తొమ్మిదేళ్లు విజయవంతంగా పూర్తి చేసుకుని పదో వసంతంలోకి అడుగుపెట్టిన సందర్భంగా తెలంగాణ వ్యాప్తంగా 21 రోజుల పాటు ఘనంగా నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ఊరూరా చెరువుల పండుగ నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో మిషన్ కాకతీయ పథకం కింద చెరువుల పునరుద్ధరణతో 15 లక్షల ఆయకట్టు స్థిరీకరణ జరిగినట్లు రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. ఈ నేపథ్యంలో చెరువుల పునరుద్ధరణపై ప్రభుత్వం ప్రకటన విడుదల చేసింది.
తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన వెను వెంటనే గొలుసుకట్టు చెరువుల పునరుద్ధరణ కోసం మిషన్ కాకతీయ పేరిట బృహత్తర కార్యక్రమాన్ని చేపట్టినట్లు పేర్కొంది. మిషన్ కాకతీయ పథకం ద్వారా రాష్ట్రంలో 47 వేలకు పైగా చెరువులను పునరుద్ధరించడంతో చెరువుల్లో నీటి నిల్వ సామర్థ్యం గణనీయంగా పెరిగిందని ప్రభుత్వం పేర్కొంది. 5 వేల 350 కోట్ల రూపాయలు వెచ్చించి చెరువులను పునరుద్ధరించడంతో పాటు విరివిగా చెక్ డ్యాంల నిర్మాణంతో వాగులకు పునరుజ్జీవంతో లక్షలాది ఎకరాల ఆయకట్టు స్థిరీకరణ అయిందని వివరించింది