ఏపీ ప్రభుత్వంపై ప్రతిపక్షాలు గత కొన్ని రోజులుగా ప్రధానంగా చేస్తున్నవి మూడే మూడు విమర్శలు! అవి… స్థానిక సంస్థల ఎన్నికల విషయంలో వైఎస్ జగన్… ప్రజల ఆరోగ్యాన్ని పణంగా పెట్టి ముందుకు పోతున్నారని… నిమ్మగడ్డ రమేశ్ ను ఏపీ ఎన్నికల కమిషనర్ పదవి నుంచి అర్ధాంతరంగా తప్పించారని… కరోనా కేసుల విషయంలో నిజాలు చెప్పకుండా దాచిపెడుతున్నారని? ఈ మూడు విమర్శల్లో మొదటి విమర్శలో ప్రస్తుతం వారికి ఉన్న కొన్ని సమస్యలు కారణం అనుకోవచ్చు.. ఇక రెండో సమస్య విషయంలో కుల ప్రస్థావన అధికంగా తీసుకువచ్చినా… ప్రస్తుతం ఆ విషయం హైకోర్టు పరిధిలో ఉంది! ఆ సమస్యల సంగతి అలా ఉంటే… గత కొన్ని రోజులుగా మరీ ఎక్కువగా వినిపిస్తున్న విమర్శ మాత్రం… మూడవదే!
ఇలా ఏపీ ప్రభుత్వంపై టీడీపీ నేతలు, కన్నాలాంటి బీజేపీ నేతలు, టీడీపీ అనుకూల మీడియాగా పేరుతెచ్చుకున్న ఒక వర్గం మీడియా… పదే పదే కథనాలు ప్రసారం చేస్తున్న విషయం… కరోనా కేసులు దాచిపెడుతున్నారని! ఈ విషయాలపై తాజాగా ఘాటుగా స్పందించారు ఏపీ మంత్రి అవంతి శ్రీనివాస్! ప్రభుత్వం కరోనా పాజిటివ్ కేసులు దాస్తుందని ప్రతిపక్షాలు పదే పదే విమర్శలు చేయడం సబబు కాదని హితవు పలుకుతూ మొదలుపెట్టిన అవంతి… ఏపీ ప్రభుత్వం ఒక్క కరోనా కేసు అయినా దాచినట్లు నిరూపిస్తే.. తాను మంత్రి పదవికి రాజీనామా చేస్తానని.. ఒకవేళ నిరూపించలేకపోతే మాత్రం టీడీపీ అధినేత చంద్రబాబు ప్రధాన ప్రతిపక్ష హోదాకి రాజినామా చేయాలని సవాల్ విసిరారు. “కరోనా కేసులు ఏమైనా డబ్బులా..? బ్యాంకుల్లో దాచుకోవడానికి” అని ప్రశ్నించిన అవంతి… ఇలా రోజూ తన అనుకూల మీడియాలో ఊకదంపుడు కథనాలు ఇస్తున్నట్లుగా.. ఈ కేసుల వివరాలను ప్రతిపక్ష పార్టీలు గానీ, వారి ఎమ్మెల్యేలుగానీ నిరూపించొచ్చని… వారికి కూడా ఈ సవాల్ వరిస్తుందని చెప్పకనే చెప్పారు!
దీంతో ఈ వ్యవహారంపై ఏపీ సర్కార్ నుంచి స్ట్రాంగ్ కౌంటర్ పడినట్లే అనేది పలువురి అభిప్రాయంగా ఉంది! ఈ సవాల్ అనంతరం ఇక “ఏపీ ప్రభుత్వం కరోనా కేసులు దాస్తుంది” అనే విమర్శలు ప్రతిపక్ష నాయకుల నుంచి.. వాటికి వంతపాడుతూ కథనాలు ఇస్తున్న వారి అనుకూల మీడియా నుంచి రావనే అంటున్నారు! చూడాలి మరి… అవంతి శ్రీనివాస్ సవాల్ ను ఏపీ ప్రతిపక్ష పార్టీ ఎలా తీసుకుంటుందో.. మరెలా స్పందిస్తుందో!!