కరోనా వల్ల దేశమంతా ఓవైపు విలవిలలాడిపోతోంది. పేదలకు ఆహారం దొరకడం లేదు. పూటకు తిండికి కూడా నోచుకోని ఎంతోమంది పేదలు నేడు ఆకలితో అలమటిస్తున్నారు. ఎంతో మంది ఉపాధి కోల్పోయారు. సొంత ఊర్ల నుంచి వేరే రాష్ట్రాలకు వెళ్ళిన వలస కార్మికులు చేతిలో డబ్బులు లేక, తింటానికి తిండి లేక అల్లాడిపోతున్నారు. మరో వైపు ప్రజలు ఇండ్ల నుంచి బయటకు వస్తే తమకు ఎక్కడ కరోనా సోకుతుందేమోనని బెంబేలెత్తిపోతున్నారు. ఇక ఇప్పటికే హాస్పిటల్స్ లో కరోనా రోగులకు చికిత్స అందిస్తూ వైద్య సిబ్బంది 24 గంటలూ హాస్పిటల్స్ కే పరిమితమవుతున్నారు. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో ఓ వైపు దేశం ఉంటే.. మరో వైపు బాలీవుడ్ సెలెబ్రిటీలు మాత్రం బుద్ధి లేకుండా ప్రవర్తిస్తున్నారు.
కరోనా వల్ల పనీ పాటా ఏమీ లేక.. ఇంట్లో అంట్లు తోముతూ.. బట్టలు ఉతుకుతూ ఓ హీరోయిన్ కాలక్షేపం చేస్తూ.. ఆ ఫోటోలను తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేస్తే.. మరొక సెలబ్రిటీ జంట హెయిర్ కటింగ్ లో నిమగ్నమై ఆ వీడియోను షేర్ చేసింది. ఇక ఒకరు వంట చేసి ఫోటోలను పెడితే.. కొందరు తాము చేసిన పనుల తాలూకు వీడియోలను సోషల్ మీడియాలో పెట్టారు. దీంతో వాటిని కొన్ని ప్రముఖ మీడియా సంస్థలు తమ సైట్లలో పోస్ట్ చేశాయి. ఈ క్రమంలో ఆ వార్తల పట్ల నెటిజన్లు ఇప్పుడు మండి పడుతున్నారు.
కరోనా వైరస్ వల్ల ఎలాంటి పనీ పాటా లేక ఇంట్లో కాలక్షేపం చేస్తూ.. అడ్డమైన పోస్టులు పెడుతున్న బాలీవుడ్ సెలెబ్రిటీలకు నెటిజన్లు క్లాస్ పీకుతున్నారు. వీలైతే ఆకలితో ఉన్నవారికి అన్నం పెట్టండి. లేదా కరోనా పై పోరాటం చేయడానికి అవసరం అయిన ఆర్థిక సహాయం చేయండి. అదీ వీలు కాకపోతే ఇంట్లో మూసుకుని కూర్చోండి. అంతేకానీ.. ఓవైపు దేశం ఇలాంటి దుర్భరమైన స్థితిలో ఉంటే.. మరోవైపు అలాంటి దిక్కుమాలిన పోస్టులు మాత్రం పెట్టకండి. ఏదైనా ఉంటే దాన్ని మీ ఇళ్లకే పరిమితం చేయండి.. అంటూ నెటిజన్లు తీవ్రంగా విమర్శిస్తున్నారు. ఇక అలాంటి దిక్కుమాలిన పోస్టులకు చెందిన వార్తలు పెట్టేందుకు మీకు సిగ్గు లేదా..? అని మీడియా సంస్థలపై కూడా నెటిజన్లు తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అవును మరి.. పేదవారి ఆకలి వార్తల కన్నా.. సెలెబ్రిటీల కాలక్షేప వార్తలే ఇప్పుడు మీడియాకు ఎక్కువ అయ్యాయి.. ఏం చేస్తాం. అంతా మన ఖర్మ కాకపోతే..!