తెలంగాణా కేబినేట్ సమావేశం అనంతరం సీఎం కేసీఆర్ మీడియా తో మాట్లాడారు. ఈ సందర్భంగా నేడు మరో 18 మందికి కరోనా వైరస్ పాజిటివ్ వచ్చిందని వివరించారు. దీనితో 858 మందికి కరోనా వైరస్ పాజిటివ్ వచ్చిందని ఆయన పేర్కొన్నారు. 21 మంది కరోనా కారణంగా ప్రాణాలు కోల్పోయారని అన్నారు. 651 మంది కరోనా వైరస్ తో పోరాటం చేస్తున్నారని అన్నారు. ఒక్క కేసు కూడా లేని జిల్లాలు తెలంగాణాలో 4 ఉన్నాయని అన్నారు.
ఎవరి ఆరోగ్యం కూడా విషమంగా లేదని చెప్పారు. వరంగల్, యాదాద్రి, భువనగిరి, సిద్ధిపేట, వనపర్తి లో కేసులు లేవని అన్నారు.చాలా దేశాలు లాక్ డౌన్ ని పోడిగిస్తున్నాయని కేసీఆర్ పేర్కొన్నారు. లాక్ డౌన్ విధించి సడలించి మళ్ళీ విధించిన దేశాలు ఉన్నాయని అన్నారు. రేపటి నుంచి తెలంగాణాలో కేంద్రం చెప్పినట్టు ఎలాంటి సడలింపు ఉండదు అని ఆయన పేర్కొన్నారు. పక్కాగా లాక్ డౌన్ అమలు అవుతుందని చెప్పారు.
ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నామని ఆయన పేర్కొన్నారు. లాక్ డౌన్ విధించిన రోజున ఏ గైడ్ లైన్స్ ఇచ్చారో అవే కొనసాగుతాయని ఆయన పేర్కొన్నారు. కేసుల విషయంలో మే 1 తర్వాత కాస్త తగ్గే అవకాశాలు ఉన్నాయని పేర్కొన్నారు. 42 దేశాల్లో ఇదే పరిస్థితి ఉందని అన్నారు. జాగ్రత్తగా లేకపోతే ప్రమాదం వచ్చే అవకాశం ఉందని ఆయన పేర్కొన్నారు.
నిత్యావసర సరుకులు ఎప్పటికప్పుడు అందుబాటులో ఉంటాయని ఆయన వివరించారు. పిల్లల పాలు, కూరగాయలు అన్నీ అందుబాటులో ఉంటాయని, వ్యవసాయ పనులకు ఎలాంటి ఇబ్బంది ఉండదు అని అన్నారు. కేసులు తగ్గితే మన రాష్ట్రానికి ఏ ఇబ్బంది ఉండదు అన్నారు ఆయన. ప్రజలు అందరూ కూడా జాగ్రత్తగా ఉండాలని అన్నారు.
లాక్ డౌన్ మే 7 వరకు
ప్రజల క్షేమం దృష్ట్యా లాక్ డౌన్ ని పొడిగించాలని నిర్ణయం తీసుకున్నామని, ఈ మేరకు ఒక సర్వే చేసామని తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. కేబినేట్ సమావేశం తర్వాత ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. తెలంగాణాలో లాక్ డౌన్ పోడిగించాలి అని మీడియా చెప్పిందని అన్నారు. తాను వ్యక్తిగతంగా అందరితో మాట్లాడా అని, అందరూ కూడా లాక్ డౌన్ ని పెంచాలని చెప్పారని అన్నారు.
సర్వేల్లో 92 శాతం లాక్ డౌన్ ని పెంచాలి అని చెప్పారని అన్నారు. అందరూ కూడా లాక్ డౌన్ ని కొనసాగించకపోతే ఇబ్బంది పడతామని చెప్పారని అన్నారు, మే 7 వరకు తెలంగాణా లో లాక్ డౌన్ ని పోడిగిస్తున్నామని అన్నారు.చాలా మంది తెలంగాణాలో లాక్ డౌన్ ని కొనసాగించాలని చెప్పారని అవసరం అయితే మే నెలాఖరు వరకు లాక్ డౌన్ ఉండాలి అని సూచించారని అన్నారు.
