వానకాలం వచ్చిందంటే డెంగీ, మలేరియా, టైఫాయిడ్ లాంటి సీజనల్ వ్యాధులు జనాలపై దండయాత్ర చేస్తాయి. ఏ కొంచెం పరిశుభ్రత లోపించినా మనపై అటాక్ చేయడానికి కాచుకు కూర్చుకుంటాయి. ఇక చిన్నపిల్లల సంగతైతే చెప్పాల్సిన అవసరం లేదు. ఏ మాత్రం ఏమరపాటుగా ఉన్నా జలుబు, దగ్గు నుంచి మొదలు అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. మీరి వాటి నుంచి రక్షణ పొందడం ఎలా..
దోమలకు చెక్ పెట్టండి..
ఇంటి పరిసరాల్లో నీరు నిల్వ ఉంటే దోమలు వృద్ధి చెందుతాయి. దీంతో అనేక వ్యాధులు వస్తాయి. అందుకే ఇంటి చుట్టు పక్కల ఉండే నీటి నిల్వలను తొలగించాలి. పిల్లల బెడ్ చుట్టూ దోమ తెరలను కట్టాలి. కిటికీలకు మెష్లను ఏర్పాటు చేయాలి.
నీటిని వేడి చేయాలి..
కలుషితమైన నీటి వల్లే ఎక్కువగా ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. అందుకే పిల్లలకు వేడి చేసి చల్లారిన గోరు వెచ్చటి నీటినే అందించాలి. ఇలా చేయడం వల్ల నీటిలోని హానికర క్రిములు తొలిగిపోతాయి. ఇప్పుడు బయల లభించే ఆహార పదార్థాలకు చిన్నారును దూరంగా ఉంచడం ఉత్తమం.
తాజా ఆహారం..
ఎక్కువ కాలం నిల్వ ఉన్న ఆహారాన్ని పిల్లలకు పెట్టొద్దు. ఏ పూటకు ఆ పూట తాజాగా వండిన ఆహారాన్నే అందించాలి. కూరగాయల భోజనానికి ప్రాధాన్యం ఇవ్వాలి. ఇందులో యాంటీ యాక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. రోగ నిరోధక శక్తిని పెంచుతాయి. వండే ముందు కూరగాయలు, ఆకు కూరలను పరిశుభ్రంగా కడగడం మాత్రం మరిచిపోకండి. పండ్లు, కూరగాయలు, ఆహార పదార్థాలపై ఈగలు వాలకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.
శరీరం పొడిగా ఉండాలి..
ఎప్పుడూ పొడిగా ఉండే దుస్తులు వేయాలి. ఒక వేళ పిల్లలు వానలో తడిచినప్పుడు తప్పకుండా వాటిని మార్చాలి. చిన్నారుల శరీరాన్ని ఎప్పుడూ పొడిగా ఉండేలా చూసుకోవాలి. తడిగా ఉంటే ఫంగల్ ఇన్ఫెక్షన్లు చుట్టుముడతాయి. సాక్సులు, రెయిన్ కోట్లను కూడా పరిశుభ్రంగా ఉంచాలి. ఇంటిని ఎప్పుడూ పరిశుభ్రంగా ఉంచాలి. పిల్లలు ఎప్పుడూ ఎక్కడపడితే అక్కడే ఆడుకుంటూ ఉంటారు. దీంతో ఇంట్లో పరిశుభ్రత లోపిస్తే వాళ్లకు చర్మ సమస్యలు వచ్చే ఆస్కారం ఉంది.