కరోనా విజృంభిస్తే.. భార‌త్ సిద్ధంగా ఉందా..? స‌దుపాయాల సంగ‌తేంటి..?

-

ప్ర‌పంచ వ్యాప్తంగా క‌రోనా మ‌హ‌మ్మారి విస్తృతంగా వ్యాప్తి చెందుతోంది. భార‌త్‌లో ఇప్ప‌టి వ‌ర‌కు 979 క‌రోనా కేసులు న‌మోదు కాగా.. 87 మంది రిక‌వ‌రీ అయ్యారు. మ‌రో 25 మంది చ‌నిపోయారు. అయితే ప్ర‌స్తుతానికి భార‌త్‌లో క‌రోనా వ్యాప్తి మరీ అంత ఆందోళ‌న‌క‌ర స్థితిలో లేదు. అయిన‌ప్పటికీ ముందు ముందు ఏం జ‌రుగుతుందో తెలియ‌దు. కరోనా వైర‌స్ వేగంగా వ్యాప్తి చెందుతూ.. విజృంభిస్తే.. అప్పుడు మ‌న దేశంలోనూ.. మ‌న‌కు ఊహ‌కంద‌ని విప‌రీత ప‌రిణామాలు ఏర్ప‌డేందుకు అవ‌కాశం ఉంటుంది. ఇక పెద్ద ఎత్తున క‌రోనా బారిన ప‌డే రోగుల‌కు చికిత్స అందించేందుకు స‌దుపాయాల‌ను కూడా ఇప్ప‌టి నుంచే సిద్ధం చేయాల్సి ఉంటుంది. మ‌రి భార‌త్ ఆ ప‌రిణామాల‌ను ఎదుర్కొనేందుకు ఏ మేర సిద్ధంగా ఉంది..? ప‌్ర‌స్తుతం భార‌త్‌లో ఉన్న వైద్య స‌దుపాయాల ప‌రిస్థితి ఏమిటి..? అంటే..

మ‌న దేశంలో కేంద్ర ఆరోగ్య శాఖ చెబుతున్న లెక్క‌ల ప్ర‌కారం.. మార్చి 17వ తేదీ వ‌ర‌కు… 84వేల మంది భార‌తీయుల‌కు 1 ఐసొలేష‌న్ బెడ్ మాత్ర‌మే అందుబాటులో ఉంది. అలాగే ప్ర‌తి 36వేల మందికి 1 క్వారంటైన్ బెడ్‌, ప్ర‌తి 11,600 మందికి 1 డాక్ట‌ర్‌, ప్ర‌తి 1826 మందికి 1 హాస్పిట‌ల్ బెడ్‌లు అందుబాటులో ఉన్నాయి. అయితే ఈ లెక్క‌ల‌ను చూస్తే ఏ స‌గ‌టు భార‌తీయుడికైనా స‌రే.. వెన్నులో వ‌ణుకు పుడుతుంది. క‌రోనాను ఎదుర్కొనేందుకు ఈ స‌దుపాయాలు అస్స‌లు ఏమాత్రం స‌రిపోవు. మ‌రి ముందు ముందు ప‌రిస్థితి దిగ‌జారితే.. అప్ప‌టి వ‌ర‌కైనా భార‌త్.. వైద్య‌, ఆరోగ్య స‌దుపాయాల‌ను సిద్ధం చేసుకోగ‌లుగుతుందా.. అంటే.. అందుకు అవున‌నే స‌మాధానం వినిపిస్తోంది.

* దేశంలోని అనేక రాష్ట్రాల్లో క‌రోనా కేసుల సంఖ్య పెరుగుతున్న దృష్ట్యా.. ఆ శాతాన్ని బ‌ట్టి కేవ‌లం కరోనా పేషెంట్ల‌కు మాత్ర‌మే చికిత్స‌ను అందించేలా ప్ర‌త్యేక హాస్పిట‌ళ్ల‌ను సిద్ధం చేయాల‌ని కేంద్రం ఇప్ప‌టికే రాష్ట్రాల‌ను ఆదేశించింది. దీంతో అన్ని రాష్ట్రాలు ఇప్పుడు అదే ప‌నిలో ఉన్నాయి.

* క‌రోనాపై పోరాటానికి ఆర్మీ కూడా ముందుకు క‌ద‌లివ‌చ్చింది. దేశంలో 28 స‌ర్వీస్ హాస్పిట‌ళ్ల‌లో క‌రోనా పేషెంట్ల‌కు చికిత్స అందించేందుకు ప‌డ‌క‌ల‌ను సిద్ధం చేస్తున్నారు. ఇక వీటిలో 5 హాస్పిట‌ళ్ల‌లో క‌రోనా టెస్టులు చేసేందుకు కావ‌ల్సిన అన్ని స‌దుపాయాల‌ను ఏర్పాటు చేస్తున్నారు.

* దేశంలోని ప్ర‌ముఖ ప‌బ్లిక్ సెక్టార్ కంపెనీల్లో ఒక‌టైన భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్‌కు పెద్ద ఎత్తున వెంటిలేట‌ర్ల‌ను త‌యారు చేయాల‌ని కేంద్రం చెప్పింది. దీంతో వారు ఆ ప‌నిలో ఉన్నారు. అలాగే క‌రోనా రోగుల‌కు చికిత్స అందించే వైద్యుల కోసం కావ‌ల్సిన ప్ర‌త్యేక వైద్య ప‌రిక‌రాలు, సేఫ్టీ ప‌రిక‌రాలు, మాస్క్‌లు, హ్యాండ్ శానిటైజ‌ర్లు, ఇత‌ర ప‌రిక‌రాల‌ను త‌యారు చేసేందుకు డీఆర్‌డీవో ముందుకు వ‌చ్చింది.

