24 గంటల్లోనే మొదటి ఆర్డర్.. ఇంటి నుంచే రూ.కోట్ల సంపాదన

-

ఆడుతు పాడుతు పనిచేస్తుంటే అలుపు సొలుపేం ఉన్నది అని పాట పాడుకున్నట్లు అన్ని పనులు ఆడుతు పాడుతూ చేయలేం. ముఖ్యంగా ఆఫీసుల్లో గాలిపీల్చుకోడవమే గగనం. ఇంకా ఆడుతు పాడుతు పనిచేసే అవకాశం ఎక్కడ ఉంటుంది. అందుకే పెద్దపెద్ద కంపెనీల్లో ఉద్యోగాలు చేస్తున్నా.. లక్షల్లో జీతాలు వస్తున్నా కొందరికి లైఫ్​లో ఏదో తెలియని అసంతృప్తి. ఆ అసంతృప్తులు అగాధంలోకి కూరుకుపోకుండా తమ జీవనగమనమేంటో.. ఆ గమ్యానికి ఇష్టంగా చేరుకోవడమెలాగో తెలుసుకోవడానికి తమని తామే శోధిస్తారు. ఈ శోధనలో తమకేం కావాలో తెలుసుకుంటారు. ఇంకేం వారికి నచ్చిన బాటలో నడుస్తారు. ఆడుతూ పాడుతూ పనిచేస్తూ అనుకున్నది సాధిస్తారు. అలాంటి ఓ వీరవనిత గురించి తెలుసుకుందాం..

పెద్ద సంస్థల్లో ఉద్యోగం.. డిజైనర్‌గా ఏళ్ల అనుభవం.. ఆకర్షణీయమైన జీతం. ‘కానీ ఇందులో తన ప్రత్యేకత ఏం ఉందనుకుంది రుచీవర్మ. అందుకే కంఫర్ట్​గా ఉన్న జాబ్​ని వదిలేసింది. తనలో ఉన్న క్రియేటివిటీకి పని చెప్పింది. ఇంకేం నచ్చిన పని చేస్తూ లాభాల బాటలో పరుగులు పెడుతోంది. వ్యాపారవేత్త రుచీవర్మ ప్రయాణం లక్షలు తీసుకునే ఉద్యోగం నుంచి కోట్లు సంపాదించే వ్యాపారం వరకు ఎలా సాగిందంటే..

దేన్నైనా ఆడుతూ పాడుతూ చేయడం రుచీవర్మకు అలవాటు. ఖాళీ దొరికితే బొమ్మలు చేయడం, పెయింటింగ్‌ వేయడం తన వ్యాపకాలు. ఉద్యోగంలోకి అడుగుపెట్టాక వాటికి సమయమే దొరికేది కాదు. జీవితం నిస్సారంగా అనిపించడంతో దాన్నుంచి బయటపడాలనుకుంది. తను నిఫ్ట్‌ ముంబయి నుంచి ఫ్యాషన్‌ డిజైనింగ్‌లో డిగ్రీ చేసింది. టాటా వెస్ట్‌సైడ్‌, స్పెన్సర్స్‌ సంస్థల్లో ఏడేళ్లు పనిచేసింది. సొంతంగా ఏదైనా చేయాలని 2020లో ‘ఆరువి రుచి వర్మ’ బ్రాండ్‌ని మొదలుపెట్టింది. రూ.2.5 లక్షలతో ప్రారంభమైన తన వ్యాపారం ఏడాదిలోనే రూ.1.8 కోట్లకు చేరుకుంది.

‘చదువవ్వగానే ఉద్యోగం. పెద్ద సంస్థలు, తోటి అమ్మాయిలు అసూయపడే జీతం. కానీ ఈ 9-5 గంటల జీవితంలో నా వ్యాపకాలు, సృజనాత్మకత పక్కకు వెళ్లిపోయాయి. ఏదైనా ప్రయత్నిద్దామనుకున్నా సమయమేది? సొంత వ్యాపారానికేమో అనుభవం లేదు. బిహార్‌లోని ఓ చిన్న పట్టణం నుంచొచ్చా. త్వరపడి ధైర్యం చేయలేను. అయినా ఆలోచన మానలేదు. ఓసారి ఆన్‌లైన్‌లో ఏదో కొంటోంటే భిన్న డిజైనర్ల వస్త్రాలు ఒకేచోట దొరుకుతున్నాయి కదా.. నేనూ ప్రయత్నిస్తే అన్న ఆలోచన తట్టింది. వెంటనే చాలా అధ్యయనం చేశా. అయినా తెలియని భయం. అసలు వ్యాపారం మొదలుపెట్టడమెలా అని గూగుల్‌లో వెతికా. కంపెనీ రిజిస్టర్‌ చేయడం దగ్గర్నుంచి టాక్స్‌, మార్కెటింగ్‌.. ఇలా ఒక్కోదాని గురించీ నేర్చుకున్నా. అంతే ఉద్యోగానికి రాజీనామా చేశా. నా నిర్ణయం విన్నప్పుడు ఇంట్లోవాళ్లు నిరాశపడ్డారు. మంచి ఉద్యోగాన్ని వదులుకోవద్దన్నారు. నష్టాలు తట్టుకోలేనన్నారు. నేను వినలేదు.

నా సంస్థలో నేనొక్కదాన్నే. ఇంట్లో కంప్యూటర్‌పై డిజైన్‌ చేసి, బయట కుట్టిచ్చేదాన్ని. గర్భిణులకు పెద్దగా డిజైన్లు దొరకవు కాబట్టి, వాళ్లపై దృష్టిపెట్టా. ఒకటి బాగుందనుకున్నాక పెద్ద సంఖ్యలో కుట్టించా. వాటిని అమెజాన్‌, మింత్రా, ఫ్లిప్‌కార్ట్‌ వంటి ఆన్‌లైన్‌ వేదికల్లో ఉంచా. 24 గంటల్లోనే మొదటి ఆర్డర్‌ వచ్చింది. ఇక వెనుతిరిగి చూసుకోలేదు. ప్రతివారం కొత్త డిజైన్లు తెస్తుంటా. స్వల్పవ్యవధిలోనే వ్యాపారం రూ.కోటిని దాటింది. ఈ ఏడాది ఇప్పటికే రూ.3 కోట్ల వ్యాపారం జరిగింది. ఏడాది చివరికి రూ.5కోట్లకు చేరుకుంటా. ఇదంతా ఇంటి నుంచే’ అని సంబరంగా చెబుతోంది రుచి. ఈ మధ్యే క్యాజువల్‌ వేర్‌పైనా దృష్టిపెట్టింది. చేయలేవేమో అన్నవారే ఇప్పుడామెను ఇంటి నుంచి భలే సంపాదిస్తున్నావంటూ అభినందిస్తున్నారు.

‘కలను సాకారం చేసుకోవడానికి వెనకాడొద్దు. ప్రయత్నించాలే కానీ అవకాశాలు బోలెడు’ అనే చెప్పే ఈ 34 ఏళ్ల అమ్మాయి.. వ్యాపారం మనవల్ల కాదు అనుకునే ఎంతోమందికి తన కథ స్ఫూర్తిగా నిలిస్తే చాలంటోంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version