ఉగాది రోజున పంచాంగ శ్ర‌వ‌ణం ఎందుకు చేయాలి..?

-

ఉగాది పండుగ రోజున తెలుగు ప్ర‌జలంద‌రూ ఉగాది ప‌చ్చ‌డిని క‌చ్చితంగా తింటారు. అయితే ఆ రోజున ప‌చ్చ‌డి తిన‌డం ఎంత ముఖ్య‌మో.. సాయంత్రం పంచాంగం శ్ర‌వ‌ణం చేయ‌డం కూడా అంతే ముఖ్యం. పంచాంగ శ్ర‌వ‌ణం చేయ‌డం వ‌ల్ల ఎన్నో ఉప‌యోగాలు ఉంటాయని పండితులు చెబుతున్నారు. మ‌రి ఉగాది రోజున పంచాంగాన్ని ఎందుకు వినాలో ఇప్పుడు తెలుసుకుందామా..!

 

పంచాంగంలో సాధార‌ణంగా తిథి, వారం, న‌క్ష‌త్రం, యోగం, క‌ర‌ణ‌ముల‌నే 5 భాగాలు ఉంటాయి. అందుక‌నే దానికి పంచాంగం అని పేరు వ‌చ్చింది. ఇక ఆయా అంశాల ఆధారంగా ఒక వ్య‌క్తి లేదా ఒక ప్రాంతం భ‌విష్య‌త్తు ఎలా ఉంటుంది.. అని అంచ‌నా వేయ‌వ‌చ్చు. అందుక‌నే ఆ విశేషాల‌ను తెలుసుకునేందుకు పంచాంగ శ్ర‌వ‌ణం ఏర్పాటు చేస్తారు. పంచాంగం అంటే 5 భాగాలు అని తెలుసుకున్నాం క‌దా.. శ్ర‌వ‌ణం అంటే విన‌డం.. అంటే పంచాంగం విన‌డం అన్న‌మాట‌. పంచాంగం విన‌డం వ‌ల్ల ఒక వ్య‌క్తి లేదా ఒక ప్రాంత ప్ర‌జ‌లు త‌మ‌కు వ‌చ్చే సంవ‌త్స‌రం పొడ‌వునా భ‌విష్య‌త్తు ఎలా ఉంటుందో తెలుసుకుని, ఒక వేళ న‌ష్టం వ‌చ్చే సూచ‌న‌లు ఉంటే అందుకు త‌గిన విధంగా జాగ్ర‌త్త‌లు తీసుకునేందుకు అవ‌కాశం ఉంటుంది. అందుకనే ఉగాది రోజున ప్ర‌తి ఒక్క‌రూ క‌చ్చితంగా పంచాంగాన్ని వినాల‌ని చెబుతుంటారు.

ఇక ఒక వ్య‌క్తికి సంబంధించి అత‌ని న‌క్ష‌త్రం ప్ర‌కారం రాశిఫ‌లం నిర్ణ‌యించి అత‌నికి ఆ సంవ‌త్స‌రంలో ఆదాయం ఎంత వ‌స్తుంది, వ్య‌యం ఎంత అయ్యేందుకు అవ‌కాశం ఉంటుంది, రాజ‌పూజ్యం, అవ‌మానాలు ఏమైనా ఉంటాయా.. అని పంచాంగంలో తెలుసుకోవ‌చ్చు. అదే ఒక ప్రాంత‌మైతే ఆ ప్రాంతంలో ఆ సంవ‌త్స‌రంలో వ‌ర్ష‌పాతం ఎలా ఉంటుంది, ఏమైనా ఉత్పాతాలు సంభ‌విస్తాయా, ప్ర‌జ‌లు ఆ ప్రాంతంలో ఉండ‌వ‌చ్చా, వ్య‌వ‌సాయం చేయ‌వ‌చ్చా, చేస్తే ఏయే పంట‌ల‌కు ఆ ప్రాంత నేల‌లు అనుకూలంగా ఉంటాయి ? త‌దిత‌ర వివ‌రాల‌ను తెలుసుకుని.. అందుకు అనుగుణంగా ప్ర‌జ‌లు వ్య‌వ‌హ‌రించేందుకు అవ‌కాశం ఉంటుంది. దీంతో ప్ర‌జ‌లు త‌మ‌కు క‌ల‌గ‌బోయే న‌ష్టాల‌పై ముందుగానే ఓ అంచ‌నాకు వ‌చ్చి అందుకు సిద్ధంగా ఉండ‌డ‌మో లేదా ప్ర‌త్యామ్నాయ మార్గాల‌ను ఆలోచించి ఆ న‌ష్టాల నుంచి త‌ప్పించుకోవ‌డ‌మో.. చేసేందుకు అవ‌కాశం ఉంటుంది. అందుక‌నే ఉగాది రోజున ప్ర‌తి ఒక్క‌రూ పంచాంగం వినాల‌ని పెద్ద‌లు చెబుతుంటారు.

ఇక ప్ర‌స్తుతం పంచాంగ శ్ర‌వ‌ణం అనేది కేవ‌లం కొంద‌రికి మాత్ర‌మే ప‌రిమిత‌మైన రాచ‌కార్యం అయ్యింది కానీ.. ఒక‌ప్పుడు పంచాంగ శ్ర‌వ‌ణానికి ఊరు మొత్తం క‌దిలి వ‌చ్చేది. అంద‌రూ ఒక చోట క‌లుసుకునేవారు. క‌ష్ట‌సుఖాలు చెప్పుకునేవారు. ఆ సంవ‌త్స‌రం పొడ‌వునా త‌మ‌కు న‌ష్టాలు క‌లిగించే అంశాలు ఏమైనా ఉంటే వాటి నుంచి ఎలా త‌ప్పించుకోవాలా.. అని అంద‌రూ చ‌ర్చించుకునేవారు. ఇక పెళ్లిళ్లు, ఇత‌ర శుభ‌కార్యాలు చేసేందుకు ఆ సంవ‌త్స‌రంలో ఎప్పుడు ముహుర్తాలు ఉన్నాయి, వ్ర‌తాలు ఎలా చేసుకోవాలి, నోములు ఎప్పుడు జ‌రుపుకోవాలి ? వ‌ంటి అనేక ధ‌ర్మ సందేహాలను పండితుల‌ను అడిగి తీర్చుకునేవారు. కానీ ఇప్పుడ‌లా లేదు. అయిన‌ప్ప‌టికీ ఉగాది రోజున తెలుగు ప్ర‌జలంద‌రూ పంచాంగాన్ని వినాల్సిన ఆవ‌శ్య‌క‌త ఎంతైనా ఉంది..!

Read more RELATED
Recommended to you

Exit mobile version