తెలంగాణ సాధించుకుని తొమ్మిదేళ్లు విజయవంతంగా పూర్తయ్యాయి. పదో వసంతంలోకి అడుగుపెట్టిన సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా 21 రోజుల పాటు రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలు జరపాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. రోజుకో శాఖ ఆధ్వర్యంలో ఈ వేడుకలు అట్టహాసంగా జరుగుతున్నాయి. దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఇవాళ తెలంగాణ హరితోత్సవాన్ని ప్రభుత్వం నిర్వహించనుంది.
హరితోత్సవంలో భాగంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ఇవాళ రంగారెడ్డి జిల్లా మహేశ్వరంలోని తుమ్మలూరు అర్బన్ ఫారెస్ట్ పార్కులో మొక్కలు నాటనున్నారు. ముఖ్యమంత్రి రాకను పురస్కరించుకుని అధికారులు ఏర్పాట్లు చేశారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా తొమ్మిదేళ్లలో రికార్డుస్థాయిలో 273 కోట్ల మొక్కలను నాటినట్లు ప్రభుత్వం తెలిపింది. 2015-16 లో అటవీ విస్తీర్ణం 19 వేల 854 చదరపు కిలోమీటర్లు ఉండగా… 2023 నాటికి 26 వేల 969 చదరపు కిలోమీటర్లకు పెరిగిందని వెల్లడించింది. హరితోత్సవంలో ప్రజలు భారీగా పాల్గొనాలని సర్కారు కోరింది.
మరోవైపు రాష్ట్రవ్యాప్తంగా అన్నీ గ్రామాలు, పట్టణాల్లో తొమ్మిదో విడత హరితహారంలో భాగంగా పెద్ద ఎత్తున మొక్కలు నాటనున్నారు. ఈ విడతలో 19.29 కోట్ల మొక్కలను నాటలని లక్ష్యాన్ని నిర్ధేశించారు. అన్నీ సాగునీటి ప్రాజెక్టుల స్థలాలు, కాలువల వెంట పచ్చదనం పెంచాలని ప్రభుత్వం నిర్ణయించింది.