కరోనా కు సంబంధించి బ్రెజిలియన్ వేరియంట్ కనీసం ఒక కేసును, దక్షిణాఫ్రికా వేరియంట్‌కు సంబంధించి నాలుగు కేసులు భారత్ లో నమోదు అయ్యాయి అని ఇండియన్ సెంటర్ ఫర్ మెడికల్ రీసెర్చ్ డైరెక్టర్ జనరల్ డాక్టర్ బలరామ్ భార్గవ మంగళవారం మీడియాతో పంచుకున్నారు. డాక్టర్ భార్గవ మాట్లాడుతూ… కరోనా సోకిన వారిని క్వారంటైన్ చేసామని వారి బంధువులను కూడా క్వారంటైన్ చేసామని వెల్లడించారు.
దక్షిణాఫ్రికా వేరియంట్ కు సంబంధించి తాము మూలాలు కనుక్కునే ప్రయత్నాలు చేస్తున్నామని బ్రెజిల్ వేరియంట్ కి సంబంధించి కూడా తాము పరిశోధనలు చేస్తున్నామని అన్నారు. యుకె వేరియంట్ బారిన పడిన 187 మంది రోగులు భారతదేశంలో ఉన్నారని ఐసిఎంఆర్ చీఫ్ తెలిపారు. యుకె వేరియంట్ సోకిన వారిలో మరణాలు ఏవీ లేవు అని ఆయన వెల్లడించారు. అందరిని ఐసోలేట్ చేసామని వివరించారు.
వారి పరిచయాలు వేరుచేసి పరిక్షించామని చెప్పారు. యుకె వేరియంట్ కి సంబంధించి ప్రస్తుతం ఉన్న టీకా పని చేస్తుందని తెలిపారు. టీకా ప్రభావాన్ని అంచనా వేయడానికి ప్రయోగాలు జరుగుతున్నాయని, అవి యుకె వేరియంట్‌కు భిన్నంగా ఉన్నాయని ఐసిఎంఆర్ చీఫ్ తెలిపారు. దక్షిణాఫ్రికా వేరియంట్ ఇప్పటికే 44 దేశాలకు వ్యాపించిందని డాక్టర్ భార్గవ తన ప్రకటనలో పేర్కొన్నారు. దక్షిణాఫ్రికా వేరియంట్ సోకిన నలుగురు వ్యక్తులు అంగోలియా (1), టాంజానియా (1) మరియు దక్షిణాఫ్రికా (2) నుండి వచ్చారు.