కరోనా వైరస్ వ్యాప్తిని అడ్డుకునేందుకు భారత అత్యున్నత స్థానం సోమవారం కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే ప్రత్యేక కేసులను మాత్రమే ప్రస్తుతం విచారిస్తామని తెలిపిన కోర్టు ఇకపై వర్చువల్ కోర్టులు ప్రవేశపెడుతున్నట్లు తెలిపింది. ఈ క్రమంలో వీడియో కాన్ఫరెన్స్‌ల ద్వారా కేసుల విచారణ జరుగుతుందని కోర్టు తెలిపింది. కోర్టుల పరిధిలో కరోనా వ్యాప్తిని అడ్డుకునేందుకు ఈ నిర్ణయం తీసుకున్నామని సుప్రీం కోర్టు జస్టిస్ డీవై చంద్రచూడ్ వెల్లడించారు.
సుప్రీం కోర్టు నిర్ణయం ప్రకారం త్వరలోనే వర్చువల్ కోర్టులు ప్రారంభం కానుండగా, కేసుల విచారణ ఆ కోర్టుల్లో జరగనుంది. ప్రస్తుతం ట్రయల్ కోర్టుల్లో పరిస్థితులు సమస్యాత్మకంగా ఉన్నాయని, అందుకు గాను కేసుల విచారణ విషయంపై అన్ని హైకోర్టులతో చీఫ్ జస్టిస్ ఎస్ఏ బాబ్డే సంప్రదిస్తున్నారని చంద్రచూడ్ తెలిపారు. ఇక కరోనా వైరస్ నియంత్రణ విషయమై వర్చువల్ కోర్టులు ప్రారంభమైతే ఫైల్స్‌ను డిజిటలైజ్ చేయడం జరుగుతుందని, ఇప్పటికే కోర్టులలో స్క్రీనింగ్‌ను ప్రారంభించామని చంద్రచూడ్ తెలిపారు.
కాగా మన దేశంలో ఇప్పటికే 110 మందికి పైగా కరోనా బారిన పడగా అనేక వేల మంది క్వారంటైన్‌లో ఉన్నారు. ఇక కరోనా అనుమానితులకు రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లోనూ ఎప్పటికప్పుడు పరీక్షలు నిర్వహిస్తూ పరిస్థితిని సమీక్షిస్తున్నారు.