* క‌రోనా వ‌చ్చిన వారితోపాటు క‌రోనా అనుమానితుల‌కు స‌హాయం చేసేందుకు కావ‌ల్సిన ఆర్థిక స‌హాయాన్ని కేంద్రం ఇప్ప‌టికే ఆర్మీకి అంద‌జేసింది. వారు ఆ ప‌నిలో నిమ‌గ్న‌మ‌య్యారు.

* దేశంలోని అన్ని రైల్వే స్టేష‌న్ల‌లోనూ నాన్ ఏసీ కోచ్‌ల‌లో ఐసొలేష‌న్ వార్డుల‌ను ఏర్పాటు చేయ‌నున్నారు. ఇప్ప‌టికే రైల్వే శాఖ 10 కోచ్‌లు క‌లిగిన ఓ ఐసొలేష‌న్ వార్డును ఏర్పాటు చేసింది. దాన్ని వైద్య‌, ఆరోగ్య శాఖ అధికారులు ఓకే చేస్తే.. దేశంలోని అన్ని రైల్వే స్టేష‌న్ల‌లోనూ వారానికి ఒక ఐసొలేష‌న్ వార్డును సిద్ధం చేస్తారు.

* రోజు రోజుకీ పెరిగే క‌రోనా పేషెంట్ల సంఖ్య‌ను దృష్టిలో ఉంచుకుని హాస్పిటళ్ల‌లో మ‌రిన్ని ఐసొలేష‌న్‌, క్వారంటైన్ వార్డుల‌ను ఏర్పాటు చేయాల‌ని కేంద్రం ఇప్ప‌టికే రాష్ట్రాల‌కు ఆదేశాలు జారీ చేసింది. అలాగే క‌రోనా నయం అయిన వారిని వీలైనంత త్వ‌ర‌గా డిశ్చార్జి చేసి, కొత్త వారు వ‌స్తే.. బెడ్ల‌ను త్వ‌ర‌గా సిద్ధం చేసేలా ప‌క్కాగా ప్ర‌ణాళిక‌లు అమ‌లు చేయాల‌ని కూడా కేంద్రం ఆదేశించింది.

* దేశ‌వ్యాప్తంగా క‌రోనా చికిత్స చేసే అన్ని హాస్పిట‌ళ్ల‌లోనూ వీలైనన్ని ఎక్కువ వెంటిలేట‌ర్లు, ఆక్సిజ‌న్ మాస్కుల‌ను సిద్ధంగా ఉంచుకోవాల‌ని.. ఎలాంటి ప‌రిస్థితి ఎదురైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా వైద్య ప‌రిక‌రాల‌ను అమ‌ర్చుకోవాల‌ని.. కేంద్రం రాష్ట్రాల‌కు ఆదేశాలు జారీ చేసింది.

* రానున్న రోజుల్లో ఏవైనా విప‌రీత ప‌రిణామాలు ఏర్ప‌డితే ఎదుర్కొనేందుకు కొన్ని ప్ర‌త్యేక టీంల‌ను ఢిల్లీలోని ఎయిమ్స్ సిద్ధం చేసింది.

* అంత‌గా ఎమ‌ర్జెన్సీ లేని శ‌స్త్ర చికిత్స‌ల‌ను వాయిదా వేసుకోవాల‌ని కేంద్రం హాస్పిట‌ళ్ల‌కు సూచించింది. ప్ర‌భుత్వ హాస్పిట‌ళ్ల‌లో స‌దుపాయాలు స‌రిపోక‌పోతే.. ప్రైవేటు హాస్పిట‌ళ్ల సేవ‌ల‌ను ఉప‌యోగించుకోవాల‌ని కేంద్రం నిర్ణ‌యం తీసుకుంది.

* రానున్న రోజుల్లో క‌రోనా రోగుల సంఖ్య పెరిగితే అందుకు త‌గిన విధంగా వెంటిలేట‌ర్లు ఉండాలి. అందుక‌ని కేంద్రం 10వేల వెంటిలేట‌ర్ల త‌యారీకి ఆర్డ‌ర్ ఇచ్చింది.

ఇవే కాకుండా క‌రోనా బాధితుల‌కు (రోగులు, అనుమానితులు, క‌రోనా వ‌ల్ల ఉపాధి కోల్పోయిన వారు, కూలీలు, కార్మికులు) స‌హాయం అందించేందుకు దేశ‌వ్యాప్తంగా ఇప్ప‌టికే అనేక మంది వ్యాపార‌వేత్త‌లు, దాత‌లు, సినీ ప్ర‌ముఖులు ముందుకు వ‌చ్చిన నేప‌థ్యంలో వారి విరాళాలతో కరోనాపై పోరాటం చేయ‌నున్నారు. అయితే భ‌విష్య‌త్తులో ప‌రిస్థితి చేయిదాటితే ఆ ప‌రిణామాల‌ను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండేలా.. ఇప్ప‌టి నుంచే అన్ని ఏర్పాట్లు, సౌక‌ర్యాలు ఏర్పాటు చేస్తే.. క‌రోనాను మ‌నం స‌మ‌ర్థ‌వంతంగా ఎదుర్కొనేందుకు వీలు క‌లుగుతుంది. ఇక ముందు ముందు ఎలాంటి విప‌రీత‌మైన ప‌రిణామాలు ఏర్ప‌డ‌కుండా ఉండాల‌ని మ‌నం కోరుకుందాం..!

Read more RELATED
Recommended to you

Exit mobile version