టూ వీలర్ తయారీ సంస్థ బజాజ్ ఒకప్పుడు చేతక్ స్కూటర్‌ను మార్కెట్లో ప్రవేశపెట్టడం ద్వారా ఎంతో మంది కస్టమర్లను సొంతం చేసుకుంది. జనాలు ఒకప్పుడు చేతక్ స్కూటర్‌ను ఎంతగానో ఆదరించారు. ఇప్పటికీ ఆ స్కూటర్ మోడల్స్ మనకు అప్పుడప్పుడు రోడ్లపై కనిపిస్తుంటాయి. అయితే కాలం మారింది. ప్రస్తుతం ఎలక్ట్రిక్ వాహనాల యుగం నడుస్తోంది. అందుకనే బజాజ్ కూడా ఒకప్పటి చేతక్‌కు మార్పులు చేసి ఎలక్ట్రిక్ చేతక్గా మార్కెట్లోకి అందుబాటులోకి తెచ్చింది. అయితే ఈ మోడల్‌ను కూడా జనాలు ఆదరిస్తున్నారు.
బజాజ్ కంపెనీ ఎలక్ట్రిక్ చేతక్‌ను ఈ ఏడాది ఆరంభంలో మార్కెట్లో ప్రవేశపెట్టింది. అయితే కరోనా వల్ల అన్ని వాహనాల విక్రయాలు ఆగిపోయాయి. దీంతో ఎలక్ట్రిక్ చేతక్‌ను కూడా ఆరంభంలో కొనలేకపోయారు. అయితే గత 3 నెలల కాలంలో ఏకంగా 800 ఎలక్ట్రిక్ చేతక్ యూనిట్లు అమ్ముడయ్యాయి. అయితే ఆ సంఖ్య తక్కువే కావచ్చు, కానీ ఇతర కంపెనీలకు చెందిన ఎలక్ట్రిక్ టూవీలర్లతో పోలిస్తే ఎక్కువే. ఎందుకంటే గత 3 నెలల కాలంలో టీవీఎస్ కంపెనీ తన ఐక్యూబ్ ఎలక్ట్రిక్ స్కూటర్‌కు గాను కేవలం 138 యూనిట్లనే విక్రయించింది. అందువల్ల బజాజ్ ఎలక్ట్రిక్ చేతక్‌కు జనాల నుంచి ఆదరణ లభిస్తుందని చెప్పవచ్చు.
ఇక ఎలక్ట్రిక్ చేతక్‌లో 3కిలోవాట్ల బ్యాటరీని ఇచ్చారు. దీంతో అందులోని 4.8 కిలోవాట్ అవర్ మోటార్ నడుస్తుంది. ఈ క్రమంలో ఇంజిన్ 16ఎన్ఎం గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. 6.44 బీహెచ్పీ పవర్‌ను ఇస్తుంది. ఇక ఈ స్కూటర్‌ను పూర్తిగా చార్జింగ్ చేసి ఎకో మోడ్‌లో నడిపిస్తే ఏకంగా 95 కిలోమీటర్ల మైలేజీ ఇస్తుంది. అదే స్పోర్ట్ మోడ్‌లో అయితే 85 కిలోమీటర్లు వెళ్లవచ్చు. కాగా ఎలక్ట్రిక్ చేతక్ ఎక్స్ షోరూం ధర రూ.1.15 లక్షలుగా ఉంది.