రుచికి అద్భుతంగా ఉండే జీడిపప్పును ఇష్టపడని వారుండరు. స్వీట్లు, హాట్ వంటకాల్లోనే కాకుండా, ఖాళీ సమయంలో స్నాక్స్‌లా వీటిని తినడం చాలామందికి అలవాటు. నిజానికి జీడిపప్పులో పోషకాలు మెండుగా ఉన్నా, అందరికీ ఇది మేలు చేయదు. కొన్ని ప్రత్యేక ఆరోగ్య సమస్యలు ఉన్నవారు వీటిని తింటే పరిస్థితి విషమించే ప్రమాదం ఉంది. అసలు జీడిపప్పు ఎవరికి హానికరం? రోజుకు ఎన్ని తింటే క్షేమం? వంటి ఆసక్తికరమైన విషయాలను తెలుసుకుందాం.
జీడిపప్పులో ప్రొటీన్లు, ఆరోగ్యకరమైన కొవ్వులు ఉన్నప్పటికీ, ఇందులో కేలరీల శాతం చాలా ఎక్కువ. కాబట్టి బరువు తగ్గాలనుకునే వారు లేదా ఊబకాయంతో బాధపడేవారు వీటిని అతిగా తింటే ఆశించిన ఫలితం ఉండదు సరే కదా, బరువు మరింత పెరిగే అవకాశం ఉంది. అలాగే, కిడ్నీలో రాళ్లు (Kidney Stones) ఉన్నవారు జీడిపప్పుకు దూరంగా ఉండటమే మంచిది.

ఇందులో ఉండే ‘ఆక్సలేట్లు’ కిడ్నీలో రాళ్లు ఏర్పడటానికి కారణమవుతాయి లేదా ఉన్న సమస్యను మరింత తీవ్రం చేస్తాయి. రక్తపోటు (BP) సమస్య ఉన్నవారు ముఖ్యంగా వేయించిన, ఉప్పు కలిపిన జీడిపప్పును అస్సలు తీసుకోకూడదు, ఎందుకంటే అందులోని సోడియం బిపిని అదుపు తప్పేలా చేస్తుంది.
జీర్ణవ్యవస్థ బలహీనంగా ఉన్నవారికి కూడా జీడిపప్పు కొన్ని ఇబ్బందులు కలిగిస్తుంది. వీటిని అతిగా తింటే కడుపు ఉబ్బరం, గ్యాస్ లేదా మలబద్ధకం వంటి సమస్యలు తలెత్తవచ్చు. కొందరిలో ఇవి అలర్జీలకు దారితీసి చర్మంపై దద్దుర్లు లేదా శ్వాస తీసుకోవడంలో ఇబ్బందిని కలిగిస్తాయి.
ముఖ్యంగా ‘మైగ్రేన్’ తలనొప్పితో బాధపడేవారు జీడిపప్పు విషయంలో అప్రమత్తంగా ఉండాలి. ఇందులో ఉండే అమినో యాసిడ్స్ తలనొప్పిని ప్రేరేపించే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. ఏదైనా సరే పరిమితికి లోబడి తిన్నప్పుడే అది మన శరీరానికి ఔషధంగా మారుతుందని, మోతాదు మించితే అనారోగ్యానికి దారితీస్తుందని గుర్తుంచుకోవాలి.
గమనిక: పైన ఇచ్చిన సమాచారం కేవలం సామాన్య అవగాహన కోసం మాత్రమే. మీకు ఏదైనా అనారోగ్యం ఉన్నట్లయితే, ఆహార నియమాల్లో మార్పులు చేసే ముందు తప్పనిసరిగా వైద్యుడిని సంప్రదించడం శ్రేయస్కరం.
