టీవీ పెట్టింది మొదలు మనం చూసే ప్రోగ్రామ్స్ కన్నా యాడ్స్ ఎక్కువగా ఉంటాయి. అందులోను జంక్ ఫుడ్ యాడ్స్ ఎంతో ఆకర్షనీయంగా గంటకి 6 చప్పున టెలికాస్ట్ అవుతుంటాయి. అవి చూసి మనం కోనేస్తుంటాం ..ఇలా టీవీ తెరపై కనిపించే బర్గర్లు, చీజ్ జారుతున్న పిజ్జా యాడ్స్ చూసి ఆర్డర్ చేస్తున్నారా? అయితే ఆగండి! జంక్ ఫుడ్ ప్రకటనల విషయంలో కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు కొరడా ఝుళిపిస్తోంది. తప్పుడు వాగ్దానాలతో వినియోగదారులను, ముఖ్యంగా చిన్నారులను తప్పుదోవ పట్టించే కంపెనీలకు చెక్ పెట్టేందుకు కీలక మార్గదర్శకాలను సిద్ధం చేస్తోంది. అసలు ఈ ఆంక్షలు ఎందుకు? మన ఆరోగ్యంపై వీటి ప్రభావం ఏంటి? అన్న ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడే చదివి తెలుసుకోండి.
తప్పుదోవ పట్టించే ప్రకటనలపై ఉక్కుపాదం: కేంద్ర వినియోగదారుల రక్షణ సంస్థ (CCPA) మరియు ఆహార భద్రతా ప్రమాణాల సంస్థ (FSSAI) జంక్ ఫుడ్ ప్రకటనలపై నిఘా పెంచాయి. బర్గర్లు, పిజ్జాలు, చిప్స్ వంటి హై-ఫ్యాట్, షుగర్ మరియు సాల్ట్ కలిగిన ఆహార పదార్థాలను ఆరోగ్యకరమైనవిగా చిత్రీకరించడంపై కేంద్రం సీరియస్ అయింది.
ప్రకటనలలో చూపించే రంగులు, ఆకర్షణీయమైన మాటలు ప్రజలను తప్పుదోవ పట్టించకూడదని, ముఖ్యంగా పిల్లలను లక్ష్యంగా చేసుకుని చేసే ‘మిస్ లీడింగ్’ యాడ్స్ నిలిపివేయాలని హెచ్చరికలు జారీ చేసింది. వీటిని అతిక్రమిస్తే భారీ జరిమానాలు మరియు నిషేధాలు తప్పవని స్పష్టం చేస్తోంది.

పెరుగుతున్న జీవనశైలి వ్యాధులు: భారతదేశంలో ఊబకాయం (Obesity) మధుమేహం మరియు గుండె జబ్బులు చిన్న వయస్సులోనే పెరగడానికి ఈ జంక్ ఫుడ్ సంస్కృతి ఒక ప్రధాన కారణం. టీవీలు సోషల్ మీడియాలో నిరంతరం కనిపించే ఈ ఆకర్షణీయమైన ప్రకటనలు ఆరోగ్యకరమైన ఆహారం కంటే జంక్ ఫుడ్ వైపు ప్రజలను ఆకర్షిస్తున్నాయి.
ప్రభుత్వం తీసుకువస్తున్న కొత్త నిబంధనల ప్రకారం, కంపెనీలు తమ ఆహారంలోని పోషక విలువల గురించి నిజాయితీగా చెప్పాలి. అధిక ఉప్పు, చక్కెర ఉన్న పదార్థాల వల్ల కలిగే నష్టాలను దాచిపెట్టి, వాటిని “ఎనర్జీ ఫుడ్స్” గా ప్రచారం చేయడం ఇకపై సాధ్యం కాదు.
ప్రభుత్వ నిబంధనలు ఎన్ని ఉన్నా, అంతిమంగా మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంది. ప్రకటనలను చూసి మోసపోకుండా, మనం తినే ఆహారంలో ఏముందో తెలుసుకోవడం అవసరం. ప్యాక్ చేసిన ఆహార పదార్థాల వెనుక ఉండే ‘లేబుల్స్’ చదివే అలవాటు చేసుకోవాలి.
జంక్ ఫుడ్ కంపెనీలపై కేంద్రం తీసుకుంటున్న ఈ కఠిన చర్యలు సమాజంలో ఆరోగ్యకరమైన మార్పుకు నాంది పలుకుతాయని ఆశిద్దాం. రేపటి తరాన్ని అనారోగ్యం బారి నుండి కాపాడుకోవడానికి ఇది ఒక సాహసోపేతమైన అడుగు.
