రిటైరైన రామోజీరావు

-

కొన్ని దశాబ్దాలపాటు పత్రికను విజయవంతంగా నడిపి, సంతృప్తస్థాయిలో ‘ఈనాడు’ను నిలబెట్టిన ఘనత రామోజీరావుదే.

‘ఈనాడు సంపాదకులు రామోజీరావు, పత్రిక సంపాదకత్వ బాధ్యతలనుంచి తప్పుకున్నారు. తన ప్రియశిష్యుడు, డిఎన్‌ ప్రసాద్‌ను తదుపరి ఎడిటర్‌గా నియమించారు. ఈ నియామకం నేటి (14 డిసెంబర్‌) నుంచే అమల్లోకి వచ్చింది.

ఈనాడు – దశాబ్దాల తెలుగు వార్తాపత్రికా ప్రపంచంలో నెంబర్‌ వన్‌. చెరుకూరి రామోజీరావు నేతృత్వంలో వెలువడే పత్రిక. మూడు దశాబ్దాలకు పైగా తెలుగునేలను ఏలుతున్న దినపత్రిక ‘ఈనాడు’ను అగ్రస్థానంలో నిలబెట్టడానికి రామోజీరావు పడ్డ కష్టాలు అన్నీఇన్నీ కావు. ఎన్నో ఎదురుదెబ్బలు, ఆటుపోట్లు. అయినా తట్టుకుని సగర్వంగా నిలబడింది ‘ఈనాడు’.

రామోజీరావు, కృష్ణాజిల్లా పెదపారుపుడి గ్రామం నుండి ఏదో సాధించాలనే పట్టుదలతో బయటి ప్రపంచానికి వచ్చారు.వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చిన రామోజీరావుకు వ్యవసాయదారులకోసం ఏదైనా సాయం చేయాలనే తపనతో విశాఖపట్టణంలో తన మొదటి పత్రిక ‘అన్నదాత’ను స్థాపించారు. అనతికాలంలోనే అది రైతుల మన్ననలను విశేషంగా అందుకుని ఈనాటికీ ప్రముఖ పత్రికగా పేరుగాంచింది. తదనంతరం తన మానసపుత్రిక ‘ఈనాడు’ దినపత్రికను 1974లో విశాఖ నుంచే ప్రారంభించారు. అప్పటికే కొన్ని దినపత్రికలు తెలుగునేలపై తిరుగాడుతుండగా, ప్రవేశించిన ‘ఈనాడు’ సంచలనాల మోత మోగించింది. పేపరంటే ఇలా ఉండాలి అనే ఒక ప్రమాణాన్ని నిర్ధేశించింది. అనతికాలంలోనే అత్యధిక సర్క్యులేషన్‌ గల తెలుగు దినపత్రికగా అవతరించింది. క్రమంగా ఎడిషన్లను విస్తరించుకుంటూ, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో దాదాపు ప్రతి జిల్లాను పలకరించింది. నేటికీ దాదాపు 18 లక్షలకు పైగా రోజువారీ కాపీలతో రెండు తెలుగు రాష్ట్రాల్లో అగ్రస్థానంలో ఉంది. ఎన్నో మలుపులకు సాక్ష్యంగా నిలిచింది. మరెన్నో ఘట్టాలకు స్వంతంగా తెరతీసింది.

స్వర్గీయ ఎన్‌టీ రామారావును తెలుగు రాష్ట్రానికి ముఖ్యమంత్రిని చేసిన ప్రజలను, అందుకు పురిగొల్పిందే రామోజీరావు. అదే ఎన్టీఆర్‌ను దించి , చంద్రబాబునాయుడిని గద్దెనెక్కించింది కూడా ఆయనేనని అందరికీ తెలుసు. తెలుగు రాజకీయాలు, రామోజీరావు ఎప్పుడూ విడిపోలేదు. రాష్ట్రంలో ఏం జరిగినా, నిమిషాల్లో తెలుసుకోగలిగిన నెట్‌వర్క్‌ ఆయన సొంతం. అద్భుతమైన తెలివితేటలు, విశ్లేషణాశక్తి, ముందుచూపుతో రామోజీరావు ఎనలేని ఖ్యాతి గడించారు. శత్రువులు కూడా ఆయన మేధాసంపత్తిని పొగడకుండా ఉండలేరు. దివంగత వైఎస్‌ రాజశేఖరరెడ్డి, రామోజీరావుతో ప్రత్యక్షవైరానికి దిగినా, ఆయన వెనక్కి తగ్గలేదు. ప్రత్యేక తెలంగాణ రావడం, సహజంగానే రామోజీరావుకు ఇష్టం లేదు. రాష్ట్రం రాకుండా చేయడానికి ఆయన ఎంతో కష్టపడ్డారు. ఆంధ్రానాయకులందరినీ ఏకతాటిపైకి తెచ్చి, ఢిల్లీపై ఒత్తిడి పెంచాలనుకున్నారు కానీ, కేసీఆర్‌ సారథ్యంలోని తెలంగాణ ఉద్యమం అందనంత ఎత్తులో, ఉధృతంగా సాగి చివరకు రాష్ట్రాన్ని సాధించింది. అయినప్పటికీ వార్తలను వార్తలుగానే రాసారు.

‘ఈనాడు’ ఎదుగుదలలో అడుగడుగునా రామోజీరావు కృషి ఉంది. ప్రచురించబడిన ప్రతీ వార్తను క్షుణ్ణంగా చదివేవారు. అందులోని తప్పొప్పులను, రాసిన విధానాన్ని ఎత్తిచూపి, సరిచేసుకోవాల్సిందిగా సిబ్బందికి సూచనలు చేసేవారు. నిజాయితీగాకష్టపడే ఉద్యోగులను గుర్తించి, తగురీతిన ప్రోత్సహించేవారు.

ప్రస్తుతం పత్రిక సంపాదకుడిగా నియమితులైన డిఎన్‌ ప్రసాద్‌ ఆయన అనుంగు శిష్యుడు. నిత్యానంద ప్రసాద్‌, ఉస్మానియా విశ్వవిద్యాలయంలో జర్నలిజం పీజీ చేసి ‘ఈనాడు’లో రిపోర్టర్‌గా చేరాడు. సన్నిహితులు ‘డిఎన్‌’అని ముద్దుగా పిలుచుకునే ప్రసాద్‌, కరీంనగర్‌ ఎడిషన్‌ ప్రారంభంలో దానికి బ్రాంచ్‌ మేనేజర్‌గా ప్రమోషన్‌ పొంది, అంచెలంచెలుగా ఎదిగాడు. ఒకనొక స్థాయిలో రామోజీరావు తర్వాత ‘ఈనాడు’లో అంతటి పవర్‌ఫుల్‌ లీడర్‌గా పేరుగాంచాడు. ఈటీవీలో వచ్చే ‘చెప్పాలని ఉంది’ కార్యక్రమానికి డిఎన్‌ ప్రసాద్‌ సంధానకర్తగా వ్యవహరిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version