ఎడిట్ నోట్: రాజ్‌భవన్ ‘రాజకీయం’..!

-

ఏ రాష్ట్రంలోనైనా సీఎం, గవర్నర్‌ల మధ్య సఖ్యత ఉంటుంది…కానీ తెలంగాణ రాష్ట్రంలో ఆ పరిస్తితి లేదు. సీఎం కేసీఆర్, గవర్నర్ తమిళిసైకు పెద్దగా పొసగని పరిస్తితి. ఎప్పుడైతే తెలంగాణలో బీజేపీ ఎదగడం మొదలైందో..అప్పటినుంచి కేసీఆర్, గవర్నర్‌కు దూరంగానే ఉంటున్నారు. ఇటు గవర్నర్ కూడా తన అధికారాలని ఉపయోగించుకుంటూ…రాష్ట్రంలో సొంత పర్యటనలు చేస్తున్నారు.

తమిళిసై గవర్నర్‌గా వచ్చి మూడేళ్లు అయింది…కానీ మూడేళ్లలో రాజ్‌భవన్, ప్రగతి భవన్‌ల మధ్య సంబంధాలు బాగుంది ఒక ఏడాది మాత్రమే..గత రెండేళ్ల నుంచి వైరుధ్యాలు మొదలయ్యాయి. ఈ క్రమంలోనే అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలను ప్రభుత్వం.. గవర్నర్‌ ప్రసంగం లేకుండానే నిర్వహించింది. దీంతో ఇందుకు ప్రతీకారం అన్నట్లుగా.. బడ్జెట్‌కు ఆమోదం తెలపకుండా నిలువరించే అధికారం ఉన్నా… ప్రజల సంక్షేమం దృష్ట్యా ఆమోదం తెలిపానని అప్పట్లో గవర్నర్‌ తీవ్రంగా స్పందించారు.

అలాగే ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డి విషయంలో కూడా విభేదాలు వచ్చాయి. గవర్నర్ కోటాలో కౌశిక్ రెడ్డిని ఎమ్మెల్సీ చేయాలని కేసీఆర్ చూశారు. అందుకు గవర్నర్ బ్రేక్ వేశారు. చివరికి వేరే కోటాలో ఎమ్మెల్సీని చేశారు. ఇటు గవర్నర్‌కు ప్రోటోకాల్ ఇచ్చే విషయంలో కేసీఆర్ ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తూ వచ్చింది. దీనిపై తమిళిసై గట్టిగానే స్పందిస్తూ…కేసీఆర్ ప్రభుత్వంపై ఫైర్ అయ్యారు. సాధారణంగా గవర్నర్లు పెద్దగా బయటకెళ్లరు…కానీ తమిళిసై మాత్రం ప్రజల్లో తిరుగుతూ, వారి సమస్యలని తెలుసుకునే ప్రయత్నం చేస్తూ వస్తున్నారు.

తాజాగా మూడేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా తమిళిసై…రాజ్‌భవన్ వేదికగా కేసీఆర్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. గవర్నర్ ఆఫీస్ పై రాష్ట్ర ప్రభుత్వం తీవ్రమైన వివక్ష చూపిస్తోందని, రాజ్ భవన్‌కు సీఎం, మంత్రులు దూరంగా ఉండటంపై కూడా గవర్నర్ సీరియస్ అయ్యారు. రాజ్ భవన్ ఏమైనా అంటరాని స్థలమా.. ఎందుకు మీరంతా రాజ్‌భవన్ లోకి అడుగుపెట్టడం లేదని ప్రశ్నించారు. అలాగే మహిళా గవర్నర్‌గా తనను చాలా తక్కువ అంచనా వేశారని, తన పరిధి ఏంటో తెలుసని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.

ఇక గవర్నర్ వ్యాఖ్యలకు వెంటనే టీఆర్ఎస్ నేతలతో కౌంటర్లు ఇచ్చారు…కవితతో పాటు…పలువురు మంత్రులు తమిళిసై వ్యాఖ్యలని ఖండించారు. తప్పుడు ప్రచారంతో ప్రజల మన్ననలను పొందలేమని గ్రహించి బీజేపీ.. గౌరవ గవర్నర్‌ ద్వారా ఇటువంటి ప్రకటనలు చేయిస్తోందని, గవర్నర్‌ తన పరిధి దాటి వ్యవహస్తున్నారని, ఆమె బీజేపీ ప్రతినిధిగా మాట్లాడటం తగదని ఫైర్ అయ్యారు. అలాగే ఎప్పుడు రాజ్‌భవన్‌కు వెళ్లాలనేది సీఎం ఇష్టమని తేల్చి చెప్పారు.

ఇలా సీఎం, గవర్నర్‌ల మధ్య వార్ నడుస్తోంది..మరి కేంద్రం నియమించిన గవర్నర్ కాబట్టి…కేసీఆర్ సర్కార్…గవర్నర్‌ని ఏ మాత్రం పట్టించుకోవడం లేదు…విలువ కూడా ఇస్తున్నట్లు కనిపించడం లేదు. అటు గవర్నర్ సైతం కేసీఆర్ సర్కార్‌కు ధీటుగానే ముందుకెళుతున్నారు. గవర్నర్ కూడా రాజకీయ పరంగానే ముందుకెళుతున్నారనే విమర్శలు వస్తున్నాయి. మొత్తానికి వీరిలో ఎవరిది రాజకీయ కోణం, ఎవరు కరెక్ట్ అనేది ప్రజలే తేల్చాలి. ఏదేమైనా ఇలా రాజ్ భవన్ చుట్టూ రాజకీయం చేయడం కరెక్ట్ కాదనే చెప్పాలి.

Read more RELATED
Recommended to you

Exit mobile version