ఈ ఆధునిక జీవన శైలిలో తల్లిదండ్రులు పిల్లల మధ్య ఉన్న అనుబంధం సన్నగిల్లుతుంది. ఒకప్పుడు అనురాగానికి ఆప్యాయతకు పెద్దపీటగా ఉన్న బంధం ఇప్పుడు పని ఒత్తిళ్లు, సాంకేతికత ప్రభావం వల్ల బలహీనపడుతుంది. పిల్లలతో సమయం గడప లేకపోవడం వారి భావాలను అర్థం చేసుకోలేకపోవడం వంటి కారణాల వల్ల తల్లిదండ్రులకు పిల్లలకు మధ్య ఉన్న బంధం క్రమంగా దూరమవుతుంది. ఈ పరిస్థితులు ఇటు తల్లిదండ్రులను, అటు పిల్లలను కూడా మానసికంగా ఒత్తిడి గురి చేస్తున్నాయి.
కారణాలు: తల్లిదండ్రులు పిల్లల మధ్య దూరం పెరగడానికి అనేక కారణాలు ఉన్నాయి. ప్రధానంగా ఆర్థిక అవసరాల కోసం ఇద్దరు ఉద్యోగాలు చేయడం వల్ల పిల్లలతో గడిపే సమయం తగ్గిపోతుంది. దీనివల్ల పిల్లలు ఒంటరిగా ఉన్నట్లు భావిస్తున్నారు. అలాగే సెల్ ఫోన్లు, కంప్యూటర్లు, వీడియో గేమ్ లు,అంటూ సాంకేతిక సాధనాలతో పిల్లలు ఎక్కువ సమయం గడపడం వల్ల కుటుంబ సభ్యులతో మాట్లాడడం తగ్గిపోతుంది. అంతే కాకుండా సమాజంలో పెరుగుతున్న పోటీ తత్వం వల్ల తల్లిదండ్రులు తమ పిల్లల మీద అధిక ఒత్తిడి పెడుతున్నారు. ఫలితంగా పిల్లలు చదువుని భారంలా భావించి తల్లిదండ్రులపై కోపాన్ని పెంచుకుంటున్నారు. కమ్యూనికేషన్ లేకపోవడం ఒకరి భావాలను మరొకరు అర్థం చేసుకోకపోవడం కూడా ఈ బంధాన్ని బలహీనపరుస్తుంది.

పరిష్కారాలు: ఈ సమస్యని పరిష్కరించడానికి కొన్ని సులభమైన మార్గాలు ఉన్నాయి. ముందుగా తల్లిదండ్రులు తమ పిల్లల కోసం కొంత సమయానికి కేటాయించాలి. రోజులో కనీసం అరగంటైనా వారితో మాట్లాడాలి. వారి ఇష్టాలు కష్టాలు తెలుసుకోవాలి వారాంతంలో కుటుంబంతో కలిసి బయటికి వెళ్లడం భోజనం చేయడం వంటివి చేయాలి. అలాగే పిల్లలు అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి. కేవలం మార్కులు, ర్యాంకులు మాత్రమే కాకుండా వారిలో ఉన్న టాలెంట్ ను ప్రోత్సహించాలి. ఇంట్లో స్వేచ్ఛాయుత వాతావరణాన్ని కల్పించాలి. తద్వారా పిల్లలు తమ ఆలోచనలు అభిప్రాయాలను భయం లేకుండా వ్యక్తపరుస్తారు. సాంకేతికతను దూరంగా ఉంచి ఆ సమయంలో కుటుంబ సభ్యులతో ఆనందంగా గడపడం పిల్లలకు నేర్పించాలి. పిల్లలకు సంతోషాన్ని, భద్రతను అందించినప్పుడే ఈ బంధం బలపడుతుంది.