ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్‌కు మెడిసిన్‌ను కనిపెట్టేందుకు ఫార్మా కంపెనీలు పోటీ పడుతున్నాయి. సైంటిస్టులు ఇందుకుగాను అహోరాత్రులు కష్టపడి పనిచేస్తున్నారు. కొంత వరకు కొందరు సైంటిస్టులు ఈ విషయంలో సక్సెస్ సాధించారు కూడా. కానీ మెడిసిన్ మాత్రం ఇప్పుడప్పుడే వచ్చే అవకాశం లేదని స్పష్టంగా తెలుస్తోంది. అయినప్పటికీ సోషల్ మీడియాలో మాత్రం కొందరు పనిగట్టుకుని కోవిడ్ 19కు మెడిసిన్ వచ్చిందంటూ ప్రచారం చేస్తున్నారు.
టాంజానియాకు చెందిన Covidol అనబడే ఓ మెడిసిన్ కరోనాను నయం చేస్తుందని ప్రస్తుతం సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు ప్రచారమవుతున్నాయి. అక్కడి ప్రెసిడెంట్ జాన్ మగుఫులి, ఆరోగ్య శాఖ మంత్రి ఉమ్మీ ఆల్లీ వాలిములతో కలిసి ఆ మెడిసిన్‌కు సంబంధించిన ఫొటోను జత చేసి కొందరు వాటిని సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. అయితే నిజంగానే ఈ మెడిసిన్ కరోనాను నయం చేస్తుందా ? అంటే.. అది పూర్తిగా అబద్ధమని తేలింది.
కోవిడోల్ అనబడే మెడిసిన్‌ను టాంజానియాలో తయారుచేసిన మాట వాస్తవమే కానీ.. దాంతో ఇంకా క్లినికల్ ట్రయల్స్ చేపట్టలేదు. అందువల్ల ఆ మెడిసిన్ కోవిడ్ 19పై విజయవంతంగా పనిచేస్తుందా, లేదా అనేది ఇంకా నిర్దారణ కాలేదు. కనుక కోవిడ్ 19ను ఆ మెడిసిన్ నయం చేస్తుందని వచ్చే వార్తల్లో ఎంతమాత్రం నిజం లేదు. కాబట్టి జనాలు ఎవరూ ఇలాంటి వార్తలను నమ్మకండి. సోషల్ మీడియాలో వచ్చే వార్తలను నమ్మే ముందు ఒకటికి రెండు సార్లు అవి నిజమా, కాదా అనేది నిర్దారించుకోండి.