మనిషికి అన్ని పోషకాలు కరెక్టుగా అందితేనే.. ఆరోగ్యం కరెక్టుగా ఉంటుంది. లేదంటే ఏదో ఒక లోపంతో ఇబ్బంది పడాల్సిందే.. ఐరన్ లోపం వల్ల మానసిక సమస్యలు వస్తాయని ఈమధ్యనే శాస్త్రవేత్తలు కనిపెట్టారు..అసలు ఐరన్‌కు మానసిక సమస్యలకు ఏంట్రా సంబంధం అని అనుకుంటున్నారా..? ఏదో ఒక కనక్షన్ ఉంటుందిగా..! ఆ కనక్షన్ ఏంటో చూద్దామా..!
ఐరన్ లోపం ఏర్పడితే డిప్రెషన్, యాంక్జైటీ, స్ర్కీజోఫినియా వంటి మానసిక సమస్యలు తీవ్రమవుతాయట. సాధారణంగా శరీరంలో తగినంత ఐరన్ లేకపోతే చాలా త్వరగా అలసిపోతారు. చిన్న చిన్న పనులకే శ్వాస బరువుగా మారి ఇబ్బంది పెట్టవచ్చు. చర్మం పాలిపోయినట్టు అవుతుంది. గుండె లయ పెరిగిన భావన కలుగుతుంది. అప్పుడప్పుడు గుండె చప్పుడు మీకే వినిపిస్తున్నట్టు అనిపిస్తుంది. ఒక్కోసారి అకస్మాత్తుగా కళ్లు తిరుగుతున్నట్టు కూడా అనిపిస్తుంది.
జుట్టు కూడా ఎక్కువగా రాలుతుంది. ఆహారం కాని పేపర్, సున్నం, బలపాల వంటివి తినాలని అనిపిస్తుంది. గోళ్లు పలుచబడి విరిగిపోతుంటాయి. రెస్ట్ లెస్ లెగ్ సిండ్రోమ్ కూడా అంటే కాళ్లు కదలకుండా పెట్టుకోలేరు అదేపనిగా కదిలిస్తుంటారు. ప్రపంచ జనాభాలో దాదాపు 30 శాతం మంది ఐరన్ లోపంతో బాధపడుతున్నారు. ఇది స్త్రీలలో ఎక్కువగా ఉంటుంది. ఇవన్నీ కూడా శారీరకంగా కనిపించే లక్షణాలు కానీ ఐరన్ లోపం మానసిక ఆరోగ్యం మీద కూడా ప్రభావం చూపుతుందని కొత్త పరిశోధనలు చెబుతున్నాయి.
మానసిక ఆరోగ్యాన్ని నియంత్రించే న్యూరోట్రాన్స్మిటర్ల ఉత్పత్తికి ఐరన్ కీలకమైంది. ఐరన్ తక్కువైనపుడు న్యూరోట్రాన్స్మీటర్ల పనితీరు దెబ్బతింటుంది. ఇది మానసిక అసంతులనకు కారణమవుతుంది. ఐరన్, న్యూరోట్రాన్స్మీటర్ల మధ్య ఉన్న సంబంధాన్ని విశ్లేషించేందకు ఈ పరిశోధన ఉపయోగపడుతుంది. ఈ పరిశోధన ఐరన్ లోపం మానసిక ఆరోగ్య పరిస్థితుల మధ్య బలమైన సంబంధం ఉన్నట్లు కనుగొంది. ఐరన్ లోపాన్ని రక్తహీనతగా పరిగణిస్తారు. రక్తహీనతతో బాధపడుతున్న వ్యక్తులలో డిప్రెషన్, యాంగ్జైటీ డిజార్డర్స్, స్లీప్ డిజార్డర్స్ ఎక్కువగా ఉన్నట్టు అధ్యయనాల ఫలితాలు తెలుపుతున్నాయి.
రక్తహీనతతో బాధపడుతున్న వారు త్వరగా అలసిపోతారు. ఏకాగ్రత కూడా ఎక్కువ సమయం పాటు నిలపలేరు. డిప్రెషన్‌కు కూడా రక్తహీనత కారణం కావచ్చు. ఐరన్ పుష్కలంగా లభించే ఆహారపదార్థాలు తీసుకోవడంవల్ల శారీరక మానసిక ఆరోగ్యాలు మెరుగ్గా ఉంటాయి. బీన్స్, డ్రైఫ్రూట్స్, గుడ్లు, ఐరన్ ఫార్టిఫైడ్ తృణధాన్యాలు, లీన్ రెడ్ మీట్, చికెన్ వంటి వాటన్నింటిలో ఐరన్ ఉంటుంది. ఐరన్ రిచ్ ఫూడ్ తీసుకోవడం మీద కొంచెం ఎక్కువ శ్రద్ధ పెట్టడం అవసరం.
అవగాహనా లోపం..
మానసిక ఆరోగ్యం మీద ఐరన్ లోపం ప్రభావం గురించిన అవగాహన పేషెంట్లలోనూ ఇటు ఆరోగ్య నిపుణులకు కూడా తక్కువే ఉంటుంది. మానసిక సమస్యలను ఎదుర్కోంటున్న వారు, లేదా ఇప్పటికే యాంగ్జైటీ వంటి సమస్యలు నిర్ధారించబడిన వారు ఐరన్ స్థాయిలు టెస్ట్ చేయించుకోవాలి. అవసరమనుకుంటే తప్పకుండా సప్లిమెంట్లు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ఇది శరీరం చురుకుగా ఉండేందుకు, ఉత్సాహంగా ఉండేందకు మాత్రమే కాదు మానసిక స్థితిని కూడా సంతులనంలో ఉంచేందుకు తోడ్పడుతుంది.