గర్భధారణ సమయంలో చిన్నపాటి నొప్పులు, అసౌకర్యం చాలా సహజం. తలనొప్పి, వెన్నునొప్పి లేదా కండరాల నొప్పులు వచ్చినప్పుడు వెంటనే ఓ పెయిన్ కిల్లర్ వేసుకోవాలనిపిస్తుంది కదూ? కానీ గర్భిణీ స్త్రీలు ఇలా సొంతంగా మందులు వాడటం తల్లికి, కడుపులోని శిశువుకు తీవ్ర ప్రమాదాన్ని కలిగిస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు! మనం సాధారణంగా వాడే మందులు కూడా లోపల పెరుగుతున్న బిడ్డపై ఎలా ప్రభావం చూపుతాయో, ఆ ప్రమాదకరమైన కారణాలు ఏమిటో తెలుసుకోవడం చాలా అవసరం.
మీరు సాధారణంగా తీసుకునే కొన్ని నొప్పి నివారణ మందులు (ముఖ్యంగా నాన్-స్టెరాయిడల్ యాంటీ ఇన్ఫ్లమేటరీ డ్రగ్స్, గర్భస్థ శిశువు ఆరోగ్యానికి హాని కలిగించవచ్చు. ఇందుకు ముఖ్య కారణాలు చూస్తే..

జనన లోపాలు : గర్భం యొక్క మొదటి త్రైమాసికం లో కొన్ని రకాల పెయిన్ కిల్లర్స్ వాడటం వలన శిశువులో గుండె మరియు వెన్నెముక వంటి ముఖ్య అవయవాలు అభివృద్ధి చెందే క్రమంలో లోపాలు ఏర్పడే ప్రమాదం ఉంది.
శిశువు గుండెపై ప్రభావం: గర్భం యొక్క మూడవ త్రైమాసికంలో నాన్-స్టెరాయిడల్ యాంటీ ఇన్ఫ్లమేటరీ డ్రగ్స్, ఉదాహరణకు ఇబుప్రోఫెన్ వంటివి వాడటం వలన, శిశువు గుండెలోని ముఖ్యమైన రక్తనాళం (డక్టస్ ఆర్టెరియోసస్) ముందుగానే మూసుకుపోయే ప్రమాదం ఉంది. ఇది శిశువుకు ప్రాణాంతక పరిస్థితికి దారితీయవచ్చు.
గర్భస్రావం లేదా ప్రీమెచ్యూర్ డెలివరీ: కొన్ని అధ్యయనాల ప్రకారం, నొప్పి మందుల అధిక వాడకం వలన గర్భస్రావం అయ్యే లేదా ముందస్తు ప్రసవం అయ్యే ప్రమాదం పెరుగుతుంది.
గర్భధారణ సమయంలో నొప్పి నివారణకు అత్యంత సురక్షితమైనదిగా భావించే పారాసెటమాల్ (acetaminophen)ను కూడా డాక్టర్ సలహా మేరకే, అత్యవసరమైతేనే, అతి తక్కువ డోస్‌లో తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.
గర్భధారణ అనేది అత్యంత సున్నితమైన దశ. ఈ సమయంలో సొంత వైద్యం అనేది తల్లికి, బిడ్డకు ఎప్పుడూ మంచిది కాదు. నొప్పి వచ్చినా, లేదా ఏదైనా చిన్నపాటి అనారోగ్యం కలిగినా డాక్టర్‌ను సంప్రదించకుండా ఏ మందునూ తీసుకోకుండా ఉండటమే ఉత్తమమైన పద్ధతి.