మనం పొదుపుగా వాడాల్సినవి ఏమో.. వృథా చేస్తుంటాం.. అసలు వాడొద్దు అనేవి మాత్రం పొదుపుగా వాడుతుంటాం.. ప్లాస్టిక్ కవర్లు వాడొద్దు మొర్రో అని ప్రభుత్వాలు మొత్తుకుంటుంటే.. అవి మాత్రం జాగ్రత్తగా.. దాచుకుని.. ఇంట్లో పనులకు ఉపయోగిస్తుంటారు.. సేవ్ వాటర్ సేవ్ లైఫ్ అంటుంటే.. వాటర్ ను మాత్రం ఇష్టం వచ్చినట్లు వృథా చేస్తారు కొందరు. ఇంట్లో పనులు చేసుకునేప్పుడు ఎంతో నీరు వేస్ట్ అవుతుంది. కనీసం మనం నీరు వృథా అవుతుంది అని కూడా గమనించం. ఇలా వాటర్ ను వేస్ట్ చేయడం వల్ల భవిష్యత్త్ తరాల గతి ఏంటి? ఇదే ప్రశ్న దిల్లీకి చెందిన స్మితా సింఘాల్‌ను బాగా కలిచేవేసింది. అందుకే నీటి కరువుకు ఇక్కడే చెక్ పెట్టాలని నిర్ణయించుకుందామె. దాని ఫలితమే ‘Absolute Water Private Limited’. మురుగు నీటిని మంచినీరుగా మార్చే తన స్టార్టప్‌తో ప్రతి నీటి బొట్టునూ ఆదా చేస్తోన్న ఈ వాటర్ వారియర్ సక్సెస్ స్టోరీ ఈరోజు మీకోసం..!
దిల్లీ యూనివర్సిటీ నుంచి ‘కామర్స్, బిజినెస్ స్టడీస్’లో డిగ్రీ పూర్తి చేసిన స్మిత.. పలు కంపెనీల్లో పని చేసింది. స్మితకు పర్యావరణం మీద ప్రేమ ఎక్కువ. ఇందులో భాగంగానే చుట్టూ జరిగే విషయాల గురించి ఎక్కువ శ్రద్ధ పెట్టేదామె. ఇలా ఓ సందర్భంలో దేశంలోని నీటి ఎద్దడి గురించి తెలుసుకున్న ఆమె.. ఎలాగైనా ఈ సమస్యకు చెక్ పెట్టాలని ఫిక్స్ అయింది. ఇదే ఆలోచనను కెమికల్ ఇంజినీర్‌గా పనిచేసిన అనుభవం ఉన్న తన తండ్రి ముందుంచింది. ఆయన ప్రోత్సహించడంతో 2019లో ‘Absolute Water Private Limited’ అనే సంస్థను నెలకొల్పింది స్మిత.
ప్రపంచ ఆరోగ్య సంస్థ నాణ్యతా ప్రమాణాల ప్రకారం మురుగు నీటిని వివిధ పద్ధతుల ద్వారా శుద్ధి చేసి మంచి నీటిగా మార్చడమే ఈ సంస్థ లక్ష్యం. దేశంలోనే వంద శాతం సహజసిద్ధంగా నీటిని శుద్ధి చేసే తొలి వ్యవస్థగా ఈ సంస్థ పేరు పొందింది. ఇందులో భాగంగా గృహావసరాలు, నిత్యావసరాలు, మురుగునీరు, పరిశ్రమల నుంచి వెలువడే వ్యర్థ జలాలు, కొన్ని రకాల మెషీన్లను చల్లబరచడానికి వినియోగించిన నీరు.. ఇలా వ్యర్థం అంటూ వృథాగా వదిలేసే నీటిని సేకరించి.. శుద్ధ జలంగా మార్చి తిరిగి నిత్యావసరాల కోసం అందుబాటులో ఉంచుతోంది ఈ సంస్థ.
సోలార్ పవర్ తో..
మురుగునీటిని శుద్ధి చేయడానికి సౌరశక్తితో పనిచేసే పవర్ ప్లాంట్‌లను వీళ్లు ఉపయోగిస్తారు. ఇందుకోసం అతి తక్కువ విద్యుత్ అవసరమవుతుందని చెబుతోంది స్మిత.. నీటిని శుద్ధి చేసేందుకు ఎలాంటి రసాయనాలూ ఉపయోగించరట. ఇలా శుద్ధి చేసిన నీటిని నిత్యావసరాలు, తాగడానికి ఉపయోగించుకోవచ్చు. అయితే మొదట్లో చాలామంది రీసైకిల్ చేసిన ఈ నీటిని వినియోగించుకోవడానికి ఇష్టపడకపోయేవారు. కానీ వారికి ప్రస్తుత నీటి సమస్యల్ని వివరించి, నీటిని శుద్ధి చేసే ప్రక్రియ గురించి వివరించాక చాలామందిలో మార్పొచ్చిందని స్మిత అంటోంది.
రోజుకు లక్ష లీటర్ల నీరు శుద్ది..
తమ వద్ద రీసైకిల్ చేసిన నీటిని నిత్యావసరాలకే కాదు.. యూపీలోని మెడికల్ కాలేజీలు, హాస్టళ్లలో లాండ్రీ కోసం.. దిల్లీ యూనివర్సిటీలో మొక్కల పెంపకానికి.. ఇలా పలు రకాలుగా ఉపయోగిస్తున్నారట.. ఈ పద్ధతిలో రోజుకు లక్ష లీటర్ల నీటిని శుద్ధి చేస్తున్నట్లు స్మిత తెలిపింది.. దీంతో పాటు త్వరలోనే ‘మొబైల్ వాటర్ రికవరీ సిస్టమ్’ను అందుబాటులోకి తేవాలనేది ఆమె ఆశయమట.. అలాగే పరిశుభ్రమైన నీటిని కరువుతో అల్లాడుతోన్న ప్రాంతాలకు చేరువ చేయాలనుకుంటున్నట్లు స్మిత పేర్కొంది.. ప్రతి ఇంట్లో వృథా నీటిని ఎవరికి వారుగా శుద్ధి చేసుకునే రోజు వచ్చే దాకా తన ఈ ప్రయత్నం కొనసాగుతూనే ఉంటుందంటోంది.. మన స్మిత.
స్మిత మంచి ఆశయంతో ముందుకు వెళ్తుంది. మనం కూడా.. మన వంతు సాయం చేయాలంటే.. ఈరోజు నుంచే నీటిని వృథాగా వాడటం తగ్గించాలి. బ్రష్ చేస్తున్నంత సేపూ.. టాప్ ఎందుకు ఆన్ చేస్తారో..? గిన్నెలు వాష్ చేసేంతసేపు టాప్ తిప్పే ఉంటుంది. ఇలా మనం మనకు తెలియకుండా.. కొన్ని అలవాట్లు చేసుుకున్నాం.. వీటి గురించి చెప్పాలంటే.. చాలా ఉంది. మీకు మీరే.. ఎక్కడెక్కడ నీరు వృథా చేస్తున్నా అని ప్రశ్నించుకుని.. తగ్గించేందకు ట్రై చేసేయండి బాస్..!
-Triveni Buskarowthu