కోడిగుడ్లను తినడం వల్ల మనకు అనేక లాభాలు కలుగుతాయి. గుడ్లలో దాదాపుగా అన్ని పోషకాలు ఉంటాయి. అందువల్ల వాటిని తరచూ తినాలని వైద్యులు సూచిస్తుంటారు. అయితే నిత్యం ఒకటి కన్నా ఎక్కువ కోడిగుడ్లను తింటే డయాబెటిస్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని సైంటిస్టులు తేల్చారు. ఈ మేరకు యూనివర్సిటీ ఆఫ్ సౌత్ ఆస్ట్రేలియా, చైనా మెడికల్ యూనివర్సిటీ, ఖతార్ యూనివర్సిటీలకు చెందిన పరిశోధకులు వివరాలను వెల్లడించారు.
చైనాలో 1991 నుంచి 2009 మధ్య గుడ్లను ఎక్కువగా తినే వారి ఆరోగ్య వివరాలను ఎప్పటికప్పుడు సేకరిస్తూ వచ్చారు. ఈ క్రమంలో తేలిందేమిటంటే.. నిత్యం ఒకటి అంతకన్నా ఎక్కువ గుడ్లను తినేవారిలో డయాబెటిస్ వచ్చే అవకాశాలు 60 శాతం వరకు పెరిగాయని గుర్తించారు. అయితే వాస్తవానికి ప్రపంచ దేశాలతో పోలిస్తే చైనాలో ప్రజల ఆహారపు అలవాట్లు కొంచెం భిన్నంగా ఉంటాయి. వారు అన్ని రకాల మాంసాహారాలను ఎక్కువగా తింటుంటారు. కనుక కేవలం కోడిగుడ్ల వల్లనే ఈ విధంగా జరిగిందా ? అన్న విషయాన్ని ఇప్పుడే చెప్పలేమని, దీనిపై మరిన్ని పరిశోధనలు చేయాలని అంటున్నారు.
అయితే దీర్ఘకాలం పాటు నిత్యం 38 గ్రాముల కన్నా ఎక్కువ మోతాదులో గుడ్లను తింటే డయాబెటిస్ వచ్చే అవకాశాలు 25 శాతం పెరుగుతాయని సైంటిస్టులు గుర్తించారు. అందువల్ల గుడ్లను తినేవారు ఈ విషయం పట్ల జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిస్తున్నారు. నిత్యం అధికంగా గుడ్లను తినేవారు ఈ విషయాన్ని తప్పకుండా గుర్తుంచుకోవాలని అంటున్నారు.