శ్రీ సాయిబాబాకి ఎంతో ప్రీతికరమైన వంటకం పెసరపప్పుతో చేసిన పులగం. ఇదంటే బాబాకి చాలా ఇష్టం. గురుపౌర్ణమి సందర్భంగా అందరూ భక్తితో పులగం రెసిపీ తయారు చేసి బాబాకి నైవేద్యంగా పెడతారు. ఇలా చేస్తే కోరుకున్న కోరికలు తీరుతాయని భక్తుల నమ్మకం. ఈ రెసిపీ తయారీ విధానం కూడా చాలా సులభంగా ఉంటుంది. ఇప్పుడు ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం.
కావాల్సిన పదార్థాలు :
బియ్యం : ఒక కప్పు
పెసరపప్పు : అర కప్పు
అల్లం వెల్లుల్లి పేస్ట్ : ఒక టేబుల్‌స్పూన్
జీలకర్ర : ఒక టేబుల్‌స్పూన్
పచ్చిమిర్చి : 4
జీడిపప్పు : 4
దాల్చినచెక్క : ఒక ఇంచ్
లవంగాలు : 3
నూనె లేదా నెయ్యి : సరిపడా
ఉప్పు : తగినంత
తయారీ :
ముందుగా ఒక గిన్నె తీసుకొని అందులో తీసిపెట్టుకున్న బియ్యం, పెసరపపప్పు వేసి రెండు, మూడు సార్లు నీటితో శుభ్రం చేసుకోవాలి. తర్వాత అందులో మూడు కప్పుల నీరు పోయాలి. ఇప్పుడు దీన్ని కాసేపు పక్కన పెట్టుకోవాలి. ఈ లోపు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకోవాలి. అందులో రెండు స్పూన్స్ నూనె పోసి వేడి చేయాలి. వేడెక్కాక తీసిపెట్టుకున్న లవంగాలు, దాల్చిన చెక్క వేసి వేయించుకోవాలి. ఆ తర్వాత జీడిపప్పు వేసి వేయాలి. ఇవి కూడా వేగిన తర్వాత తరిగిన పచ్చిమిర్చి, ఉల్లిముక్కలు వేసి బాగా వేయించుకోవాలి. పోపంతా వేగిన తర్వాత నానబెట్టుకున్న బియ్యం, పెసరపప్పు మిశ్రమాన్ని ఇందులో వేసి బాగా కలుపుకోవాలి. తర్వాత రుచికి సరిపడా ఉప్పు వేసి కలపాలి. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టి మూడు విజిల్స్ రానివ్వాలి. తర్వాత స్టవ్ కట్టేసుకొని ప్రెజర్ అంతా పోయేంత వరకు ఉంచి మూత తీసి చూస్తే.. ఎంతో టేస్టీగా ఉండే పులగం రెడీ!