కరోనాపై యుద్ధం చేసేందుకు దేశవ్యాప్తంగా ఉన్న దాతలు ముందుకు వస్తున్నారు. మహీంద్రా గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహీంద్రా ఇప్పటికే తన వేతనాన్ని విరాళంగా ప్రకటించగా.. మహీంద్రా హాలీడేస్ పేరిట ఉన్న రిసార్టులు, హోటల్స్‌ను కరోనా చికిత్స కోసం కేటాయిస్తామని తెలిపి ఉదారతను చాటుకున్నారు. ఇక వేదాంత గ్రూప్స్ చైర్మన్ అనిల్ అగర్వాల్ కూడా అదే కోవలో తన దాతృత్వాన్ని చాటుకున్నారు. కరోనాపై యుద్ధం చేసేందుకు తన వంతుగా ఆయన భారీ సహాయాన్ని ప్రకటించారు.
వేదాంత గ్రూప్స్ చైర్మన్ అనిల్ అగర్వాల్.. కరోనాపై పోరాటం చేసేందుకు భారీ సహాయాన్ని అందిస్తున్నట్లు ప్రకటించారు. రూ.100 కోట్ల విరాళాన్ని అందిస్తున్నట్లు ఆయన తెలిపారు. దేశానికి అత్యవసరం అయినప్పుడు తాను అందించే నిధి ఉపయోగపడుతుందని ఆయన అన్నారు. కరోనా వైరస్ విజృంభిస్తున్న సమయంలో రోజు వారీ కూలీలకు ఆర్థిక సమస్యలు ఎదురవుతాయని, అందుకనే అలాంటి వారి కోసం ఈ సహాయం అందిస్తున్నానని తెలిపారు.
కరోనా మహమ్మారిని ఎదుర్కోవడానికి రూ.100 కోట్లు ఇస్తున్నానని, చాలా మంది ప్రజలు ప్రస్తుతం ఆందోళనలో ఉన్నారని, కూలీలు చాలా ఇబ్బందులు పడుతున్నారని, వారికి సహాయం చేసేందుకే ఈ విరాళం అందిస్తున్నానని తెలిపారు.