సమగ్ర కులగణన చేసిన ఎన్యుమరేటర్లు ధర్నా చేశారు. దాదాపు 3 నెలలుగా తమకు ఇవ్వాల్సిన వేతనాలు ఇవ్వడం లేదని, రేవంత్ రెడ్డి తమను ఆదుకోవాలని.. కుత్బుల్లాపూర్ సర్కిల్ కార్యాలయం ముందు ఎన్యుమరేటర్లు ఆందోళన చేశారు. గత ఏడాది నవంబర్ లో తెలంగాణ ప్రభుత్వం నిర్వహించిన సమగ్ర కుటుంబ సర్వేలో ఎందరో నిరుద్యోగులు కష్టపడి నెల రోజుల్లో సర్వే పూర్తి కావడానికి కృషి చేశారు. కానీ తమకు ఇస్తామన్న గౌరవ వేతనం ఇవ్వకుండా అధికారులు 3 నెలలుగా తిప్పించుకుంటున్నారని మండిపడ్డారు.

కుత్బుల్లాపూర్ 25 సర్కిల్ మున్సిపల్ డిప్యూటి కమిషనర్ ను ఎన్ని సార్లు అడిగినా స్పందించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. తమకు ఇచ్చే వేతనం ప్రభుత్వం మంజూరు చేసినట్లుగా జీవో విడుదల చేసినా కూడా తమకు మాత్రం ఆ వేతనం అందలేదని తెలిపారు. ఇప్పటికైనా GHMC పరిధిలో ఉన్న అన్ని సర్కిల్ కార్యాలయాల్లోని ఎన్యుమరేటర్లకు వెంటనే వారి వేతనాలు అందజేయాలని వేడుకుంటున్నారు.