ప్రస్తుతం దేశంలో కొందరికి.. ఆర్థిక విధానాల గురించి పట్టింపులేదని.. 24గంటలూ రాజకీయాలు తప్ప మరొకటి ఆలోచించడం లేదని ప్రధాని మోదీ ఆందోళన వ్యక్తం చేశారు. అలా అర్థనీతి నుంచి అనర్థ నీతిగా.. తప్పుడు దారుల్లో వెళ్తున్న వారిని హెచ్చరించారు. పొరుగు దేశాల్లో కొన్ని అడ్డగోలుగా అప్పులు చేసి మునిగిపోయాయని.. వాళ్లని చూసైనా మనం నేర్చుకోవాలని హితవు పలికారు.
కొన్ని రాష్ట్రాలు రాజకీయ ప్రయోజనాల కోసం భారీగా అప్పులు చేయటంపై ప్రధాని నరేంద్ర మోదీ ఆందోళన వ్యక్తం చేశారు. పొరుగు దేశాలను చూసిన తర్వాతైనా అప్రమత్తం కావాలని హితవు పలికారు. లేకుంటే ఆయా రాష్ట్రాలతోపాటు దేశం కూడా నాశనం అవుతుందని రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానానికి సమాధానంలో హెచ్చరించారు.
‘మనమైతే అప్పులు చేద్దాం.. తర్వాత వచ్చేవారు చూసుకుంటారు అన్నట్లుగా కొన్ని రాష్ట్రాలు ప్రవర్తిస్తున్నాయి. అది వారితోపాటు దేశాన్నీ నాశనం చేస్తుంది. దేశ ఆర్థిక ప్రయోజనాలు, రాష్ట్రాలు తమ ఆర్థిక పరిస్థితి విషయంలో క్రమశిక్షణ మార్గాన్ని ఎంచుకోవాల్సిందే. రెండుపూటల రోటి కోసం కన్న కలను మీరు పరిష్కరించలేదు. కానీ మేం పరిష్కరించాం. ఎవరికి సామాజిక న్యాయం ఆకాంక్ష ఉండేదో.. దాన్ని మీరు పరిష్కరించలేదు. కానీ మేం పరిష్కరించి చూపాం. ఇది దేశం చూస్తోంది.’
-నరేంద్ర మోదీ, ప్రధానమంత్రి