ఇప్పపువ్వులతో లడ్డూ.. ఆదివాసీ మహిళలకు ఆర్థిక చేయూత

-

వ్యాపారం చేసే ఆలోచన, తగిన వనరులు ఉన్నప్పటికీ.. కొన్నిసార్లు బిజినెస్ లో నెగ్గుకురాలేము. వీటికి తోడు. స్మార్ట్ గా ప్లాన్ చేస్తూ.. ప్రొడెక్ట్స్ ను మార్కెటింగ్ చేసుకున్నప్పుడే.. బిజినెస్ లో రాణించగలం. ఇప్పుడు చెప్పుకోబోయే కథ కూడా ఇలాంటిదే.. వాళ్లు ఆదివాసీ మహిళలు.. పూలతో సారా చేయగలరు. ఆ తర్వాత ప్రభుత్వ ప్రాజెక్టులో భాగంగా లడ్డూలు చుట్టారు.. అయితే వినియోగదారులకు మాత్రం చేర్చలేకపోయారు. అప్పుడే వచ్చింది రజియా. మార్కెటింగ్ కొత్త విధానాలతో విజయం సాధించింది. స్ఫూర్తినింపే కథ పూర్తిగా చదివేయండి..!

ఛత్తీస్‌గఢ్‌ ప్రభుత్వ ప్రాజెక్టు ‘సేఫ్‌ మదర్‌హుడ్‌’లో పరిశోధకురాలిగా చేరింది. రజియా స్వస్థలం చత్తీస్‌గఢ్‌లోని జగదల్‌పూర్‌. తన విధుల్లో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా గ్రామాలూ, అటవీ ప్రాంతాల్లో పర్యటించి స్థానిక మొక్కలను అధ్యయనం చేసేది. ఆ సమయంలో కామనార్‌ గ్రామానికి చెందిన మహిళా బృందాలు ఇప్పపువ్వుతో చేసే లడ్డూల్ని చూసి ఆమె ఆశ్చర్యపోయింది. అవి ఆరోగ్యానికి చాలా మంచివని గుర్తించింది.. కానీ వాటిని వినియోగదారులకు చేర్చడంలో ఆ మహిళలు విఫలం అవుతున్నారని తెలుసుకుంది.

టీ, బిస్కెట్లు కూడా…

ప్రొటీన్లు, విటమిన్లు, ఖనిజ లవణాలు పుష్కలంగా ఉండి ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్న ఇప్పపూలతో మరిన్ని ఉత్పత్తులు చేయించి రజియా మహిళలకు స్వయం ఉపాధి కల్పించాలనుకుంది. అక్కడి మహిళలందరికీ తన ఆలోచన చెప్పి.. వారి లడ్డూలకు కొత్త వాసన, రుచి చేర్చడంతోపాటు మరికొన్ని ఉత్పత్తుల తయారీపై ప్రయోగాలు చేశారట. ఆరు నెలలు వాళ్లతోనే ఉండి, ఓ పోషకాహార నిపుణుడు, కొందరు టెక్నీషియన్ల సాయంతో మొదట లడ్డూ, హల్వా వంటివి చేశారు.

తర్వాత మరికొందరు మహిళలకు శిక్షణ ఇచ్చి ఉత్పత్తుల సంఖ్యను పెంచుతూ వచ్చారు. టీ, బిస్కెట్లు, ఎనర్జీ బైట్‌, స్వీట్లు సహా పలు పదార్థాలను చేయడం ప్రారంభించారు. ఇప్ప పువ్వులకు అల్లం, బెల్లం, యాలకులు కలిపి లడ్డూలను చేస్తే కొత్త రుచి వచ్చింది. నమ్మకం కుదిరాక ‘బస్తర్‌ ఫుడ్స్‌’ పేరుతో తక్కువ ధరలకే విక్రయించడం మొదలుపెట్టారు. అలా ముందుగా వీటిని వినియోగదారులకు రుచి చూపి, దగ్గర చేయడానికి ప్రయత్నించారు.. ఈ ప్రయోగం విజయవంతమైంది. కొనుగోలుదారులు పెరగడంతో… తయారీనీ పెంచారు.

