తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఇవాళ “ఊరూరా చెరువుల పండుగ’’ నిర్వహించనున్నారు. గ్రామ పంచాయతీలు, నీటి పారుదలశాఖ ఆధ్వర్యంలో ప్రతి గ్రామంలోని చెరువుల వద్ద పండుగ జరపనున్నారు. గ్రామం నుంచి చెరువు వరకు డప్పులు, బోనాలు, బతుకమ్మలు, మత్య్సకారుల వలలతో ఊరేగింపు నిర్వహించాలని ప్రభుత్వం తెలిపింది. రైతులు, మహిళలు, మత్య్సకారులు ఇలా అన్ని వర్గాల వారు వేడుకల్లో పాల్గొనేలా చూడాలని పేర్కొంది. పండుగ వాతావరణం ఉట్టిపడేలా చెరువు గట్టుపై ముగ్గులు, తోరణాలతో అలంకరించాలని… కట్టమైసమ్మ, చెరువు నీటికి పూజ చేయాలని సూచించింది.
ఆ తర్వాత చెరువుకట్టపైనే సభ నిర్వహించి సాంస్కృతిక కార్యక్రమాలు, బతుకమ్మ, కోలాటాలు ప్రదర్శించాలి. గోరేటి వెంకన్న రాసిన చెరువోయి… మా ఊరి చెరువు తదితర పాటలను వినిపించాలని ప్రభుత్వం ప్రత్యేకంగా స్పష్టం చేసింది. చెరువుల పునరుద్ధరణతో వచ్చిన ప్రగతి, తద్వారా పెరిగిన పంటల ఉత్పత్తి వివరాలు, మత్య్స సంపద, భూగర్భ జలాల పెరుగుదల, తదితర వివరాలను ప్రదర్శించడంతో పాటు కరపత్రాలు పంపిణీ చేయాలని పేర్కొంది.