మహిళలు మగవారి కంటే ఎక్కువ మాట్లాడతారని తరచుగా వింటూ ఉంటాం. కానీ ఇది కేవలం పుకారు మాత్రమేనా? లేదా దీని వెనుక ఏదైనా బలమైన కారణం ఉందా? అసలు మహిళలు తమ భావాలను, ఆలోచనలను మాటల రూపంలో పంచుకోవడానికి ఎందుకు ఎక్కువ ఆసక్తి చూపుతారు? ఈ విషయంపై మనమెప్పుడైనా శాస్త్రీయంగా, సామాజికంగా ఆలోచించామా? ఈ సరదా ఆసక్తికరమైన ప్రశ్న వెనుక దాగి ఉన్న నిజమైన, లోతైన కారణాలను ఇప్పుడు మనం పరిశీలిద్దాం.
స్త్రీలు ఎక్కువగా మాట్లాడటానికి ప్రధాన కారణం వారి మెదడు నిర్మాణం లో ఉంది. అధ్యయనాల ప్రకారం, స్త్రీల మెదడులో భాషా కేంద్రాలు మెరుగ్గా అనుసంధానించబడి, మరింత చురుకుగా ఉంటాయి. ముఖ్యంగా ఎమోషన్స్ (భావోద్వేగాలు) మరియు కమ్యూనికేషన్ ను నియంత్రించే ప్రాంతాల మధ్య బలమైన కనెక్షన్ ఉంటుంది. మహిళలు మాట్లాడటాన్ని కేవలం సమాచారం అందించే సాధనంగా కాకుండా బంధాలను ఏర్పరచుకునే, భావోద్వేగాలను పంచుకునే ముఖ్యమైన మార్గంగా చూస్తారు.

ఉదాహరణకు వారు ఒక సమస్య గురించి మాట్లాడేటప్పుడు, పరిష్కారం కంటే కూడా ఆ అనుభవాన్ని పంచుకోవడం విన్నవించుకోవడం అనేది వారి ఒత్తిడిని తగ్గిస్తుంది. దీనికి విరుద్ధంగా పురుషులు సాధారణంగా సమస్యలకు ప్రత్యక్ష పరిష్కారాలను వెతకడానికి మాట్లాడతారు.
కేవలం మెదడు నిర్మాణం మాత్రమే కాకుండా సామాజిక పాత్రలు కూడా ఈ అలవాటును ప్రభావితం చేస్తాయి. సమాజంలో, మహిళలు తరచుగా కుటుంబంలో కమ్యూనికేటర్లుగా, కేర్టేకర్స్గా (సంరక్షకులుగా) ఉంటారు. పిల్లల అవసరాలను అర్థం చేసుకోవడం కుటుంబ సభ్యుల మధ్య భావోద్వేగ సమతుల్యతను కాపాడటం వంటి బాధ్యతలు వారిపై ఉంటాయి. ఈ పాత్రలు తరచుగా వివరణాత్మకమైన నిరంతర సంభాషణలను డిమాండ్ చేస్తాయి.
అంతేకాక మహిళలకు వారి భావోద్వేగాలను మాటల ద్వారా వ్యక్తీకరించడానికి చిన్నప్పటి నుంచే ఎక్కువ స్వేచ్ఛ, ప్రోత్సాహం లభిస్తుంది. మాట్లాడటం అనేది వారి ఆత్మవిశ్వాసాన్ని వ్యక్తిత్వాన్ని పెంపొందించుకోవడానికి తమ చుట్టూ ఉన్న ప్రపంచాన్ని ప్రభావితం చేయడానికి ఉపయోగించే శక్తివంతమైన సాధనంగా మారుతుంది. ఇది కేవలం “ఎక్కువ” మాట్లాడటం కాదు అది వారి సామాజిక మానసిక అవసరాల వ్యక్తీకరణ.
