ఎడిట్ నోట్ : కన్నీళ్ల‌కే క‌న్నీళ్లొచ్చే క‌ష్టాల‌కే క‌ష్టాలొచ్చే

-

కన్నీరెందుకు క‌ష్టాలెందుకు
ప‌దవులు లేవ‌ని
పొర్లు పొర్లు దండాలెందుకు
అని చెప్పాలి వైసీపీని ఉద్దేశించి.. ఎందుకంటే అధికారం ఉన్నన్నాళ్లూ నోటికి వ‌చ్చిన విధంగా తిట్టారు మంత్రులు. విప‌క్ష నేత‌ల‌ను ముందూ వెనుకా చూడ‌కుండా దుర్భాష లాడారు. ఇదంతా ముఖ్య‌మంత్రి త‌మ‌కు అండ‌గా నిలుస్తారు అన్న ఒకే ఒక్క కార‌ణంతోనే చేశారు. కానీ ఇప్పుడు తెలుగు దేశం పార్టీ నాయ‌కురాలు కావ‌లి గ్రీష్మ చెబుతున్న విధంగా వారినంద‌రినీ వాడుకుని వ‌దిలేశారు. ఇదీ ఇప్పుడు టీడీపీ ప్ర‌ధానంగా విశ్లేషిస్తున్న వివ‌రం. మంత్రులంద‌రినీ అవ‌సరం మేర‌కు వినియోగించుకుని ఇప్పుడు ప‌క్క‌న‌బెట్టార‌ని, కొత్త మంత్రుల‌తో కూడా  ఇదే విధంగా విప‌క్షాల‌ను తిట్టిపోయించ‌ర‌ని ఏంటి గ్యారంటీ అని ప‌సుపు పార్టీ పెద్ద‌లు ప్ర‌శ్నిస్తున్నారు.ఇక వెళ్లిన మంత్రులంతా వెక్కి వెక్కి ఏడుస్తున్నారు. అది ఇంకా విచిత్రం.

వీర విధేయులుగా ఉన్న వారికీ ఉద్వాస‌న త‌ప్ప‌ద‌ని ముఖ్య‌మంత్రి ఎటువంటి మొహ‌మాటాల‌కూ తావు లేకుండా చెప్ప‌డంతో  సీనియ‌ర్లంతా ఇప్ప‌టికే ప‌లు సార్లు ర‌హ‌స్య స‌మావేశాలు ఏర్పాటు చేశార‌ని కూడా వార్త‌లు వెలుగు చూస్తున్నాయి. కొంత మంది క్యాంపు రాజ‌కీయాలు నెర‌పాల‌ని కూడా చూస్తున్నారు..అన్న వార్త‌లూ ప్ర‌ధానంగా వినిపిస్తున్నాయి. బెంగ‌ళూరు, చెన్న‌య్, ఢిల్లీ లాంటి  న‌గ‌రాల్లో కొంద‌రు ప‌ర్య‌టించేందుకు ప్లాన్ వేస్తున్నార‌ని, వేస‌వి విడిది అనంత‌ర‌మే సీఎంతో తాడో పేడో తేల్చుకుంటామ‌ని తాజా మాజీలు స్ప‌ష్టం చేస్తున్నారు.

ఆంధ్రావ‌నిలో మంత్రివ‌ర్గం మార్పులూ చేర్పులూ అన్న‌వి త్వ‌ర‌లోనే జ‌ర‌గ‌నున్నాయి. ఈ మేర‌కు ముఖ్య‌మంత్రి జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి స‌రైన స‌మ‌యంలో స‌రైన నిర్ణ‌యం అన్న విధంగా త‌న ఆలోచ‌న‌ల‌కు తుది  రూపు ఇస్తున్నారు. ఇప్ప‌టికే మంత్రి వ‌ర్గ మార్పుల‌పై ఓ స్ప‌ష్ట‌త‌కు వ‌చ్చార‌ని తెలుస్తోంది. తుది జాబితా రూప‌క‌ల్ప‌న‌లో ఉన్నార‌ని కూడా స‌మాచారం. కొత్త మంత్రుల రాక ఈ నెల 11న షురూ కానుంది. జ‌గ‌న్ 2.0 వెర్ష‌న్ గా పేర్కొంటున్న ఈ మంత్రివ‌ర్గంలో న‌లుగురు నుంచి ఐదుగురు వ‌ర‌కూ పాత వారే కొన‌సాగే ఛాన్స్ ఉంది. ఇక మంత్రి వ‌ర్గం నుంచి తాజాగా త‌ప్పుకుని రాజీనామా ప‌త్రాలు అందించిన వారంతా తీవ్ర భావోద్వేగంలో ఉన్నారు.

కొంద‌రు కన్నీళ్లు పెట్టారు. కొంద‌రు మ‌రింత తీవ్ర ఆవేద‌న కు గురి అయి డిప్రెష‌న్ లోకి వెళ్లిపోయారు. ఎందుకు ఇదంతా ఆ రోజు ఆయ‌న మంత్రి ప‌ద‌వులు ఇచ్చేట‌ప్పుడే చెప్పారు క‌దా! రెండున్న‌రేళ్లే ప‌ద‌వి అని! అయినా స‌రే మార్పు ఒకందుకు మంచిదే క‌దా అని ఇంకొందరు వైసీపీ నేత‌లు వ్యాఖ్యానిస్తున్నార‌ని ప్ర‌ధాన మీడియా చెబుతోంది. ఈ ద‌శ‌లో  వైసీపీ అధిష్టానంకు కొత్త త‌ల‌నొప్పులు ప‌ట్టుకున్నాయి. పాత మంత్రులు వెళ్లి పార్టీ కోసం ప‌నిచేయాల‌ని, కొత్త మంత్రులు వ‌చ్చి ప్ర‌భుత్వం కోసం ప‌నిచేయాల‌ని జ‌గ‌న్ చెబుతుండ‌డంతో ఇదివ‌ర‌క‌టి హవా స‌చివాల‌యంలో చెల్ల‌ద‌ని అంత‌ర్మ‌థ‌నం చెందుతున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version