ఏప్రిల్ 20.. మే 3.. తేదీ ఏదైనా అది పూర్తిగా లాక్ డౌన్ ఎత్తేయడానికో,..పరిస్థితులు సద్దుమణగడానికో ఫైనల్ డేట్ అని చెప్పలేని పరిస్థితి! గతనాలుగు రోజులుగా దేశవ్యాప్తంగా మరి ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలతోపాటు మహారాష్ట్ర, తమిళనాడుల్లో పెరుగుతున్న కేసుల సంఖ్యల వల్ల ఈ క్లారిటీ అప్పుడే వచ్చే చాన్స్లు కనిపించడం లేదు! ఈ క్రమంలో గత కొన్ని రోజులుగా
హల్ చల్ చేస్తున్న “సరి – బేసి” విధానం గురించి కాస్త క్లారిటీ తెచ్చుకునే ప్రయత్నం చేద్దాం!
ప్రస్తుతం దేశంలో నెలకొన్నన కరోనా పరిస్థితుల నేపథ్యంలో మే 3 వరకు లాక్ డౌన్ ను పొడగిస్తునట్టు మోడీ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో దేశంలోని చాలా రాష్ట్రాల్లో.. రాష్ట్రాల్లోని చాలా జిల్లాల్లో.. ఆ జిల్లాల్లోని చాలా మండలాల్లో కరోనా కేసుల వ్యత్యాసం చాలా ఎక్కువగా ఉంది.కొన్ని ప్రాంతాల్లో విపరీతంగా కేసులు నమోదవుతుంటే.. అదే రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో, అదే జిల్లాలోని కొన్ని మండలాల్లో అసలు ఒక్క కేసు కూడా నమోదు కాని పరిస్థితి. ఈ సమయంలో మే 3 వరకూ లాక్ డౌన్ కొనసాగించినా…
కేంద్రం ఎంచిన జోన్ ల ప్రాతిపదికన కరోనా కేసులు లేని జిల్లాల్లో సరి – బేసి విదానాన్ని అమలు చేయబడే అవకాశాలున్నాయి.
ఈ విధానం ప్రకారం సరి సంఖ్య నెంబర్ ప్లేట్లు కలిగిన వాహనాలు సరి రోజుల్లో.. బేసి సంఖ్య నెంబర్ ప్లేట్లు కలిగిన వాహనాలు బేసి రోజుల్లో రోడ్డు మీదకి రావచ్చు. అయితే ఈ సరి బేసి విధానాన్ని ఏయే జిల్లాల్లో అమలు చేయాలి అనే విషయంలో అన్ని రాష్ట్రాలూ… కేంద్ర ప్రభుత్వ అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది.
ఈ సరి బేసి లాంటి విధానానికి కలర్ కోడింగ్ పథకాన్ని తమిళనాడులో ఇప్పటికే అమలు చేశారు! ఈ కలర్ కోడింగ్ విధానంలో ప్రతి వాహనానికి ఒక కలర్ వేస్తారు. ఆ వాహనం కలర్ ను బట్టి ఆ వాహనానికి కేటాయించిన రోజున మాత్రమే బయటకు రావడానికి అవకాశం ఉంటుంది. అలా కాని పక్షంలో ఆ వాహనం సీజ్ చేయబడటంతోపాటు.. సదరు వాహనదారుడిపై కఠిన చర్యలు తీసుకునే అవకాశం ఉంది! ఈ లెక్కన చూసుకుంటే…ఇంక రెండు రోజులు ఆగితే..అన్నీ అనుకున్నట్లు జరిగితే… మీ ప్రాంతం లో కరోనా కేసులు ఏమీ లేకపోతే… మీ నెంబరు సరో, బేసో చూసుకుని రోడ్డెక్కవచ్చన్నమాట!!