ఒత్తిడి నిరాశ లోతుల్లోకి దారి తీస్తుంది.. ఆ లోతునుండి బయటపడే మార్గాలివే…

-

ఒత్తిడి అనేది మనిషి మీద చాలా ప్రభావాన్ని చూపిస్తుంది. అనుక్షణం ఏదో ఒక విషయం మీద అతిగా ఆలోచిస్తూ కూర్చుని, దాని గురించే బాధపడుతూ ఉంటే నిరాశలోకి జారిపోతాం. మనం అనుకున్న పని జరగనపుడో, మనకు కావాల్సిన వాళ్ళు మనం అనుకున్నట్టు ప్రవర్తించనపుడో ఇలాంటి ఒత్తిడి వస్తుంటుంది. పని ఒత్తిడి అనేది సర్వ సాధారణం. ఒక్కసారి ఆఫీసు అయిపోగానే అన్నీ మానుకుని ఇంటికి వెళ్ళి హాయిగా తిని పడుకున్నామా అన్నట్టే ఉండాలి పనిలో. ఇంటి దగ్గర ఉండి కూడా ఆఫీసు గురించి ఆలోచించడం తప్పవుతుంది. అలా ఆలోచించేవారు అవతలి వారితో సరిగ్గా ఉండలేరు.

వీళ్ళకెప్పుడూ బాస్ ని మెప్పించాలని, ఎక్కువ బోనస్ రాబట్టుకోవాలనే ఉంటుంది తప్ప, ఇంట్లో తనకోసం ఎదురుచూసేవాళ్ళు ఉన్నారని, తనతో పాటు మాట్లాడుతూ భోజనం చేయాలని వారు కోరుకుంటున్నారని ఆలోచన రాదు. ఐతే ఏదైనా సరే ఒత్తిడి అధికం అవుతుంటే జాగ్రత్త పడాలి. లేదంటే నిరాశ తొంగిచూస్తుంటుంది. ఒత్తిడి అలాగే కంటిన్యూ అవుతుంటే గనక నిరాశకి ఆహ్వానం అంది, అది ఇక్కడే ఉండిపోవాలని అనుకుంటుంది. ఒక్కసారి నిరాశ నీ జీవితంలోకి ప్రవేశించాక నీకు ఆనందం అనేది లేకుండా పోతుంది.

ఆనందం మనది కాదు, మనమింతే, ఇలా బ్రతకడానికే ఇక్కడికి వచ్చామన్న భావన వస్తుంది. అది ఎంతమాత్రం మంచిది కాదు. ఏ పని చేయాలనిపించకపోవడం, కొత్తదంటే చిరాకు పడటం, ఆరోగ్యం చెడిపోవడం, ఎల్లప్పుడూ ఒకే ఆలోచనలో ఉండడం మొదలైనవన్నీ డిప్రెషన్ తాలూకు లక్షణాలు. కొన్ని కొన్ని సార్లు తమని తాము చిదిమేసుకోవాలని అనిపిస్తుంటుంది కూడా. ఇలాంటి ఆలోచనల నుండి బయటపడాలంటే ముందు నిన్ను నువ్వు ప్రేమించడం నేర్చుకోవాలి.

నువ్వు ఎన్నో తప్పులు చేసి ఉండవచ్చు. వాటివల్లే నీ జీవితం ఇలా అయ్యి ఉండవచ్చు. అంతమాత్రాన నీకు ఇక్కడ జీవించే స్వేఛ్ఛ లేదని ఎందుకు అనుకుంటావు. నీకంటే తప్పులు చేసినవాళ్ళు కూడా ఇక్కడ ఉంటున్నారు కదా. నీ జీవితం ఇలా అవ్వడానికి నువ్వే కారణం కదా. మరి అది తెలుసుకున్నప్పుడు ఆ తప్పుల్ని సరిదిద్దుకునే ప్రయత్నం చేయాలి. లేదంటే అందమైన జీవితంలో నిరాశ మూలంగా అద్భుతమైన రోజులన్నీ మిస్సయిపోతాం.

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version