నడుము నొప్పి రాగానే చాలామందిలో మొదట కలిగే భయం “కిడ్నీలో ఏమైనా సమస్య ఉందా?” అని. నేటి ఉరుకుల పరుగుల జీవితంలో కూర్చునే పద్ధతి సరిగ్గా లేకపోవడం వల్ల వచ్చే సాధారణ నడుము నొప్పికి, కిడ్నీ సంబంధిత నొప్పికి చాలా తేడా ఉంటుంది. ఈ రెండింటి మధ్య ఉన్న వ్యత్యాసాన్ని ముందే గుర్తిస్తే అనవసరమైన ఆందోళనను తగ్గించుకోవచ్చు. అసలు మీ నడుము నొప్పికి కారణం కండరాలా లేక కిడ్నీలా? ఆ క్లారిటీ కోసం ఇప్పుడే పూర్తిగా చదవండి.
సాధారణ నడుము నొప్పి సాధారణంగా వెన్నెముక దిగువ భాగంలో లేదా నడుము కండరాల దగ్గర వస్తుంది. మనం వంగినప్పుడు, బరువులు ఎత్తినప్పుడు లేదా ఎక్కువ సేపు కూర్చున్నప్పుడు ఈ నొప్పి పెరుగుతుంది. ఇది కేవలం నడుముకే పరిమితం కాకుండా కొన్నిసార్లు కాళ్ల వరకు పాకవచ్చు.
కానీ కిడ్నీ నొప్పి అలా ఉండదు. కిడ్నీలు వెన్నెముకకు రెండు వైపులా, పక్కటెముకల క్రింద ఉంటాయి. కాబట్టి కిడ్నీ సమస్య ఉంటే నొప్పి వెనుక వైపు పక్కటెముకల కింద మొదలై పొత్తికడుపు లేదా తొడలు వైపుకు వ్యాపిస్తుంది. ఈ నొప్పి తీవ్రంగా, తరచుగా వస్తూ పోతూ ఉంటుంది.

కిడ్నీ నొప్పితో పాటు ఇతర లక్షణాలు కూడా కనిపిస్తాయి, ఇది సాధారణ నడుము నొప్పిలో ఉండదు. కిడ్నీలో రాళ్లు లేదా ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు జ్వరం రావడం, మూత్రం పోసేటప్పుడు మంటగా అనిపించడం, మూత్రం రంగు మారడం లేదా వికారం వంటి లక్షణాలు ఉంటాయి.
ఒకవేళ కేవలం నడుము మాత్రమే నొప్పి పుడుతూ, విశ్రాంతి తీసుకుంటే తగ్గుతుంటే అది కండరాల సమస్య అయ్యే అవకాశం ఎక్కువ. అయితే నొప్పి నిరంతరంగా ఉంటూ, మూత్ర విసర్జనలో మార్పులు కనిపిస్తే మాత్రం అది కిడ్నీకి సంబంధించిన హెచ్చరికగా భావించాలి. సరైన సమయంలో ఈ తేడాలను గమనించడం వల్ల చికిత్స సులభమవుతుంది.
గమనిక: ఈ సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. మీకు నొప్పి తీవ్రంగా ఉన్నా లేదా పైన చెప్పిన లక్షణాలు కనిపిస్తున్నా, ఆలస్యం చేయకుండా వెంటనే డాక్టరును సంప్రదించండి.
