దేశంలో కరోనా లాక్డౌన్ను ఎత్తివేసే విషయమై ప్రధాని మోదీ ఇప్పటికే అన్ని రాష్ట్రాలకు చెందిన ముఖ్యమంత్రులు, కేంద్ర పాలిత ప్రాంతాలకు చెందిన లెఫ్టినెంట్ గవర్నర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన సంగతి తెలిసిందే. అయితే ప్రజల ఆరోగ్యంతోపాటు దేశ ఆర్థిక వ్యవస్థ కూడా ముఖ్యమేనని మోదీ అన్నారు. ఈ క్రమంలోనే ఓ వైపు కరోనా నుంచి ప్రజల ఆరోగ్యాన్ని కాపాడడంతోపాటు.. మరోవైపు ఆర్థిక వ్యవస్థ పూర్తిగా పతనం కాకుండా ఉండేందుకు గాను.. దశలవారీగా లాక్డౌన్ను ఎత్తివేయాలని మోదీ రాష్ట్రాలకు సూచించిన సంగతి తెలిసిందే. అయితే లాక్డౌన్ను ఎత్తి వేయడానికన్నా ముందు.. దేశంలోని జిల్లాలను రెడ్, ఆరెంజ్, గ్రీన్ జోన్లుగా విభజించనున్నారు.
గ్రీన్ జోన్ – దేశంలో కరోనా కేసులు అస్సలు నమోదు కాని జిల్లాలను గ్రీన్ జోన్లుగా ప్రకటించనున్నారు. ఈ క్రమంలో దేశంలో మొత్తం 400 జిల్లాల్లో ఇప్పటి వరకు కరోనా కేసులు నమోదు కాలేదు. దీంతో ఆయా జిల్లాలను గ్రీన్ జోన్లుగా ప్రకటించనున్నారు.
ఆరెంజ్ జోన్ – 15 కన్నా తక్కువ కరోనా కేసులు నమోదు కావడంతోపాటు కరోనా కేసుల సంఖ్య అసలు పెరగకపోతే.. అలాంటి జిల్లాలను ఆరెంజ్ జోన్ కింద ప్రకటించనున్నారు. ఈ జోన్లలో ప్రజా రవాణా చాలా తక్కువ స్థాయిలో అందుబాటులో ఉంటుంది. ఇక కేవలం వ్యవసాయం, దాని అనుబంధ రంగాలకు చెందిన వారికి మాత్రమే ఈ జోన్లలో తిరిగేందుకు అనుమతినిస్తారు.
రెడ్ జోన్ – 15 కన్నా ఎక్కువ కరోనా కేసులు నమోదవడంతోపాటు ఆ కేసుల సంఖ్య రోజు రోజుకీ పెరుగుతూ ఉంటే.. అలాంటి జిల్లాలను రెడ్ జోన్ కింద ప్రకటిస్తారు. ఈ జోన్లలో ప్రజలు ఇండ్లకే పరిమితం అవ్వాలి. రహదారులపై రాకపోకలను నిషేధించి పూర్తిగా లాక్డౌన్ అమలు చేస్తారు.
ఇలా మొత్తం 3 రకాల జోన్లలో జిల్లాలను విభజించి.. లాక్డౌన్ను దశలవారీగా ఎత్తేయనున్నారు. ఈ మేరకు ప్రధాని మోదీ ఈ విషయంపై రాష్ట్రాల సీఎంలకు వివరాలు వెల్లడించినట్లు తెలిసింది. ఇక మోదీ ఈ విషయాన్ని అధికారికంగా ఎప్పుడు వెల్లడిస్తారో చూడాలి..!