ఫుడ్ డెలివరి సర్వీసులపై నిషేధం…
ఫుడ్ డెలివరి సర్వీసులు అసలు ఉండవని, పిజ్జా వలన 69 మందికి కరోనా సోకిందని అన్నారు. కంటైన్మేంట్ ఏరియా లో ఎవరూ కూడా బయటకు రావొద్దని అన్నారు. స్విగ్గి, జోమాటోపై కూడా నిషేధం ఉంటుందని అన్నారు. ఏ ప్రాంతాల నుంచి అయినా సరే మే 7 వరకు బయటకు రావొద్దని అన్నారు.
విమాన ప్రయాణికులకు మే 7 వరకు తెలంగాణాకు రావొద్దు అని కేసీఆర్ సూచించారు. వచ్చినా ఏ విధమైనా ప్రయాణ సర్వీస్ లు ఉండవని అన్నారు. తిను బండారాలు అసలు అందుబాటులో వద్దని, ప్రజలు అందరూ అర్ధం చేసుకోవాలని సూచించారు. పండగలు, ప్రార్ధనలు ఇంట్లోనే చేసుకోవాలని, అసలు ఏ కారణం తో బయటకు రావొద్దని అన్ని మతాల వారికి విజ్ఞప్తి చేస్తున్నాం అన్నారు ఆయన.
ఉద్యోగుల జీతాల్లో కోత కొనసాగుతుందని ఆయన స్పష్టం చేసారు. అందరు ప్రజా ప్రతినిధులు కూడా విజయవంతం గా పని చేస్తున్నారని ఆయన కొనియాడారు. ఇంకా కొందరు దాతలు కూడా ముందుకు వచ్చి తమ సహకారం అందిస్తున్నారని, ఎవరూ ఉపవాసం ఉండకూడదు అని ఆయన పేర్కొన్నారు. వారందరికీ హృదయ పూర్వక ధన్యవాదాలు తెలియచేసారు.పోలీసులకు ఈ నెల జీతాలు ఇచ్చే సమయంలో సిఎం గిఫ్ట్ కింద పది శాతం అదనంగా ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. మున్సిపల్ సిబ్బంది సహా కొందరికి గత నెలలో ఇచ్చిన సిఎం గిఫ్ట్ ఈ నెల కూడా కొనసాగుతుందని ఆయన స్పష్టం చేసారు.
మూడు నెలల ఇంటి అద్దె వాయిదా…
తెలంగాణాలో ఇంటి అద్దె మూడు నెలలు వసూలు చేయవద్దని తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేసారు. ఇది చట్టప్రకారం మేము ఇస్తున్న ఆదేశాలు అని ఆ తర్వాత వాయిదాల ప్రకారం వసూలు చేసుకోవాలని ఆయన సూచించారు. వేధిస్తే మాత్రం కఠినంగా చర్యలు తీసుకుంటామని అన్నారు. మూడు నెలల తర్వాత ఇంటి అద్దెకు వడ్డీ వసూలు చేయవద్దని ఆయన స్పష్టం చేసారు. ఇంటి ఓనర్లు ఇబ్బంది పెడితే 100 కి ఫోన్ చెయ్యాలని సూచించారు..
ఇంటి పన్నుని కూడా వాయిదా వేస్తున్నాం అన్నారు. ప్రైవేట్ స్కూల్స్ యాజమాన్యాలకు ఫీజ్ లు పెంచే అవకాసం లేదు. ఫీజ్ లు పెంచకూడదని స్పష్టం చేసారు. ఏ నెల ట్యూషన్ ఫీజు ఆ నెల మాత్రమే వసూలు చెయ్యాలని హెచ్చరించారు. ఎటు వంటి ఫీజులు కూడా వసూలు చేయవద్దని స్పష్టం చేసారు. ఉల్లంఘిస్తే మాత్రం విద్యాసంస్థల అర్హత రద్దు చేస్తామని ఆయన పేర్కొన్నారు.
