తను ప్రతిపాదించిన క్వాంటిటేటివ్ ఈజింగ్, హెలికాప్టర్ మనీ అంశాలపై పలువురు విమర్శలు చేసారని, వారు తాము ఆయా రంగాలలో పండితులమని భావిస్తుంటారని, వారికి పైత్యమెక్కువ అని తెలంగాణ సీఎం కేసీఆర్ వ్యాఖ్యానించారు.
రాష్ట్రాలకు కరోనా మూలంగా ఆదాయం లేదని, అందువల్లనే తాము ఎఫ్ఆర్‌బీఎం పరిమితి పెంచాలని కేంద్రాన్ని కోరామని తెలిపిన కేసీఆర్, ఇదే సందర్భంలో క్వాంటిటేటివ్ ఈజింగ్, హెలికాప్టర్ మనీ అనే ఆర్థిక విధానాలను ప్రధానికి వివరించి, వాటి గురించి ఆలోచించాల్సిందిగా విజ్ఞప్తి చేసామన్నారు. ఈ పద్ధతులు కొన్ని దేశాలలో విజయవంతంగా అమలు చేసి ఆర్థిక మాంద్యం నుండి బయటపడ్డారని చెప్పిన సీఎం, కొందరు మేధావులు దీన్ని విమర్శించారన్నారు.
ఈ క్వాంటిటేటివ్ ఈజింగ్, హెలికాప్టర్ మనీలు కాకపోతే వేరే రకంగానైనా రాష్ట్రాలను ఆదుకోవాలని తాము కోరుతున్నామే గానీ, ఇవే పద్ధతులను అవలంబించాలని తన ఉద్దేశం కాదని సీఎం అన్నారు. కొంతమంది పండితులు తాను చెప్పిన ఈ అంశాలపై అనవసర రాద్ధాంతం చేస్తున్నారని, ఈ పండితులకు పైత్యం ఎక్కువ అని ఘాటుగా వ్యాఖ్యానించారు.