కరోనా మహమ్మారి ప్రపంచ వ్యాప్తంగా విజృంభిస్తోంది. అమెరికా కరోనా కేసుల సంఖ్యలో ప్రస్తుతం మొదటి స్థానంలో కొనసాగుతోంది. అలాగే ఆ దేశం కరోనా మరణాల జాబితాలోనూ అగ్రస్థానంలో ఉంది. అమెరికాలో ఇప్పటి వరకు 5.32 లక్షల మందికి పైగా కరోనా సోకగా, 20వేల మందికి పైగా మృతి చెందారు. దీంతో ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. కరోనాను అతి పెద్ద విపత్తు (మేజర్ డిజాస్టర్)గా ప్రకటించారు. ఈ మేరకు ఆయన ఆ దేశ ప్రభుత్వం చేసిన డిక్లరేషన్‌ను ధ్రువీకరించారు.
కాగా అమెరికా తన దేశ చరిత్రలోనే తొలిసారిగా కరోనాను అతి పెద్ద, ప్రధానమైన విపత్తుగా ప్రకటించింది. అంతకు ముందెన్నడూ ఇలాంటి విపత్కర పరిస్థితి అమెరికాకు రాలేదు. ఈ క్రమంలో ట్రంప్ ప్రకటనతో అక్కడి రాష్ట్రాలన్నింటికీ ఫెడరల్ సహాయం అందుతుంది. దాంతో కరోనా నుంచి రికవరీ అయ్యేందుకు రాష్ట్రాలకు కావల్సిన సహాయ సహకారాలు అమెరికా ప్రభుత్వం నుంచి లభిస్తాయి.
ఇక భారత్ ముందే ఇచ్చిన మాట ప్రకారం అమెరికాకు కావల్సిన హైడ్రాక్సీ క్లోరోక్విన్ మందులను ఈ వారంలో సరఫరా చేయనుంది. ఇప్పటికే యూకేకు భారత్ ఆ మందులను సరఫరా చేసింది. ఆ జాబితాలో ఎదురు చూస్తున్న పలు ఇతర దేశాలకు కూడా భారత్ ఆ మందులను రవాణా చేయనుంది.