మే నెలలో కూడా సరుకులు, డబ్బులు
ఈ నెల ఎలా అయితే 12 కేజీలు ఇచ్చారో అలాగే వచ్చే నెల కూడా ఇస్తారని ఆయన పేర్కొన్నారు. ఇక 1500 కూడా ఇస్తామని, మే 7 లోపే అందరికి అందిస్తాం అన్నారు. కొంత మంది తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని అన్నారు. ఒకసారి ప్రభుత్వం డబ్బులు జమ చేస్తే వాపస్ అయ్యే అవకాశం లేదని, కంగారు పడి బ్యాంకు లకు వెళ్ళవద్దు అని ఆయన సూచించారు. ఆసరా పించన్ లు యధావిధిగా కొనసాగుతాయని అన్నారు.
కొందరి ప్రచారం కారణంగా బ్యాంకులకు రద్దీ పెరుగుతుందని అన్నారు. వలస కూలీలకు కూడా 1500 ఇస్తామని అలాగే 12 కేజీలు బియ్యం ఇస్తామని ఎవరూ కూడా ఇబ్బంది పడకూడదు కేసీఆర్ వ్యాఖ్యానించారు. కొన్ని పరిశ్రమలు కరెంట్ చార్జీలు వాయిదా వెయ్యాలని కోరారని, మే ఏప్రిల్ మాసాలకు గాను కరెంట్ వాడినా వాడక పోయినా కట్టే కరెంట్ చార్జీలు, కట్టాల్సిన అవసరం లేదని, పాత బిల్లులు చెల్లిస్తే డిస్కౌంట్ ఇస్తామని పేర్కొన్నారు.
వైద్య సిబ్బందికి ధన్యవాదాలు తెలియచేసారు కేసీఆర్. ధైర్యం కోల్పోకుండా వారు సేవలు అందిస్తున్నారని అన్నారు. వారికి కావాల్సిన ఎక్విప్మెంట్ అంతా సమకూర్చారమని అన్నారు. గచ్చిబౌలీ స్టేడియం లో ఉండే స్పోర్ట్స్ కాంప్లెక్స్ ని తెలంగాణా ఆరోగ్య శాఖకు బదిలీ చేస్తున్నామని వాళ్లకు దాని మీద అన్ని హక్కులు ఉంటాయని పేర్కొన్నారు. క్రీడా శాఖా నుంచి తీసుకున్నామని ఆయన వివరించారు.
ప్రైవేటు స్కూళ్లలో ఫీజులు పెంచొద్దు
తెలంగాణ రాష్ట్రంలో కొన్ని ప్రైవేటు పాఠశాలలు ఫీజులు ఇష్టారాజ్యంగా పెంచుతున్నట్లు తమ దృష్టికి వచ్చిందని తెలిపిన ముఖ్యమంత్రి , దీన్ని ఎట్టి పరిస్థితుల్లో సహించబోమన్నారు. 2020-21 విద్యా సంవత్సరానికి ఎటువంటి ఫీజు పెంపులు ఉండకూడదని అత్యంత కఠినంగా ఆదేశాలు జారీ చేస్తున్నట్లు సీఎం స్పష్టం చేసారు.
స్కూళ్లు సంవత్పరం మొత్తానికి ఒకేసారి ఫీజు వసూలు చేయడం, వివిధ రకాల ఫీజులు చెల్లించమనడం లాంటి పద్ధతులు అవలంబిస్తే, కఠిన చర్యలు తీసుకుంటామని కేసీఆర్ హెచ్చరించారు. నెలనెలా మాత్రమే ఫీజు చెల్లించాలని, అదీ కేవలం ట్యూషన్ ఫీజు మాత్రమే కట్టాలని విద్యార్థుల తల్లిదండ్రులకు ముఖ్యమంత్రి హితవు పలికారు. ఏ పాఠశాల అయినా, ఈ విషయాలపై విద్యార్థులను వేధించినట్లయితే డయల్100కు ఫిర్యాదు చేయాలని సూచించారు.