పది మహిళా స్వయం సహాయక బృందాలను ఏర్పాటు చేసి అందరికీ విప్ప పువ్వు ఉత్పత్తుల తయారీలో శిక్షణనిచ్చారు. దీంట్లో ప్రయోగాలు, కొత్త ఉత్పత్తుల తయారీనీ ప్రోత్సహించి… వీటికి సంబంధించి వర్క్‌షాపులను నిర్వహించి ప్రతి ఒక్కరినీ ఇందులో భాగస్వాములను చేసినట్లు ఆమె పేర్కొన్నారు. ఎగ్జిబిషన్లు, ఆహార ఉత్సవాల్లో ఈ ఉత్పత్తుల ప్రదర్శన జరపడంతో వీటిపట్ల అవగాహన పెరిగింది. అలాగే హిమోగ్లోబిన్‌ శాతం తక్కువగా ఉన్నట్లు వైద్యశాఖ ద్వారా తెలుసుకుని ఆయా ప్రాంతాలకు వెళ్లి అక్కడి వారికి ఇప్పపూల లడ్డూలు ఉచితంగా అందించారు.

వీటిని తీసుకున్నవారిలో హిమోగ్లోబిన్‌ స్థాయిలు పెరిగినట్లు పరీక్షల్లో తేలడంతో… మరి కొందరికీ ఈ తరహా సహాయాన్ని అందించాలనే ఉత్సాహం వాళ్ల బృంద సభ్యులకు పెరిగింది. అప్పటనుంచి.. ప్రభుత్వాసుపత్రుల నుంచి ఇప్పపూల లడ్డూలకు ఆర్డర్లు మొదలయ్యాయి. అక్కడున్న రోగుల కోసం ప్రభుత్వం తమ నుంచి లడ్డూలు కొనుగోలు చేయడంతో వాళ్లలో ఇంకా ఉత్సాహం పెరిగింది.

బస్తర్‌ ఫుడ్స్‌’కు సంబంధించి ఛత్తీస్‌గఢ్‌లో వివిధ ప్రాంతాలకు చెందిన 350 మందికి పైగా మహిళలు పనిచేస్తున్నారు. ఓ వైపు పొలం పనులు చూసుకుంటూనే తీరిక సమయాల్లో పనిచేస్తూ నెలకు నాలుగైదు వేల రూపాయలు సంపాదిస్తున్నారు. తమ ఉత్పత్తులు ఆన్‌లైన్‌లో ఉంచి దేశవ్యాప్తంగా విక్రయిస్తున్నట్లు ఆమె వివరించారు. ఇప్పటికే బస్తర్‌లో ఇప్పపువ్వు లడ్డూలతోపాటు టీకి కూడా మంచి డిమాండ్‌ ఏర్పడింది. త్వరలో మరిన్ని కొత్త ఉత్పత్తులను తీసుకువస్తామని ఆమె పేర్కొన్నారు. మహిళలకు ఉపాధి కల్పిస్తూనే బస్తర్‌ అంటే నక్సల్స్‌, వెనకబాటుతనం అన్న ముద్రను చెరిపేసి ఇప్పపూల ఉత్పత్తులకు ప్రఖ్యాతిగా మార్చాలన్నదే తన లక్ష్యమని రజియా తెలిపారు.

ఒక ఆలోచనతో ముందడుగు వేస్తేనే.. వ్యాపారంలో విజయం సాధించగలం. ఏ పని చేసినప్పుడైనా.. అడ్డంకులు రావడం సహజం. కానీ వాటిని అధిగమించి.. వినూత్నంగా ముందుకెళ్లిన రజియా ప్రయత్నం ఎంతోమందికి ఆదర్శం.

Read more RELATED
Recommended to you

Exit mobile version