ప్రపంచ వ్యాప్తంగా ప్రస్తుతం అనేక నగరాలు, పట్టణాలను వాయు కాలుష్యం ఎంతగా ఇబ్బంది పెడుతుందో అందరికీ తెలిసిందే. వాయు కాలుష్యం దెబ్బకు దేశంలోని పలు ప్రధాన మెట్రోపాలిటన్ నగరాల్లో ఇప్పటికే జనాలకు స్వచ్ఛమైన ఆక్సిజన్ దొరకడం లేదు. దీంతో శ్వాసకోశ సమస్యలు వస్తున్నాయి. అయితే వాయు కాలుష్యం వల్ల నగరాల్లో నివాసం ఉండే వారికి సీవోపీడీ (క్రానిక్ అబ్‌స్ట్రక్టివ్ పల్మనరీ డిసీజ్) అనే వ్యాధి ఎక్కువగా వస్తుందని సైంటిస్టుల అధ్యయనంలో తేలింది. ముఖ్యంగా బెంగళూరులో అనేక మంది ఈ వ్యాధి బారిన పడుతున్నారని తేలింది.
ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) చెబుతున్న లెక్కల ప్రకారం.. ప్రపంచ వ్యాప్తంగా ప్రతి 10 సెకన్లకు ఒకరు సీవోపీడీ వల్ల చనిపోతున్నారు. ఈ వ్యాధి వచ్చేందుకు గల ముఖ్య కారణాలు.. పొగ తాగడం, జీవ వ్యర్థాలను కాల్చడం ద్వారా ఉత్పనమయ్యే పొగను పీల్చడం, పొగ మంచు, వాయు కాలుష్యంలో ఎక్కువగా గడపడమేనని తేలింది. బెంగళూరుకు చెందిన కెంపెగౌడ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ చేసిన అధ్యయనంలో ఆ నగరంలోని అనేక మంది సీవోపీడీ బారిన పడుతున్నట్లు వెల్లడైంది.
సీవోపీడీ వచ్చిన వారికి శ్వాసకోశ సమస్యలు వస్తాయి. శ్వాస తీసుకోవడం కష్టతరమవుతుంది. స్ఫుటం ఎక్కువగా ఉత్పత్తి అవుతుంది. దీంతో తీవ్రమైన దగ్గు వస్తుంది. ఇది ప్రాణాంతకంగా మారేందుకు అవకాశం ఉంటుంది. రానున్న 20 ఏళ్లలో సీవోపీడీ కారణంగా చనిపోయే వారి సంఖ్య బాగా పెరుగుతుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ చెబుతోంది. కర్ణాటకలో అత్యధిక మంది చనిపోయేందుకు కారణమవుతున్న వ్యాధుల జాబితాలో సీవోపీడీ 1990లలో 9వ స్థానంలో ఉండేది. కానీ 2016లో అది రెండో స్థానానికి చేరుకుంది. దీన్ని బట్టి చూస్తే సీవోపీడీ ఎంత వేగంగా వ్యాప్తి చెందుతుందో మనకు ఇట్టే తెలిసిపోతుంది.
దేశంలో 1990లలో సీవోపీడీ వల్ల చనిపోయిన వారి సంఖ్య 43,500 ఉండగా, 2015 గణాంకాల ప్రకారం అది 1.07 లక్షలకు చేరుకుంది. 1990లతో పోలిస్తే 2017 వరకు సీవోపీడీ కేసులు 67 శాతం పెరిగాయి. ఈ క్రమంలో సీవోపీడీ చాప కింద నీరులా ఎలా వ్యాపిస్తుందో మనం గమనించవచ్చు.
అయితే వాయు కాలుష్యాన్ని అరికట్టడం ద్వారా సీవోపీడీ వ్యాప్తి రేటును తగ్గించవచ్చని నిపుణలు అంటున్నారు. ముఖ్యంగా ప్రజలు జీవవ్యర్థాలను ఇంధనం కోసం కాకుండా ఎల్‌పీజీ గ్యాస్‌ను వాడేలా చూడాలని అంటున్నారు. అలాగే పెట్రోల్, డీజిల్ వాహనాల వినియోగాన్ని పూర్తిగా తగ్గించడం లేదా మానేయడం చేయాలని, ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని పెంచాలని, ప్రజా రవాణాను మరింత సమర్థవంతంగా వినియోగిస్తే.. వాయు కాలుష్యాన్ని దాదాపుగా అరికట్టవచ్చని అంటున్నారు. అలాగే మహా నగరాలతోపాటు ఒక మోస్తరు నగరాలు, పట్టణాలు, పల్లెల్లోనూ.. మొక్కలను విరివిగా నాటి.. పర్యావరణాన్ని పరిరక్షిస్తే… వాయు కాలుష్యం తగ్గుతుందని.. దీంతో సీవోపీడీ మాత్రమే కాదు.. ఇతర శ్వాసకోశ సమస్యలనూ రాకుండా చూడవచ్చని అంటున్నారు. మరి ప్రభుత్వాలు ఏం చేస్తాయో చూడాలి.