TIMS ఏర్పాటు…
గచ్చీబౌలి లో 1500 పడకల ఆస్పత్రి సిద్దం చేసామని తెలంగాణా సిఎం కేసీఆర్ పేర్కొన్నారు. దానికి టిమ్స్ గా నామకరణం చేస్తున్నామని అన్నారు. క్రీడా శాఖ నుంచి వైద్య శాఖకు దాన్ని బదిలీ చేసామని, క్రీడా శాఖపై కేబినేట్ సబ్ కమిటి వేశామని ఆయన వివరించారు. తెలంగాణా ఇన్స్తిటూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ గా నామకరణం చేసినట్టు పేర్కొన్నారు. అక్కడ వైద్య పరిశోధనలు జరుగుతాయని ఆయన వివరించారు.
వ్యవసాయంకి సంబంధించి ఇండియన్ హిస్టరీ లో ఫస్ట్ టైం రైతులు పండించిన పంటలన్నీ ప్రభుత్వమే కొంటుందని కేసీఆర్ స్పష్టం చేసారు. శ్రీ రాం సాగర్ నుండి ఆరు నెలల పాటు నీరు విడుదల చేసామని అన్నారు. అన్ని రకాల పంటలను ప్రభుత్వమే కొంటుందని ఆయన వివరించారు. మీకు చేరువలో ఉన్న మంత్రులను లేదా రైతు బంధు గ్రూప్ లో సంప్రదించండి అని కేసీఆర్ సూచించారు. ఎరువుల దుకాణాల వద్ద రైతులు గుమి గూడవద్దు అన్నారు.
పెళ్ళిళ్ళు, ఫంక్షన్లు రద్దు…
రైతులకు అందరు గుమి కూడి ఎరువులనురద్దీ లేకుండా మే నెలలోనే కొనుగోలు చేయండి అని సూచించారు, తెలంగాణాలో పెళ్ళిళ్ళు, ఫంక్షన్లు ఉండవు కాబట్టి ఆ హాల్స్ ని ఎరువుల గౌదాన్ లు గా వాడుకోవాలని ఆయన ఆదేశాలు ఇచ్చారు. ఇప్పటికే కలెక్టర్లకు సూచనలు చేసామని పేర్కొన్నారు. రైతులు వెంటనే ఎరువులను కొనుక్కోవాలని ఆయన విజ్ఞప్తి చేసారు. రాష్ట్రానికి కావలసినంత స్టాక్ ఎరువులు ఉన్నాయన్నారు.
వ్యాధి తగ్గుతుంది అనుకున్నాం కాని తగ్గలేదని, ఇక నుంచి కఠినం గా ఉంటామని ఆయన స్పష్టం చేసారు. ప్రజలు అందరూ కూడా ఇందుకు సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేసారు. అందరూ సమర్ధవంతంగా ఉంటే దీన్ని ఎదుర్కొంటామని అన్నారు. కరోనా వైరస్ కి అసలు మందు లేదని, ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ఇంకా భయంకరంగా పరిస్థితులు ఉంటాయని హెచ్చరించారు.
ప్రజల సంక్షేమం కోసం ఈ విధమైన నిర్ణయాలను తీసుకోవాల్సి వచ్చిందన్నారు. ధైర్యంగా ఉండి కరోనా ని ఎదుర్కోవాలని కోరారు. మన పొట్ట మనమే నింపుకోవాలని మన దేశానికి ఏ దేశం కూడా అన్నం పెట్టే పరిస్థితి లేదు కాబట్టి ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ కొనసాగించాలని అనుకున్నామని వివరించారు. భారత్ ఎవరిని అడుక్కునే పరిస్థితిలో లేదని కేసీఆర్ వ్యాఖ్యానించారు. తెలంగాణా కంటే వంద దేశాలు చిన్నవి అని అన్నారు.