కొందరికి కొన్నిసార్లు నవ్వినప్పుడు దగ్గినప్పుడు లేదా ఆకస్మాత్తుగా బరువు ఎత్తినప్పుడు మూత్రం లీక్ అవుతున్నట్లు మీకు అనిపిస్తుందా? ఇది చాలామందిలో కనిపించే ఒక సాధారణ సమస్య అయినప్పటికీ దీని గురించి బహిరంగంగా మాట్లాడటానికి సంకోచిస్తారు. ఈ సమస్యనే ‘యూరినరీ ఇంకంటినెన్స్’ అంటారు. బ్లాడర్ నియంత్రణ బలహీనపడటానికి గల కారణాలు ఏమిటి? ఈ ఇబ్బందికరమైన సమస్యను యోగా ద్వారా ఎలా అధిగమించవచ్చో తెలుసుకుందాం!
బ్లాడర్ నియంత్రణ బలహీనపడటానికి అనేక కారణాలు ఉన్నాయి. ముఖ్యంగా, పెల్విక్ ఫ్లోర్ కండరాలు బలహీనపడటం ప్రధాన కారణం. ఈ కండరాలు మూత్రాశయాన్ని మరియు గర్భాశయాన్ని (స్త్రీలలో) పట్టుకొని ఉంచుతాయి. ప్రసవం జరిగిన స్త్రీలలో ఈ కండరాలు సాగి బలహీనపడతాయి.

వయస్సు పెరిగే కొద్దీ కండరాల బలం తగ్గడం, హార్మోన్ల మార్పులు (ముఖ్యంగా మెనోపాజ్ తర్వాత ఈస్ట్రోజెన్ తగ్గడం) కూడా నియంత్రణను తగ్గిస్తాయి. అంతేకాకుండా, స్థూలకాయం, మధుమేహం, దీర్ఘకాలిక దగ్గు లేదా మలబద్ధకం వంటి సమస్యలు పెల్విక్ ప్రాంతంపై నిరంతరం ఒత్తిడి కలిగించడం ద్వారా కూడా బ్లాడర్ కంట్రోల్ బలహీనపడుతుంది.
ఈ సమస్యకు యోగా ఒక అద్భుతమైన సహజమైన నివారణ మార్గంగా పనిచేస్తుంది. యోగా ద్వారా పెల్విక్ ఫ్లోర్ కండరాలను బలోపేతం చేయవచ్చు. కీగెల్ వ్యాయామాలు నేరుగా ఈ కండరాలపై పనిచేస్తాయి, వాటిని బలోపేతం చేసి, మూత్రాశయంపై నియంత్రణను మెరుగుపరుస్తాయి. యోగాలో, బద్ధ కోణాసనం,సేతు బంధాసనం మరియు వీరభద్రాసనం వంటి ఆసనాలు పెల్విక్ ప్రాంతానికి రక్త ప్రసరణను మెరుగుపరుస్తాయి, కండరాలను బలంగా ఉంచుతాయి.
కేవలం శారీరక ఆసనాలే కాకుండా యోగాలో భాగమైన ప్రాణాయామం ద్వారా ఒత్తిడిని తగ్గించుకోవడం కూడా బ్లాడర్ నియంత్రణ మెరుగుపడటానికి సహాయపడుతుంది. ఎందుకంటే, అధిక ఒత్తిడి బ్లాడర్ స్పందనను ప్రేరేపిస్తుంది.
గమనిక: పైన ఇచ్చిన సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే, ఏదయినా ఆరోగ్య సమస్య వుంటే వెంటనే డాక్టర్ ను సంప్రదించండి.
