూర్‌ సీరియల్‌ హత్యల కేసులో ఈరోజు హైకోర్టులో విచారణ ప్రారంభమయింది. యాదాద్రి భువనగిరి జిల్లా, బొమ్మల రామారం మండలం, హాజీపూర్‌ గ్రామంలోని అమ్మాయిలు మనీషా, శ్రావణి, కల్పనలపై అత్యాచారం జరిపి, దారుణంగా హతమార్చి, బావులలో పడేసిన సైకో కిల్లర్‌ శ్రీనివాసరెడ్డిని పోలీసులు కోర్టులో ప్రవేశ పెట్టారు.

రాచకొండ పోలీస్‌ కమిషనర్‌ మహేశ్‌ భగవత్‌ ఈ కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకుని లోతుగా దర్యాప్తు జరిపారు.  రాష్ట్రవ్యాప్తంగా ప్రాధాన్యత పొందడం, ఉన్నతాధికారులు, మంత్రులు కూడా ఈ విషయంలో కఠినంగా ఉండటంతో దర్యాప్తు పకడ్బందీగా సాగింది. దాదాపు 500 మందిని విచారించి, 100 మందిని సాక్షులుగా కోర్టులో ప్రవేశపెట్టనున్నారు. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా శ్రీనివాసరెడ్డికి మరణదండన విధించాలని ఆందోళనలు జరిగాయి. మొన్నటి దిశ నిందితుల ఎన్‌కౌంటర్‌ తర్వాత  ఈ డిమాండ్‌ మళ్లీ ఊపందుకుంది. ఈ నేపథ్యంలో న్యాయస్థానం ఎటువంటి శిక్ష ఖరారు చేయనుందో అని అందరూ అసక్తిగా ఎదురుచూస్తున్నారు.

అయితే, దిశ నిందితుల ఎన్‌కౌంటర్‌పై భిన్నాభిప్రాయాలు వినిపించాయి. దేశవ్యాప్తంగా సంబరాలు మిన్నంటగా, కొందరు పౌరహక్కుల నేతలు, దళిత సంఘాల నాయకులు నిరసన వ్యక్తం చేసారు. ఎమ్మార్పీఎస్‌ నాయకుడు మంద కృష్ణ మాదిగ మరో అడుగు ముందుకేసి, దిశ నిందితులు దళితులు, బిసిలు కావడం వల్లనే వారిని ఎన్‌కౌంటర్‌ చేసారనీ, అగ్రవర్ణ నిందితులను అలాగే చేయగలరా? అని ప్రశ్నించారు. ఈ ఆరోపణ ప్రభుత్వాన్ని కూడా ఇరకాటంలోకి నెట్టింది. ఇప్పుడు నేరస్థులెవరైనా తమకొకటే అని ప్రభుత్వం నిరూపించుకోవాల్సిన అవసరం ఏర్పడింది. దాంతో ఈ శ్రీనివాసరెడ్డి కేసు మరింత ప్రాధాన్యతను సంతరించుకుంది. సామాజికంగా అగ్రవర్ణస్తుడు కావడంతో శ్రీనివాసరెడ్డికి ఉరిశిక్ష పడితే, ఈ ఆరోపణలన్నీ కొట్టుకుపోతాయని ప్రభుత్వం భావిస్తోంది.

ఈ నేపథ్యంలో ప్రభుత్వం నుంచి పోలీసులకు కఠినమైన ఆదేశాలు వెళ్లినట్లు సమాచారం. ఎట్టి పరిస్థితుల్లోనూ శ్రీనివాసరెడ్డి తప్పించుకోవడానికి వీల్లేదనీ, అతడికి మరణశిక్ష పడాల్సిందేనని, అందుకు తగ్గట్టుగానే చార్జిషీటు, సాక్ష్యాలు ఉండాలని కమషనర్‌కు గట్టిగా చెప్పినట్టు విశ్వసనీయవర్గాల ద్వారా తెలిసింది. ఆ మేరకు భగవత్ తానే కేసును స్వయంగా పర్యవేక్షించి, చార్జిషీటును దగ్గరుండి మరీ తయారుచేయించాడని వినికిడి, నిందితుడికి ఉరిశిక్ష ఖాయమని పోలీసు అధికారులు, ప్రభుత్వ లాయర్లు ధీమా వ్యక్తం చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version