దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తున్న నేపథ్యంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆ వైరస్‌ను ఎదుర్కొనేందుకు అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటున్నాయి. ఇక నిత్యావసర వస్తువుల తయారీ సంస్థలు కూడా కరోనాపై పోరులో భాగస్వామ్యం అయ్యాయి. ఈ క్రమంలోనే ప్రముఖ ఎఫ్ఎంసీజీ సంస్థ హిందూస్థాన్ యూనిలివర్ లిమిటెడ్ కరోనాను ఎదుర్కొనేందుకు రూ.100 కోట్ల సాయం అందించేందుకు ముందుకు వచ్చింది. అలాగే ఆ కంపెనీకి చెందిన శానిటైజర్లు, హ్యాండ్ వాష్‌లు, ఫ్లోర్ క్లీనర్ల ధరలను తగ్గిస్తున్నట్లు తెలిపింది.
హిందుస్థాన్ యూనిలివర్ లిమిటెడ్ లైఫ్ బాయ్ హ్యాండ్ శానిటైజర్లు, హ్యాండ్ వాష్‌లు, డొమెక్స్ ఫ్లోర్ క్లీనర్ల ధరలను 15 శాతం వరకు తగ్గిస్తున్నట్లు తెలిపింది. ఇక వీటిని మరింత ఎక్కువగా ఉత్పత్తి చేయనున్నట్లు ఆ సంస్థ వెల్లడించింది. ఈ క్రమంలో ప్రస్తుతం మార్కెట్‌లో హ్యాండ్ శానిటైజర్లకు విపరీతమైన డిమాండ్ ఉన్న నేపథ్యంలో త్వరలోనే హెచ్‌యూఎల్ ఉత్పత్తులు మార్కెట్‌లోకి రానున్నాయి. ఇక దేశవ్యాప్తంగా అవసరం ఉన్న చోటల్లా 2 కోట్ల లైఫ్ బాయ్ సబ్బులను ఉచితంగా పంపిణీ చేస్తామని ఆ సంస్థ తెలిపింది. దీనికి గాను రాష్ట్ర ప్రభుత్వాలతో కలిసి పనిచేస్తామని ఆ సంస్థ సీఎండీ సంజీవ్ మెహతా ప్రకటించారు.
ఇక మరోవైపు పతంజలి, గోద్రెజ్ తదితర సంస్థలు కూడా తమ సబ్బుల ధరలను 12.5 శాతం వరకు తగ్గిస్తున్నట్లు తెలిపాయి. అలాగే సబ్బుల తయారీకి అవసరం అయ్యే ముడిసరుకుల ధరలు పెరిగినా సబ్బుల ధరలను మాత్రం తగ్గిస్తున్నట్లు ఆ సంస్థలు వెల్లడించాయి.