ప్రధాని మోదీ తాజాగా నిర్వహించిన మన్ కీ బాత్ కార్యక్రమంలో భాగంగా కేవలం స్వదేశీ వస్తువులను మాత్రమే వాడాలని చెప్పారు. అందులో భాగంగానే ఆయన కాశ్మీరీ కుంకుమ పువ్వు ప్రస్తావన తెచ్చారు. కాశ్మీరీ కుంకుమ పువ్వుకు నిజానికి అంతర్జాతీయంగా ప్రత్యేక గుర్తింపు ఉంది. గత మే నెలలో కాశ్మీర్ కుంకుమ పువ్వుకు జీఐ ట్యాగ్ కూడా లభించింది. కాగా మోదీ ఆ కుంకుమ పువ్వును కొనాలని సూచించడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఈ క్రమంలోనే కుంకుమ పువ్వు వల్ల మనకు ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.
* కుంకుమ పువ్వులో అనేక ఔషధ గుణాలు ఉంటాయి. అందులో వృక్ష సంబంధ సమ్మేళనాలు ఉంటాయి. ముఖ్యంగా కుంకుమ పువ్వులో ఉండే క్రోసిన్, క్రోసెటిన్, సఫ్రనల్ అనబడే యాంటీ ఆక్సిడెంట్లు మెదడు కణాలు నాశనం కాకుండా చూస్తాయి. అలాగే జ్ఞాపకశక్తిని పెంచుతాయి. ఏకాగ్రత వచ్చేలా చేస్తాయి.
* కుంకుమ పువ్వును నిత్యం వాడడం వల్ల కరోనరీ ఆర్టరీ వ్యాధులు, హైపర్ టెన్షన్, జీర్ణాశయ సమస్యలు, అల్జీమర్స్, పార్కిన్సన్ వ్యాధి, డిప్రెషన్ వంటి సమస్యలు రాకుండా ఉంటాయి.
* కుంకుమ పువ్వును మహిళలు నిత్యం తీసుకుంటే రుతు సమయంలో వచ్చే విసుగు, తలనొప్పి వంటి సమస్యలు తగ్గుతాయి. అలాగే నెలసరి సరిగ్గా వస్తుంది.
* కుంకుమ పువ్వును నిత్యం ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల అధిక బరువు తగ్గవచ్చు. ఆకలి నియంత్రణలో ఉంటుంది. బాడీ మాస్ ఇండెక్స్ (బీఎంఐ) తగ్గుతుంది.
* కుంకుమ పువ్వులో ఉండే క్రోసిన్, మెలనిన్ అనబడే సమ్మేళనాలు హైపర్ పిగ్మెంటేషన్ సమస్యను తగ్గిస్తాయి. దీని వల్ల చర్మం సురక్షితంగా ఉంటుంది.