తెలంగాణ ప్రభుత్వం నిర్వహించిన కులగణనకు తాము ఎంత మాత్రం వ్యతిరేకం కాదని కేంద్ర మంత్రి బండి సంజయ్ స్పష్టంచేశారు. మంగళవారం ఆయన కరీంనగర్‌లో మీడియాతో మాట్లాడుతూ.. ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. మూడు ఎమ్మెల్సీ స్థానాల్లోనూ తమ పార్టీనే గెలవబోతుందని పేర్కొన్నారు. ఆ విషయం సీఎం రేవంత్ రెడ్డికు అర్థమైందని, అందుకే మూడు జిల్లాల్లో హడావుడిగా ప్రచారం చేశారని సెటైర్లు వేశారు.
తప్పుడు హామీలు ఇచ్చి వాటిని నిలబెట్టుకోలేక పోయారని అందుకే ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఫలితం వారికి వ్యతిరేకంగా రాబోతుందని వెల్లడించారు. ఇక బీసీ కులగణన తప్పులతడకగా ఉందని, 42 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తామని చెప్పిన సర్కార్.. 32 శాతం మాత్రమే అమలు చేయాలని కుట్రలు చేస్తోందని విమర్శించారు. గతంలో కేసీఆర్ నిర్వహించిన సమగ్ర సర్వే కంటే బీసీలు ఇప్పుడు ఎందుకు తగ్గారని ప్రశ్నించారు.